గోరక్షక్‌ల్లాగా రేపిస్ట్‌ రక్షక్‌లు పెరిగిపోయారు

Brundakarat on rapists - Sakshi

రేపిస్ట్‌ రక్షక్‌లకూ శిక్షలు విధించాలి

కఠువా బాధితురాలికి వ్యతిరేకంగా బీజేపీ అగ్రనేతలు రోడ్డెక్కారు

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌

సాక్షి, హైదరాబాద్‌: పోస్కో చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర కేబినెట్‌ చేసిన ఆర్డినెన్స్‌ను సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ ఎద్దేవా చేశారు. కఠువా, ఉన్నావ్‌ ఘటనల నేపథ్యంలో కేంద్రం చేసిన ఆర్డినెన్స్‌లో చిత్తశుద్ధి లేదని, రేపిస్ట్‌ రక్షక్‌లకు కూడా శిక్షలు విధిస్తూ ఆర్డినెన్స్‌ తేవాలని ఆమె డిమాండ్‌ చేశారు. సీపీఎం జాతీయ మహాసభల సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లా డుతూ గోరక్షక్‌ల్లాగానే దేశంలో రేపిస్ట్‌ రక్షక్‌లు కూడా పెరుగు తున్నారన్నారు.

కథువా బాధితురాలి కుటుంబానికి వ్యతిరేకంగా బీజేపీ అగ్రనేతలు రోడ్లెక్కి ఆందోళన చేయడం దారుణమన్నారు. ‘బాధితులను మతం పేరుతోనే ఎంచుకున్నారు.. నిందితులను మతం పేరుతోనే రక్షిస్తున్నారు. ఇదేం పాపం’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులపై అత్యాచారాల విషయంలో ప్రధాని మోదీ చాలా ఆలస్యంగా స్పందించారని ఆమె ఎద్దేవా చేశారు.

బీజేపీకి లోక్‌సభలో పూర్తి మెజార్టీ ఉన్నా గత నాలుగేళ్లలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టడం కాదు కదా... ఒక్కసారి కూడా పార్లమెంటు ఎజెండాలో చేర్చలేదని, మహిళల పట్ల బీజేపీకున్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని అన్నారు. వికలాంగుల హక్కులను కాలరాస్తున్నారని, బడ్జెట్‌లో వారికి తగిన విధంగా నిధులు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  

మాది మిస్‌డ్‌ కాల్‌ సభ్యత్వం కాదు
జాతీయ మహాసభల్లో భాగంగా జన బాహుళ్యాన్ని పార్టీలో ఎలా ఇముడ్చుకోవాలనే దానిపై చర్చ జరిగిందని బృందా చెప్పారు. ఏటేటా పార్టీ సభ్యత్వం తగ్గిపోతోంది కదా అని ప్రశ్నించగా ‘సీపీఎంలో సభ్యులు కావాలంటే అంత సులువు కాదు, పార్టీ సభ్యత్వం ఉన్నçపళంగా పెరిగిపోవడానికి మాది మిస్‌డ్‌ కాల్‌ సభ్యత్వం కాదు. ఇప్పటికీ పార్టీ, అనుబంధ సంఘాల్లో 5.39 కోట్ల మంది సభ్యులు పనిచేస్తున్నారు’ అని వివరించారు.  

ఆమోదించలేదు.. తిరస్కరించలేదు
కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు ఉండదని బృందాకారత్‌ తేల్చిచెప్పారు. బీజేపీని గద్దె దించే క్రమంలో వామపక్ష, ప్రజాస్వామిక శక్తులను కలుపుకోవడంలో భాగంగా పార్లమెంటులోనూ, ప్రజాఉద్యమా ల్లోనూ కాంగ్రెస్‌తో కలసి పనిచేయడానికి మహాసభ ఆమోదించిం దని చెప్పారు.

పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పెట్టిన మైనార్టీ తీర్మానాన్ని ఆమోదించారా, తిరస్కరించారా అని ప్రశ్నించగా ‘మాది ఏకగొంతుక పార్టీ కాదు. మైనార్టీ తీర్మానాన్ని ఆమోదించలేదు. తిరస్కరించలేదు. చర్చించిన తర్వాత అంగీకారానికి వచ్చి ఆమోదించుకున్నాం’ అని బృందా వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం ఏపీ ప్రజలను మోసం చేసిందని, ప్రత్యేక హోదా విషయమై చర్చించి తీర్మానం చేస్తామని ఆమె చెప్పారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top