జనంపై అప్పుల కుంపటి

Buggana Rajendranath Reddy fires on Chandrababu - Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆగ్రహం 

ఆర్‌బీఐ తక్కువ వడ్డీకే రుణాలిస్తుందని మీరే చెబుతూ అధిక వడ్డీకి బాండ్లు ఎందుకు జారీ చేయాలి? 

6 శాతం వడ్డీకి ఇన్‌ఫ్రా బాండ్లు విడుదల చేయాలని జీవో 65లో పేర్కొన్నది వాస్తవం కాదా?  

దీనికి విరుద్దంగా 10.7 శాతం వడ్డీతో రాజధాని బాండ్లు ఎందుకు జారీ చేశారు?  

కేంద్రం నిధులివ్వకపోతే నాలుగేళ్లుగా ఎందుకు ప్రశ్నించలేదు? 

టీడీపీ పాలకులు హంగూ ఆర్బాటాలకు, అవినీతికి ప్రజలు డబ్బులు చెల్లించాలా? 

ఆంధ్రప్రదేశ్‌ను దివాలా రాష్ట్రంగా మార్చటానికి మీరు సిద్ధమవుతుంటే మేం నోరు మూసుకుని కూర్చోవాలా?

చివరిగా ఒకే మాట అడుగుతున్నాం. అమరావతి బాండ్ల అంశంపై వివరణలు, ప్రకటనలు నేరుగా ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి కాకుండా నామినేటెడ్‌ వ్యక్తితో ఎందుకు చేయిస్తున్నారు? దీన్ని బట్టే మొత్తం వ్యవహారమంతా డొంకతిరుగుడు మార్గంలో సాగుతున్నట్లు అర్థమవుతోంది

సాక్షి, హైదరాబాద్‌: ‘‘కేవలం 6 శాతం వడ్డీతో ఇన్‌ఫ్రా బాండ్లు విడుదల చేసి డబ్బు కూడగట్టాలని, 8 శాతం లోపు వడ్డీ అయితేనే హడ్కో నుంచి రుణం తీసుకోవాలని టీడీపీ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 8న జీవో నంబరు 65ను జారీ చేసిన విషయం వాస్తవం కాదా? కనీసం దీనికైనా కట్టుబడకుండా 10.7 శాతం వడ్డీ చెల్లించేలా రాజధాని పేరుతో బాండ్లు జారీ చేయడం వెనుక రహస్యం ఏమిటి? మీ కమీషన్ల కోసం అధిక వడ్డీలకు భారీగా రుణాలు తీసుకుని, ప్రజల నెత్తిన అప్పుల కొండ పెట్టడమే మీ లక్ష్యమా?’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నిలదీశారు. అమరావతి బాండ్ల జారీ విషయంలో తాము మీడియా సమావేశంలో లేవనెత్తిన మౌలిక ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సీఆర్‌డీఏ అధికారి, ప్రభుత్వ ప్రతినిధిగా కుటుంబరావు పొంతనలేని అంశాలు మాట్లాడారని పేర్కొన్నారు. తమ మౌలిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తున్నట్లు తేటతెల్లమైందన్నారు. ఈ నేపథ్యంలో వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు మీడియా ద్వారా ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు బుగ్గన బుధవారం బహిరంగ లేఖ విడుదల చేశారు. లేఖలో ఆయన ఏం పేర్కొన్నారంటే... 

ప్రాజెక్టులను సైతం తాకట్టు పెట్టారు 
‘‘రాజధాని నిర్మాణం కోసం ఏ మార్గాల్లో అయినా డబ్బు తీసుకొస్తామని ఒకవైపు చంద్రబాబు సర్కారు చెబుతోంది. మరోవైపు ఆర్‌బీఐ నుంచి తక్కువ వడ్డీకి రుణం తీసుకుంటే భూములు తాకట్టు పెట్టాల్సి వస్తోంది కదా అని కుటుంబరావు అంటున్నారు. ఇందులో మతలబు ఏమిటి? ఇప్పుడు తెచ్చిన రుణాలకు తాగునీటి ప్రాజెక్టులను సైతం తాకట్టు పెట్టింది వాస్తవం కాదా? 

నాలుగేళ్లు ఏం చేశారు? 
కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వనంటున్నందు వల్ల అప్పులకు వెళ్లాల్సి వస్తోందని ఇప్పుడు చెప్పడం ఏమిటి? కేంద్రం గ్రాంటుగా ఇవ్వాల్సిన మొత్తాన్ని నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మీరు ఎందుకు తెచ్చుకోలేకపోయారు? బ్యాంకులు రుణాలు ఇవ్వాలంటే, బ్యాంకర్లు అడిగే ఎన్నో ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానాలు ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇవ్వడానికి మీరు సిద్ధంగా లేనందునే కొత్త పద్ధతిలో బాండ్లకు వెళుతున్న విషయం వాస్తవమా? కాదా? గ్రేటర్‌ హైదరాబాద్‌ బాండ్ల విషయంలో రీ పేమెంట్‌ సెక్యూరిటైజ్‌ అయినందున తక్కువ వడ్డీ రేటు వచ్చిందంటున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే డబ్బు నుంచే అసలూ, వడ్డీ కట్టుకోవాలని దీని అర్థం కదా! ఈ బాండ్ల అప్పునకు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సంబంధం ఉండదు. దీని భారం రాష్ట్ర ప్రజలపై పడదు. కానీ, ఏపీలో రాజధాని పేరిట సాగిస్తున్న బాహుబలి సెట్టింగులకు, పాలకుల హంగూ, ఆర్బాటాలకు, వారు చేసే భారీ అవినీతికి, కుంభకోణాలకు ప్రజలను పన్నుల రూపంలో డబ్బు చెల్లించమంటే ఎందుకు కడతారు? ఎందుకు చెల్లించాలో చెప్పండి. 

మీ ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెడుతున్నారా?
రాజధాని తొలి దశ ప్రాజెక్టులకే రూ.48,115 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఇందులో రూ.26,600 కోట్ల విలువైన 32 పనులు జరుగుతున్నాయని మీ అనుకూల పత్రికల్లో రాయించుకున్నారు. ఈ డబ్బంతా ఎక్కడ నుంచి వస్తోంది? తాకట్టు లేకుండానే డబ్బు వస్తోందా? లేదంటే వీటన్నింటికీ ఏం తాకట్టు పెడుతున్నారు? మీ సొంత భూముల్ని, మీ ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెడుతున్నారా? మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, ఎవరన్నా ప్రశ్నిస్తే మీరు అప్పు ఇప్పిస్తారా? మీకే బ్రోకరేజీ ఫీజు ఇస్తాం అని అంటున్నారు. ఇదేం తీరు? 

రూ.1.20 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏమి చేశారు?
కేంద్రాన్ని ఎన్నిసార్లు అభ్యర్థించినా నిధులు ఇవ్వకపోవటం వల్ల ప్రపంచ బ్యాంకును అడుగుతున్నామని మీరు చెబుతున్నారు. కేంద్రం ఇవ్వకపోతే నాలుగేళ్లకు పైగా ఏం చేశారు? కేంద్రాన్ని ఇప్పటికీ ఎందుకు నిలదీయడం లేదు. మీరు ఈ నాలుగేళ్లలో అధికారికంగా చేసిన రూ.1.20 లక్షల కోట్ల అప్పులు ఎటుపోయాయంటే లెక్క లేదు. ఆ అప్పులకు తోడుగా ఇప్పుడు కొత్త పద్ధతుల్లో, మీ పార్టీ ఎంపీలూ, పెద్దలూ బ్యాంకుల్ని ముంచిన పద్ధతిలో ఆంధ్రప్రదేశ్‌ను దివాలా రాష్ట్రంగా మార్చటానికి... లెక్కా పత్రం లేకుండా, ఎంత వడ్డీకైనా తీసుకుని బోర్డు తిప్పేయడానికి మీరు సిద్ధమవుతుంటే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మేం గుడ్లప్పగించి, నోరు మూసుకుని కూర్చోవాలా?. కుటుంబరావు చెప్పే కట్టుకథలు వినాలా?’’ అని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నిప్పులు చెరిగారు. 

టీడీపీ ప్రభుత్వానికి బుగ్గన సంధించిన పలు ప్రశ్నలు 
1 రాజధాని బాండ్ల విషయంలో వడ్డీరేటు 10.5 శాతం కాదు, 10.32 శాతమేనంటూ సీఆర్‌డీఏ సమాధానం ఇవ్వడం విచిత్రంగా ఉంది. అసలు 10.32 శాతం వడ్డీతో బాండ్లు ఎందుకు జారీ చేయాలన్నదే మా మౌలిక ప్రశ్న? మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తే ఇది 10.7 శాతం కంటే మించుతుందనేది వాస్తవమా? కాదా?

2 ముంబయి స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌కి కమీషన్‌ ఇవ్వలేదని కుటుంబరావు పేర్కొన్నారు. కానీ, మర్చంట్‌ బ్యాంకర్‌కు 0.85 శాతం కమీషన్‌తోపాటు జీఎస్‌టీ కూడా చెల్లిస్తున్నట్లు టీడీపీ ప్రభుత్వం జీవో ఎలా ఇచ్చింది? ఈ రకంగా కమీషన్‌ రూ.17 కోట్లు, జీఎస్‌టీ పన్నులతో కలిపి రూ.20 కోట్లు చెల్లించడం దుర్మార్గం కాదా? 

3 బాండ్ల రూపంలో సేకరించిన రూ.2,000 కోట్లను ఆరో సంవత్సరం నుంచి వెనక్కి ఇవ్వడం ప్రారంభిస్తే, మీరు అనుమతించిన విధంగా అదే సంవత్సరం పెట్టుబడిదారులందరూ తమకు 20 శాతం వెనక్కి ఇవ్వాలని అడగవచ్చు కదా? ఇది నిజమా కాదా?

4 రూ.2,000 కోట్లకు రూ.1,573 కోట్లు ‘మాత్రమే’ వడ్డీ కడుతున్నామనడం దారుణం కాదా? రాష్ట్ర ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసే పన్నుల నుంచి రూ.1,573 కోట్లు వడ్డీ చెల్లించడం మీకు ఆషామాషీగా కనిపిస్తోందా? ఈ అప్పు ద్వారా లాభం పొందేది ఎవరు? ఎన్నికలు ఆరు నెలలు కూడా లేని హడావుడిగా చేస్తున్న ఈ అప్పులకు రెండు మూడు తరాలు అసలూ వడ్డీలూ కట్టాలా? ఇలాంటి వడ్డీలతో ఎన్ని సాగునీటి ప్రాజెక్టులను నిర్మించవచ్చో ఎప్పుడన్నా ఆలోచించారా?
 
5 ప్రస్తుతం ఉన్న జనంపైనా, రాబోయే తరాలపైనా నిప్పుల కుంపటి లాంటి అప్పులను మూటగట్టి పెడతున్నారు. ఇలా మీరు కమీషన్ల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం న్యాయమేనా?
  
6 అప్పు తీసుకోవడానికి ఎలాంటి విధానం అనుసరించాలో వివరిస్తూ మీ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 8న విడుదల చేసిన చేసిన జీవో 65లో ఏం చెప్పారు? 8 శాతంలోపు వడ్డీ అయితేనే హడ్కో నుంచి రుణం తీసుకోవాలని ఆ జీవోలో స్పష్టంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో పన్ను రాయితీ వర్తించే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్లను కేవలం 6 శాతం వడ్డీరేటుతో విడుదల చేయాలని జీవోలో పేర్కొన్నారు. మరి దీనికి విరుద్దంగా 10.7 శాతం వడ్డీ చెల్లించేలా అమరావతి బాండ్లు జారీ చేశారంటే ఏమనాలి? గోల్‌మాల్‌ అనకుండా గొప్పతనం అంటారా? 

7 రుణం కోసం హడ్కోను మీరు ఎందుకు సంప్రదించలేదన్నది మా ప్రశ్న కాదు. ఇంత భారీ వడ్డీ రేటుకు ఎక్కడ వీలుంటే అక్కడ ఎందుకు అప్పు చేస్తున్నారన్నదే మా ప్రశ్న.ప్రభుత్వాలకు బ్యాంకుల నుంచి ఇంతకంటే తక్కువ వడ్డీకే అప్పు లభిస్తున్నప్పుడు భారీ వడ్డీ రేటుకు బాండ్లు జారీ చేశారంటే కచ్చితంగా ఎవరికో ప్రయోజనం కలిగించేందుకు పథకం ప్రకారం ఇదంతా చేస్తున్నారని మాతోపాటు ప్రజలూ అనుమానిస్తున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top