కేసీఆర్‌ది అప్రజాస్వామిక పాలన 

chada comments on kcr - Sakshi

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం: తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో తమ పార్టీ ‘పోరుబాట’యాత్ర చేపట్టిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ నెల 6న జనగామలో ప్రారంభమైన పోరుబాట యాత్ర శనివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన అప్రజాస్వామిక పద్ధతులతో, నియంతృత్వ పోకడలతో కొనసాగుతోందన్నారు. దళిత ముఖ్యమంత్రి, దళిత కుటుంబానికి మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్రూం ఇళ్లు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య హామీలు అటకెక్కాయని విమర్శించారు.

తెలంగాణ వస్తే కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఉండరని చెప్పిన కేసీఆర్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ఎందుకు వారిని క్రమబద్ధీకరించడంలేదని చాడ ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 16 వేల ఉద్యోగాలను మాత్రమే ప్రభుత్వం భర్తీ చేసిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జేఏసీ చైర్మన్‌ కోదండరాంను వాడు..వీడు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంబోధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారానికి ప్రజలు ముఖ్యమంత్రిని కలిసే సంప్రదాయం గతంలో ఉండేదని, అహంకారియైన కేసీఆర్‌ మాత్రం ప్రజలను కలవడంలేదన్నారు. సీసీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కావలి నర్సింహ అధ్యక్షతన జరిగిన ఈ సభలో నాయకులు బాలమల్లేశ్, పశ్య పద్మ, ఎం.డి.యూసుఫ్, సాయిలు, సృజన తదితరులు పాల్గొన్నారు.  

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీలు భర్తీ చేయండి 
సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు శనివారం ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చాలా ఏళ్లుగా వివిధ కేటగిరీల్లో పోస్టులు ఖాళీగా ఉండటంతో రోగులు ప్రత్యామ్నాయ బాట పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. దాదాపు 12,700 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయని, వీటిని భర్తీ చేస్తే సేవలు కొంతైనా మెరుగుపడతాయని పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top