చంద్రబాబు అలా చెప్పుకుంటున్నారు

Botsa Satyanarayana Slams Nara Chandra Babu In Vijayawada YSRCP Office - Sakshi

సాక్షి, విజయవాడ: తన పిలుపు మేరకు కర్ణాటకలో తెలుగు ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నారని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు బీజేపీకి ఓటు వేయవద్దని ధైర్యంగా తెలుగు ప్రజలకు ఎందుకు బహిరంగ విజ్ఞప్తి చేయలేదని సూటిగా ప్రశ్నించారు. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు చంద్రబాబు ప్రచారం చేయలేదని అడిగారు. 

‘ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఓట్లు కొనేందుకు గాలి జనార్థన్ రెడ్డి ప్రయత్నించారని ఆరోపించారు. దీనిని వైఎస్సార్‌ సీపీ ఎందుకు ప్రశ్నించడం లేదని యనమల అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్నారు. దాన్ని ఖండించినట్లే, కర్ణాటకలో ప్రలోభాలు జరిగితే దానిని కూడా వైఎస్సార్‌ సీపీ ఖండిస్తోంది. ఈ విషయాన్ని యనమల గుర్తించాలి. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ప్రతిపక్షంపై టీడీపీ బురద జల్లుతోంది. కర్ణాటకలో డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే వ్యవహారాన్ని వైఎస్సార్‌ సీపీ ఖండిస్తోంది. దీనిపై విచారణ జరగాలని, అలాగే చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో కూడా విచారణ జరపాల’ని కోరారు.

ధర్మపోరాట దీక్ష ఎందుకు?
‘విశాఖలో చంద్రబాబు ధర్మపోరాట దీక్ష ఎందుకో అర్ధం కావడం లేదు. నాలుగేళ్ల బీజేపీతో కలిసి ప్రత్యేక హోదాను వదిలిపెట్టిన చంద్రబాబు ధర్మం గురించి మాట్లాడటం విడ్డూరం. ప్రత్యేక ప్యాకేజీని ఆనాడు కోరుకున్నారు.  ఇప్పుడు ప్రత్యేక హోదా అనడం విచిత్రం. ఇదే విశాఖపట్నంలో శాంతియుత ర్యాలీ కోసం వచ్చిన మా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో యువభేరి సభ పెడతామంటే ప్రభుత్వం అనుమతి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అదే ప్రదేశంలో చంద్రబాబు దీక్ష చేస్తున్నారు. ఇక్కడ కూడా ప్రతిపక్షంపై బురదజల్లే ప్రయత్నమే చేస్తున్నారు. బీజేపీతో వైఎస్సార్‌ సీపీకి సంబంధం అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ మంత్రి భార్యకు టీటీడీ సభ్యురాలిగా పదవి ఇచ్చార’ని మండిపడ్డారు.

‘మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు కూడా రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్‌ను మంత్రిగా వుండి కూడా సాధించలేకపోయారు. రాష్ట్రంలో ధర్మం వుందా? తిరుమలలో జరుగుతున్నది ఏమిటి?  అక్కడ జరిగిన అక్రమాలపై ఎందుకు దర్యాప్తు చేయలేకపోతున్నారు. సాక్షాత్తూ కనకదుర్గమ్మ దేవస్థానంలో తాంత్రిక పూజలు జరిగితే ఇప్పుటి వరకు చర్యలు లేవు. సదావర్తి భూములకే దిక్కులేని పరిస్థితి. దేవుళ్లకే రక్షణ లేని రాష్ట్రంలో ధర్మం ఎక్కడ ఉంద’ని ఘాటుగా బొత్స సత్యనారాయణ స్పందించారు.

‘రాష్ట్రంలో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. లీటరుకు నాలుగు రూపాయలు స్పెషల్ టాక్స్‌గా చంద్రబాబు సర్కార్ వసూలు చేస్తోంది. వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వమే దానిని భరించింది. ప్రజలు అమాయకులని చంద్రబాబు అనుకుంటున్నారు. ధర్మం పేరుతో ప్రజలను అన్యాయం చేస్తున్నారు. దీనికి రాబోయే కాలంలో మూల్యం చెల్లించుకోక తప్పదు. రాష్ట్ర మంత్రులు కూడా ఇష్టారాజ్యంగా మాడ్లాడితే సహించం. రాజకీయ లబ్ది కోసం, ప్రభుత్వ డబ్బుతో చంద్రబాబు చేస్తున్నదే ఈ ధర్మ పోరాట దీక్ష’ అని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. 

రాజీనామాకు కట్టుబడ్డ ఎంపీలు
ఎంపీల రాజీనామాలపై ఈ నెల 29న రావాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ నుంచి ఆహ్వానం వచ్చిందని, ఎంపీలు తమ రాజీనామాలకే కట్టుబడి ఉన్నారని బొత్స తెలిపారు. టీడీపీ ఎంపీలను కూడా కలిసి రమ్మని కోరామని, కానీ వారు రాలేదని తెలిపారు. ఇప్పటికైనా టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే రేపు ఉదయమే ఢిల్లీకి వెళ్లి రాజీనామాలు చేయాలని హితవు పలికారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top