రైతన్న మేలు కోరే ప్రభుత్వమిది

Buggana Rajendranath Reddy fires on TDP - Sakshi

బురద జల్లడమే టీడీపీ వంతు

విపక్షం తీరుపై బుగ్గన ధ్వజం

బడ్జెట్‌లో స్పష్టత ఇచ్చినా రగడ

రుణ మాఫీ పేరుతో రైతును నిండా ముంచారు 

సాక్షి, అమరావతి: రైతన్నలకు మంచి చేస్తున్న తమ ప్రభుత్వంపై ఉద్దేశ పూర్వకంగా బురద జల్లడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు. రైతు భరోసా పథకంపై టీడీపీ సభ్యులు చేస్తున్న విమర్శలను ఆయన సమర్థవంతంగా తిప్పికొట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతును ఎలా మోసం చేశారో, నీరు చెట్టు పేరుతో ఏ విధంగా దోచుకున్నారో మంత్రి ఎండగట్టారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుడు లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. దీనిపై సభ్యుడు మాట్లాడుతూ, పథకాన్ని వక్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ దశలో బుగ్గన జోక్యం చేసుకుని వాస్తవాలను సభకు వివరించారు.

బడ్జెట్‌లో పూర్తి స్పష్టత
రైతు భరోసా గురించి బడ్జెట్‌ పుస్తకాల్లో స్పష్టంగా చెప్పామన్నారు. ప్రతి రైతుకు వైఎస్సార్‌ రైతు భరోసా కింద పంటకాలం ప్రారంభానికి ముందే మే నెలలో రూ.12,500 పెట్టుబడి మద్దతును సమకూర్చుతామని చెప్పామన్నారు. వాస్తవంగా మే నెలాఖరులో ప్రభుత్వం ఏర్పడినందున, వచ్చే మే నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తే రైతులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో అక్టోబర్‌ 15 నుంచి అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పెద్దమనసుతో ముందుకు వచ్చారన్నారు. ఇందుకోసం రూ.8,750 కోట్లు కేటాయించామని చెప్పారు. 64.6 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతారన్నారు. ఇందులో 15.36 లక్షల మంది కౌలు రైతులున్నారని చెప్పారు. సాగు పెట్టుబడి మద్దతు కోసం కౌలు రైతులను అర్హులుగా గుర్తించిన తొలి ప్రభుత్వం తమదేనన్నారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి విపత్తుల నుంచి ఆదుకోవడానికి రూ.2 వేల కోట్లు, రైతుల ఉచిత విద్యుత్‌కు రూ.4,525 కోట్లు కేటాయించామన్నారు. రైతు కట్టాల్సిన బీమా సొమ్మును ప్రభుత్వమే కడుతోందన్నారు. యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులకు బ్యాంకులు అప్పులిచ్చేలా చట్టం తెస్తున్నామని చెప్పారు.

రైతులను దగా చేశారు
రైతులకు రూ.87 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సిన గత టీడీపీ ప్రభుత్వం దానిని రూ.24 వేల కోట్లకు కుదించి కేవలం రూ.15,279 కోట్లు మాత్రమే ఇచ్చిందని బుగ్గన విమర్శించారు. నీరు– చెట్టు పథకానికైతే విపరీతంగా కేటాయింపులు చేశారన్నారు. రూ.793 కోట్లు కేటాయించి, రూ.4,850 కోట్లు ఖర్చు పెట్టారని, ఇది కేటాయింపుల కన్నా ఆరింతలు ఎక్కువన్నారు. నిజానికి ఎక్కడా నీరు లేదు.. చెట్టూ లేదని, తెలుగుదేశం కార్యకర్తల జేబులు నింపేందుకే ఈ పథకం ఉపయోగపడిందన్నారు. ఇలాంటి టీడీపీకి తమను ప్రశ్నించే హక్కు లేదన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top