ఎన్నికలకు ముందే అభ్యర్థుల ప్రకటన

Candidates' declare before elections - Sakshi

యోచిస్తున్న కాంగ్రెస్‌ పెద్దలు

అధిష్టానంతో చర్చించేందుకు టీపీసీసీ చీఫ్‌ యత్నాలు  

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికలకు ముందే పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అభ్యర్థులందరినీ ఎన్నికలకు ముందే ప్రకటించే అవకాశం లేదని, అంతా సవ్యంగా ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే ప్రకటిస్తారనే చర్చ కాంగ్రెస్‌ నేతల్లో జరుగుతోంది.  అభ్యర్థులను ముందుగా ఖరారు చేస్తే వారు నియోజకవర్గాల్లో పనిచేసుకునేందుకు తగిన సమయం లభిస్తుందని పార్టీ భావిస్తోంది. 

మెజార్టీ నేతల అభ్యర్థన మేరకు టీపీసీసీ పెద్దలు ఈ అంశంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ముందస్తు ఖరారు మేలు చేస్తుందనే ఉద్దేశంతో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఉన్నారని, ఈ మేరకు ఆయన పార్టీ అధిష్టానంతో చర్చించేందుకు ప్రయత్నిస్తున్నారని గాంధీభవన్‌ వర్గాలంటున్నాయి. అధిష్టానం అంగీకరిస్తే నవంబర్, డిసెంబర్‌ల్లో కనీసం 60 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.  

సర్వేలు తమకే అనుకూలం..
నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనపై రాష్ట్ర ప్రజానీకం సంతృప్తిగా లేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేని టీఆర్‌ఎస్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని క్షేత్రస్థాయిలో అర్థమవుతోందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌ కుటుంబ పాలన చేస్తుందనే అభిప్రాయం ఎన్నికల్లో తమకు లబ్ధి చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఇటీవల పార్టీ  నిర్వహించిన సర్వే కూడా తమకు అనుకూలంగా ఉందని వారు చెబుతున్నారు.

మొత్తం 119 అసెంబ్లీ స్థానా లకు గాను 72 స్థానాల్లో కాంగ్రెస్, 38 టీఆర్‌ఎస్‌ గెలు చుకుంటాయని సర్వేల్లో వచ్చిందని చెబుతున్నారు.  ఆదివారం జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ శనివారం ఢిల్లీ వెళ్లారు. సీఎల్పీ నేత జానారెడ్డి, సీనియర్‌ నేతలు   షబ్బీర్‌ అలీ, వి.హనుమంతరావు, మధుయాష్కీ, చిన్నారెడ్డి, సంపత్‌ కుమార్‌లు కూడా ఢిల్లీ వెళ్లారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top