ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. వేడుక చేస్తున్నాడు!

Chandra Babu Birth Date It Self Declare He Is 420 Says YS Jagan - Sakshi

చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఫైర్‌

సాక్షి, భీమవరం: ‘‘ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు. ఆయన ట్రస్టు, ఇ‍ల్లు, పార్టీని లాక్కున్నారు బాబు. ఆఖరకు ఆయన చావుకు కారణమైన వ్యక్తి కూడా చంద్రబాబే. ఇలాంటి వ్యక్తి ఇవాళ ఎన్టీఆర్ జయంతి వేడుకలు చేస్తుంటే ఆయన ఎలాంటి వాడో తెలుస్తుంది..’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గుర్తుచేశారు. 173వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

మహానాడులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విడగొట్టి అన్యాయం చేశారని చంద్రబాబు అంటారు. ఆశ్చర్యం ఏంటంటే తెలంగాణ మహానాడులో నా వల్లే తెలంగాణ వచ్చిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి వచ్చి మొసలి కన్నీరు కార్చుతారు. భీమవరం పట్టణంలో అవినీతి కంపు కొడుతోంది. కంపు ఎందుకు వస్తోందంటే కంపోస్టు యార్డ్‌ పెట్టాలని, చెత్తచెదారం పెరిగిపోతుందని అందుకు 10 ఎకరాల భూమిని సేకరించారు. ఏళ్లు గడుస్తున్నా దాన్ని ఏర్పాటు చేసే దిక్కే లేదు.

420 బుద్ధులు కలిగిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్‌ 20న జన్మించారని అంటే నాలుగో నెల 20వ తేదీ అని వీటిని కలిపితే 420 అవుతుందని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విమర్శించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడారు.

ప్రత్యేక హోదాను రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. ఎన్నికలప్పుడు ప్రత్యేక హోదాను పదేళ్లు తెస్తా అని చంద్రబాబు చెప్పారని, ఎన్నికల తర్వాత హోదా వచ్చిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయంటూ ప్లేటు ఫిరాయించారని చెప్పారు. హోదా కోసం వైఎస్సార్‌ సీపీ ధర్నాలు, దీక్షలు చేస్తే ప్రభుత్వం అడ్డుకుందని పేర్కొన్నారు. ఎంపీల రాజీనామాలపై చిన్నపాటి కథను వినిపించారు.

‘ఓ సిపాయి యుద్ధానికి బయల్దేరతాడు. వెళ్తూ వెళ్తూ తనతో పాటు తుపాకీని తీసుకెళ్తాడు. యుద్ధం తీవ్రంగా జరుగుతుంటుంది. అక్కడకు వెళ్లిన సిపాయి సైతం శత్రువుపై తుపాకీని గురి పెడతాడు. ఆ సమయంలో తుపాకీని పేల్చినప్పుడు గుండ్లు బయటకు రాలేదు. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌ అనే సిపాయి విషయంలో జరిగింది. ఏపీ ప్రత్యేక హోదా కోసం యుద్ధం ప్రారంభించింది.

తుపాకీని ఎక్కుపెట్టి కాల్చితే కేవలం ఐదు గుండ్లు(రాజీనామా చేసిన ఐదుగురు వైఎస్సార్‌ సీపీ ఎంపీలను ఉద్దేశించి) మాత్రమే బయటకు వచ్చాయి. మిగిలిన 20 గుండ్లు బయటకు రాలేదు. కారణం అవి నకిలీ గుండ్లు కనుక.’ మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామాలు చేసినట్లయితే దేశం మొత్తం ఏపీ వైపు తిరిగి చూసేదని, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ప్రత్యేక హోదా ఇచ్చి ఉండేదని అన్నారు.

భీమవరం నియోజకవర్గంలో తాగునీటికి ప్రజలు అగచాట్లు పడుతున్నారు. ఓ అక్క మేం తాగుతున్న నీరు ఇది అన్నా అంటూ ఓ బాటిల్‌ తీసుకొచ్చి ఇచ్చారు. చంద్రబాబుకు ఆ బాటిల్‌ చూపిస్తున్నా. ఇది చెరకు రసం కాదయ్యా చంద్రబాబు.. మంచి నీరు..!. గోదావరి జిల్లాల్లో అవనీతి రాజ్యం ఏలుతోంది. ఆక్వా రంగానికి చిరునామాగా ఉన్న ఈ ప్రాంతం తన అడ్రస్‌ను నిలుపుకునేందుకు అగచాట్లు పడుతోంది.

వైఎస్సార్‌ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తిరిగి తీసుకుంటుంది. పేదవాళ్లకు ఇళ్ల పేరుతో ప్రభుత్వం దోచుకుంటోంది. ఫ్లాట్‌కు మూడున్నర లక్షలు నెలకు రూ. 3 వేలు 20 ఏళ్ల పాటు కట్టుకుంటూ....... పోవాలట..!. ఆ ఫ్లాట్ల మీద ప్రజలు కట్టాల్సిన మూడున్నర లక్షలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేస్తుంది. ఆ తర్వాత అవినీతికి పాల్పడ్డ చంద్రబాబునూ వదలిపెట్టం. తుందుర్రులో ఆక్వాఫుడ్ పార్కును అధికారంలోకి వచ్చిన తర్వాత సముద్ర తీరానికి తరలిస్తాం. చంద్రబాబు ప్రభుత్వం 250 మంది తుందుర్రు వాసులను ఆక్వా ఫుడ్‌ ప్రాజెక్టుపై ప్రతిఘటించినందుకు జైల్లో పెట్టించింది.

ఎన్నికల సమయం దగ్గర పడే వరకూ చంద్రబాబు మెదడు పని చేయదు. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తాయనగా ఆయనకు ఫ్యూజ్‌ వెలుగుతుంది. మొన్న ఆక్వా రైతులతో విద్యుత్‌ యూనిట్‌కు రూ. 2లు తగ్గిస్తానని బాబు చెప్పారు. అది కూడా ఒక ఏడాది పాటేనట. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక యూనిట్‌కు రూ. 1.50 మాత్రమే చార్జి చేస్తాం. ఐదేళ్ల పాటు ఇదే కొనసాగిస్తాం. ఐస్‌ ఫ్యాక్టరీలు తదితరాలకు ఇచ్చే విద్యుత్‌ ధరను యూనిట్‌కు రూ. 5కే ఇస్తాం. దాళారులపై ఉక్కుపాదం మోపుతాం. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో మనం చూసింది ఏంటని ఆలోచించండి. అబద్దాలు, మోసం చేయడం మాత్రమే చంద్రబాబు చేశారు. ఆయన పాలనలో విచ్చలవిడి అవినీతి జరుగుతోందని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top