గ్రాండ్‌.. మోదీ బ్రాండ్‌

Brand National Leader in Social Media is Narendra Modi - Sakshi

ఎక్కడ చూసినా మోదీ బొమ్మలే..

ఎక్కడ విన్నా ‘నమో’ జపమే..

మోదీ బ్రాండింగ్‌ ఓట్లు కురిపిస్తుందా?

రెండోసారి ప్రధాని పీఠం దక్కేనా..

దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన లీడర్‌ ఎవరు?.. సోషల్‌ మీడియాలో ఎక్కువ ఫాలోవర్లు ఉన్న రాజకీయ నేత ఎవరు?.. ఎవరి బొమ్మ చూపిస్తే మార్కెట్‌ కూడా మోకరిల్లుతుంది?.. తన పేరునే ఒక బ్రాండ్‌ చేసుకున్న పొలిటీషియన్‌ ఎవరు?.. ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానంమోదీ..మోదీ..మోదీ.. అదే ‘బ్రాండ్‌ మోదీ’. ఈ బ్రాండ్‌ను కాపాడుకోవడానికి ప్రధాని ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు?. నరేంద్ర మోదీ చేస్తున్నదేంటి? ఈసారి ఎన్నికల్లో ఈ బ్రాండ్‌ చూపించే ప్రభావమెంత? కురిపించే ఓట్లెన్ని?..

బ్రాండ్‌ నేమ్‌.. మార్కెట్‌ రంగంలో దీనికున్న ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. రాజకీయాల్లోకీ ఈ బ్రాండింగ్‌ను తెచ్చేశారు నరేంద్ర మోదీ. గత ఎన్నికల్లో మోదీ బ్రాండ్‌తోనే విజయఢంకా మోగించారు. దేశం యావత్తూ ‘నమో’ నమామి అని నినదించింది. ఇప్పుడు అదే బ్రాండ్‌తో రెండోసారి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. గత అయిదేళ్లలో నరేంద్ర మోదీ పాలనపై ఎన్ని విమర్శలు వచ్చినా, పెద్ద నోట్ల రద్దు,జీఎస్టీ వంటి నిర్ణయాలను ఆర్థికవేత్తలు దుయ్యబట్టినామోదీకున్న జనాదరణని తగ్గించలేకపోయాయి. ఎప్పుడుఎక్కడ ఏ సర్వే చేసినా దేశంలో అత్యంతప్రజాదరణ కలిగిన నాయకుడిగామోదీయే నంబర్‌వన్‌గానిలుస్తున్నారు.

మోదీ టీవీ, మోదీ యాప్, మోదీ టీ–షర్ట్‌

ఈ ఎన్నికల్లో ఎన్డీయే మళ్లీ విజయం సాధిస్తే దానికి మోదీ బ్రాండింగే కారణమని ఒప్పుకోక తప్పదు. ఇప్పుడు మోదీ సామాన్యుడి నట్టింటికే నేరుగా వచ్చేశారు. మోదీ టీవీ, మోదీ యాప్, మోదీ కప్పులు, మోదీ టీ షర్టులు, మోదీ చీరలు, రిస్ట్‌ బ్యాండ్లు, టోపీలు, మాస్క్‌లు.. ఇలా జాబితా పెద్దదే. ఈ బ్రాండింగ్‌కి కావాల్సింది మోదీ బొమ్మ ఒక్కటే. అది ఉంటే చాలు మార్కెట్‌లో జోష్‌ విపరీతంగా పెరుగుతుంది. ఈ ఉత్పత్తులు అమ్ముతూ ఆన్‌లైన్‌ సంస్థలు లాభాల బాట పడుతున్నాయి. బాలీవుడ్‌ సెలబ్రిటీలతో సెల్ఫీలు, వెండితెరపై మోదీ బయోపిక్, మోదీ చేసిన సర్జికల్‌ స్ట్రయిక్స్‌పై ఉరీ సినిమా,  మోదీ బొమ్మతో డిజిటల్‌ గేమ్‌.. ఇలా ఎన్నికల వేళ ఎటు చూసినా తన పేరే వినిపించేలా అడుగులు వేస్తున్నారు.

ఇటీవల ‘నమో టీవీ’తో మోదీ జనం లివింగ్‌ రూమ్‌లోకి వచ్చేశారు. మోదీ బొమ్మతో ఈ చానల్‌ ప్రారంభం కాగానే విపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఎన్నికల కోడ్‌ వేళ ఎలా అనుమతిస్తారని ప్రశ్నిస్తున్నాయి.
మోదీ పేరుతో మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తే ఏకంగా 10 కోట్ల మంది దానిని డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.
ట్విట్టర్‌ ఫాలోవర్లలో మోదీ ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తర్వాత స్థానం ఆయనదే.
ప్రధాని నరేంద్ర మోదీకి   ట్విట్టర్‌లో4.67 కోట్ల మందిఫాలోవర్లు ఉన్నారు.
ఫేస్‌బుక్‌లో మోదీయే నంబర్‌వన్‌. 4.32 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
సామాజిక మాధ్యమాల్లో మోదీ నేను కాపలాదారుడినే అనే ప్రచారానికి అనూహ్య స్పందన వచ్చింది. మోదీ తన పేరు ముందు చౌకీదార్‌ అని తగిలించుకోగానే, 2.3 లక్షల మంది ట్విట్టర్‌ వినియోగదారులు అదే పనిచేశారు.
తొలి దశ పోలింగ్‌ దగ్గర పడుతుండటంతో మోదీ కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. తన సభల ద్వారా రోజుకి కనీసం 2.50 లక్షల మందిని కలుస్తున్నారని ఒక అంచనా.
రోజుకి మూడు నుంచి నాలుగు ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ఒక్కో ర్యాలీ ద్వారా మూడు, నాలుగు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు.
హెలికాప్టర్‌లోరోజుకి సగటున2,300 కి.మీ.ప్రయాణిస్తున్నారు.
ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడానికి ముందే 16 రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల్ని ప్రారంభించారు.
గత అయిదేళ్లలో బీజేపీ ఆదాయం అనూహ్యంగా పెరిగిందంటే దానికి మోదీకున్న ఇమేజ్‌ కారణం. ఏడీఆర్‌ సర్వే ప్రకారం 2017–18లో బీజేపీ ఆదాయం విరాళాలతో కలిపి వెయ్యి కోట్ల రూపాయలు దాటిపోయింది.
బీజేపీ 10 కోట్ల మంది ప్రాథమిక సభ్యులతో ప్రపంచంలోనే అత్యధికసభ్యులున్న పార్టీగా ఎదగడం వెనుక మోదీ ఇమేజ్‌ ఉంది.

ఏ రాష్ట్రంలో మోదీ ఇమేజ్‌ ఎలా?  
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దక్షిణాది రాష్ట్రాలకు ప్రచారానికి వస్తే మోదీ గో బ్యాక్‌ అన్న నినాదాలే హోరెత్తిపోతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు మోదీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో ఆయన పాపులారిటీ చెక్కు చెదరలేదు. అన్నింటికంటే ముఖ్యంగా గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైన హిందీ రాష్ట్రాలు రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో మోదీ పాలనపై 60 శాతానికిపైగా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని సీ ఓటర్‌ సర్వేలో తేలడంతో కమల దళానికి ఊపిరి వచ్చినట్టయింది. సీ–ఓటర్‌ సంస్థ గత మూడు నెలల్లో 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో 60 వేల మంది ఓటర్లను ప్రశ్నించి మోదీ ఇమేజ్‌పై ఒక అంచనాకు వచ్చింది. జార్ఖండ్, రాజస్తాన్‌ వంటి రాష్ట్రాల్లో మోదీకి అనూహ్యమైన మద్దతు లభిస్తే, ఢిల్లీ పీఠానికి దగ్గర దారిగా భావించే ఉత్తరప్రదేశ్‌లో 43.9 శాతం మంది మోదీ పాలనపై సంతృప్తిగా ఉండటం బీజేపీ శ్రేణులకు కాస్త నిరాశ కలిగించే అంశం.

ఓటింగ్‌ శాతం పెరిగితే ఎన్డీయేకు కలిసొస్తుందా?
మోదీ తన బ్రాండింగ్‌ను వ్యూహాత్మకంగా పెంచుకోవడంతో పాటు ఈసారి ఓటింగ్‌ శాతం పెరగడానికి కొత్త పంథా అనుసరిస్తున్నారు. ఎన్నికల జేగంట మోగిన తర్వాత ఓటు వేయడం పౌరుల హక్కు కాదని, అది ప్రా«థమిక బా«ధ్యతని ట్విట్టర్‌లో పోస్టు పెట్టడం వెనుక కూడా ఎన్నికల వ్యూహం దాగి ఉంది. నరేంద్రమోదీ పార్టీలకు అతీతంగా ప్రణబ్‌ ముఖర్జీ, రాహుల్‌గాంధీ, మమతా బెనర్జీ, వంటి వారిని ట్యాగ్‌ చేస్తూ ప్రజలు పోలింగ్‌ బూతులకు తరలి వచ్చేలా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. కేవలం రాజకీయ నేతలే కాదు పారిశ్రామికవేత్తలు, సినీ క్రీడా ప్రముఖులు, సామాజిక కార్యకర్తల్ని కూడా అభ్యర్థించారు. ఇదేదో సాధారణ అభ్యర్థన కాదు. దీని వెనుక ఎన్డీయేకి ఓట్లు రాలే వ్యూహం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఓటింగ్‌ శాతం ఎంత పెరిగితే ఎన్డీయేకి అంత కలిసి వస్తుందని లోక్‌నీతి అధ్యయనంలో తేలింది. 2014 లోక్‌సభ ఎన్నికలతో పాటుగా ఆ తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్‌ సరళిని పరిశీలిస్తే అత్యధిక ఓటింగ్‌ జరిగిన చోట బీజేపీ అభ్యర్థులు నెగ్గారు. 2009 ఎన్నికలతో పోల్చి చూస్తే ఒక నియోజకవర్గంలో 15 శాతం కంటే ఎక్కువగా ఓట్లు పెరిగిన కారణంగా ఎన్డీయే 67 నుంచి 70 సీట్లను గెలుచుకుందని ఆ అధ్యయనం చెబుతోంది. మోదీకి పట్టణ ఓటర్లు, ఫస్ట్‌ టైమ్‌ ఓటర్లలోనే ఎక్కువగా ఆదరణ ఉంది. వారు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చేలా చేస్తే మరోసారి ప్రధాని పీఠం ఎక్కవచ్చుననేది మోదీ భావనని రాజకీయ పరిశీలకుల అంచనా.

‘బ్రాండ్‌ మోదీ’ ఇమేజ్‌ ఓట్లు కురిపిస్తుందా?
ఎన్నికల ప్రచారంలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ, మార్కెటింగ్‌ రంగంలోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పేరే ఒక మంత్రంలా మారిస్తే ఓట్లు రాలుతాయా అంటే చెప్పలేని పరిస్థితి. ఎన్నికల సంస్కరణల సంస్థ ఏడీఆర్‌ తాజా సర్వేలో ఓటర్ల ప్రథమ ప్రాధాన్యాలైన ఉద్యోగ అవకాశాలు, ఆరోగ్య సౌకర్యాలు, తాగునీరు, సాగునీరు వంటి వాటిల్లో ఎన్డీయే ప్రభుత్వం పనితీరు అసలు బాగోలేదని తేలింది. ప్రజల కనీస అవసరాలు తీర్చకుండా తన పేరుని హైటెక్‌ స్థాయిలో ప్రచారం చేయడానికి ప్రజాధనాన్ని ఖర్చు పెడితే ఓట్లు వస్తాయా అన్న ప్రశ్నలైతే సామాన్యుల్ని వేధిస్తున్నాయి. మన దేశంలో దాదాపుగా 2 కోట్ల మందికి తలదాచుకోవడానికి ఇల్లు లేదు. రోజుకి సగటున 45 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అంచనా. 7.2 శాతానికి చేరిన నిరుద్యోగం, మహిళలపై జరుగుతున్న దాడులు.. ప్రధాని వీటిపై దృష్టి సారిస్తే బావుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top