వైఎస్సార్‌సీపీ లిస్ట్‌: ఎన్నికల తర్వాత చంద్రబాబు జైలుకే!

Celebrations Over YSR Congress Party Candidates List - Sakshi

సాక్షి, అమరావతి/ఇడుపులపాయ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ అన్ని వర్గాల ప్రజలకు సముచిత ప్రాధాన్యం ఇస్తూ.. సామాజిక సమీకరణలను గౌరవిస్తూ.. అన్ని వర్గాల ప్రజలను ఆదరిస్తూ.. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ప్రకటించడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులే కాదు.. అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అభ్యర్థుల ప్రకటనతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సంబరాలు వెల్లువెత్తాయి. తమ అభిమాన నేతకు టికెట్‌ దక్కడంతో పార్టీ శ్రేణులు సైతం ఆనంద డొలికల్లో తేలిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న పండుగ వాతావరణం అప్‌డేట్స్‌ ఇవి..

  • విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్‌ను ప్రకటించడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌తోనే  రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. పశ్చిమ సీటు గెలిచి జగనన్నకు గిఫ్ట్‌గా ఇస్తానని చెప్పారు. జగన్‌కు వెన్నుపోటు పొడిచిన జలీల్ ఖాన్‌కు ప్రజలే ఓటుతో బుద్ధి చెబుతారని అన్నారు.
     
  • ప్రకాశం: రాష్ట్రాన్ని చంద్రబాబు అడ్డగోలుగా దోచుకున్నారని చీరాల వైస్సార్‌సీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ మండిపడ్డారు. చంద్రబాబుపై గతనెలలో తాను చేసిన ఆరోపణలకు ఆయన ఇప్పటివరకు సమాధానం చెప్పలేదని, పోలీస్ వ్యవస్థని అడ్డుపెట్టుకొని పోలింగ్ చేయాలని బాబు చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల తరువాత చంద్రబాబు జైలుకు వెళ్ళక తప్పదన్నారు.
     
  • అనకాపల్లి: వైఎస్సార్‌సీపీలో మహిళలకు  ప్రాధాన్యం ఉంటుందనడానికి వారికి కేటాయించిన సీట్లే నిదర్శనమని అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సత్యవతి అన్నారు. వైఎస్‌ జగన్‌ అన్న ఇచ్చిన మాట ప్రకారం బీసీలను గుర్తించారని తెలిపారు. అరకు లోక్‌సభ అభ్యర్థి గోడ్డేటి మాధవి మాట్లాడుతూ.. ఇఛ్చిన మాట ప్రకారం వైఎస్‌ జగన్‌ తనకు టికెట్ కేటాయించారని, డబ్బు కంటే విశ్వాసానికి, విలువలకు ఆయన పెద్దపీట వేశారని అన్నారు. గిరిజనులకు సేవ చేయడానికి జగన్‌ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పారు.
     
  • కర్నూల్: నంద్యాల అసెంబ్లీ స్థానం వైస్సార్‌సీపీ అభ్యర్థిగా తనను ప్రకటించడం శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. నంద్యాలలో వైస్సార్సీపీ జండా ఎగురవేయడం ఖాయమని శిల్పా రవి ధీమా వ్యక్తం చేశారు.
     
  • పశ్చిమ గోదావరి: పాలకొల్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా డాక్టర్‌ బాబ్జిని ప్రకటించడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పోడూరు ఎంపీపీ గుంటూరి వాణి, పెద్దిరాజు, గుబ్బల వేణుగోపాల స్వామి, పార్టీ శ్రేణులు ర్యాలీగా వచ్చి ఆయనకు మద్దతు ప్రకటించారు. పార్టీ శ్రేణులందరినీ కలుపుకొని ప్రచారానికి శ్రీకారం చూడతానని డాక్టర్ బాబ్జి అన్నారు.
     
  • కర్నూలు: బనగానపల్లె వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా తనను పార్టీ ప్రకటించడంపై కాటసాని రామిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు జీవితాంతం వైఎస్ జగన్‌కు ఋణపడి ఉంటామన్నారు. టీడీపీ పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరకు వచ్చాయన్నారు. బనగానపల్లె నియోజకవర్గ ప్రజల మద్దతు తనకు ఉందని.. తప్పక విజయం సాధిస్తానని రామిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
     
  • కాకినాడ : బాపట్ల ఎంపీ స్థానం మాదిగ సామాజిక వర్గానికి చెందిన నందిగం సురేశ్‌కు కేటాయించి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్‌కు మాదిగ ఐక్య వేదిక చైర్మన్ మడికి కిషోర్‌ బాబు కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక న్యాయానికి జగన్‌ పెద్దపీట వేశారని అన్నారు.
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top