విజనరీ బాబూ... ‘రాజధాని’కి లెక్కలున్నాయా?

Buggana Rajendranath Reddy comments on Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ విఫల నేతగా మిగిలిపోతారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తేల్చిచెప్పారు. రాష్ట్రానికి కొత్త రాజధాని నగరాన్ని నిర్మించే అవకాశాన్ని చంద్రబాబు అసంబద్ధమైన, అహేతుకమైన విధానాలతో భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చులకు లెక్కలున్నాయా? ప్రశ్నించారు. బుగ్గన శనివారం హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అమరావతి బాండ్లలో పెట్టుబడి పెట్టిన 9 మంది వివరాలను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. అన్నింటిలోనూ ప్రభుత్వం పారదర్శకంగా ఉందని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఆ 9 మంది పేర్లను ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. రేపు పొద్దున బడ్జెట్‌ బుక్కులో చూపించాల్సిందేనని అన్నారు. ‘‘సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ రూ.15,000 కోట్ల అప్పును 7.9 శాతం వడ్డీకి తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో నెంబర్‌ 21 తీసుకొచ్చింది. ఇంత తక్కువ వడ్డీకి అప్పు పుట్టే పరిస్థితి ఉంటే రాజధాని కోసం రూ.2,000 కోట్లను అమరావతి బాండ్ల పేరిట 10.23 శాతం వడ్డీకి ఎందుకు తీసుకున్నారు?’’ అని నిలదీశారు. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే... 

మిగతా సొమ్ము ఎక్కడి నుంచి తెస్తారు? 
‘‘రెండు, మూడు దశల్లో రాజధాని నగరాన్ని నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మొదటి దశ నిర్మాణానికి రూ.48,110 కోట్లు అవసరమని, 56 పనులు చేయాల్సి ఉందని ధ్రువీకరించింది. ఇప్పటికే రూ.26,600 కోట్లతో 36 పనులు జరుగుతున్నాయని చెప్పింది. 6 పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని, వీటికి రూ.10,600 కోట్లు అవసరమని పేర్కొంది.  ఇంకా టెండర్లకు సిద్ధంగా 18 పనులు ఉన్నాయని, వీటికి రూ.11,132 కోట్లు అవసరమని తేల్చింది, ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆంధ్రా బ్యాంకు, ఇండియన్‌ బ్యాంకు, విజయ బ్యాంకుల నుంచి రూ.2,060 కోట్లు అప్పుగా తీసుకుంది. హడ్కో నుంచి రూ.14,050 కోట్లు అప్పు చేసింది. పునర్వీభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1,500 కోట్లు ఇచ్చింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం బాండ్ల రూపంలో రూ.2,000 కోట్లు తీసుకుంది. మొత్తం రూ.7,010 కోట్లు అయ్యింది. రాజధాని నిర్మాణానికి ఈ ఏడాది దాదాపు రూ.18,000 కోట్లు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబే చెబుతున్నారు. ప్రభుత్వం చేతుల్లో ఉండేది రూ.7,000 కోట్లే, మరి మిగతా సొమ్మును ఎక్కడి నుంచి తెస్తారు? మరోవైపు రూ.26,600 కోట్లతో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించామని చంద్రబాబు అంటున్నారు. సీఈవో, సీఎఫ్‌వోగా, విజనరీగా, థింకర్‌గా పేరుగాంచిన చంద్రబాబుకు ఈ లెక్కలు తెలియవా? 

గొప్ప రాజధానులను పరిశీలిద్దామా? 
ప్రపంచ బ్యాంకు నుంచి రూ.8,300 కోట్లు తీసుకురావాలని టీడీపీ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. హడ్కో నుంచి ఇంకా రూ.6,200 కోట్లు, వివిధ బ్యాంకుల నుంచి ఇంకా రూ.10,000 కోట్లు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ప్లాన్‌ తయారు చేశారు. ఇవన్నీ తెచ్చినా ఇంకా రూ.24,500 కోట్ల అప్పులు చేయాల్సి వస్తుంది. ఇప్పటివరకు రూ.31,000 కోట్లు మాత్రమే మీ(చంద్రబాబు) చేతికి వస్తాయి. మొదటి దశ పనులకు రూ.48,110 కోట్లు అవసరమని చంద్రబాబే అంటున్నారు. అంటే మొదటి దశ పనులకే రూ.17,000 కోట్ల నిధుల కొరత ఉంది.   మరోవైపు.. చత్తీస్‌గఢ్‌ రాజధాని నయా రాయపూర్‌ను కేవలం రూ.10,000 కోట్లతో నిర్మించారు. 

ఐదు కంపెనీలకే నిర్మాణ బాధ్యతలా?
రాజధాని నిర్మాణానికి 2016–17 బడ్జెట్‌లో కేటాయించిన నిధులు కేవలం రూ.310 కోట్లు, ఇందులో ఖర్చు చేసింది రూ.కోటి మాత్రమే. 2017–18 బడ్జెట్‌లో రూ.670 కోట్లు కేటాయిస్తే, ఇందులో ఎంత ఖర్చు చేశారో ప్రభుత్వం చెప్పలేదు. 2018–19 బడ్జెట్‌లో రూ.7,741 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఇందులో అమరావతికి రూ.400 కోట్లు మాత్రమే ఉన్నట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం రాజధానిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనులు మాత్రమే జరుగుతున్నాయి. వీటిపైనా ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోంది. ఇంతపెద్ద దేశంలో కేవలం 5 కంపెనీలకు మాత్రమే రాజధాని నిర్మాణ బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. వారే(5 కంపెనీలు) రోడ్లు వేస్తారట! వారే బిల్డింగ్‌లు కడతారట! 

ప్రజలు నవ్వుతున్నారు బాబూ!
బాబ్లీ ప్రాజెక్టు అంశంలో వచ్చిన నోటీసులపై చంద్రబాబు హంగామా చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారు.  ఎన్డీయే ప్రభుత్వంలో బాబు భాగస్వామిగా ఉన్నప్పుడే 35 సార్లు నోటీసులు వచ్చాయి’’ అని బుగ్గున రాజేంద్రనాథ్‌రెడ్డి నిప్పులు చెరిగారు. 

సర్వేల్లో వైఎస్‌ జగన్‌ ప్రభంజనం 
ఇండియా టుడే ఇటీవల ‘ఏపీ తర్వాత సీఎం’ పేరిట నిర్వహించిన సర్వేలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 43 శాతం ప్రజాదరణతో ముందంజలో ఉన్నారని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. మరో ఆరు నెలలకు అది 63 శాతానికి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న చంద్రబాబు కేవలం 38 శాతంతో వెనుకంజలో ఉన్నారని పేర్కొన్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీకి 38 శాతమే రావడం ఆయన అవినీతి పరిపాలనకు అద్దం పడుతోందన్నారు. ఈ సర్వే నుంచి ఏపీ ప్రజల మైండ్‌ను డైవర్ట్‌ చేసేందుకు చంద్రబాబు అనుకూల మీడియాలో నేడో రేపో ఏదో ఒక సర్వే పేరుతో కథనాలు అల్లి ప్రచురిస్తారని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఎద్దేవా చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top