హోదా వస్తుందేమోనని బాబుకు భయం

Botsa Satyanarayana comments on chandrababu - Sakshi

వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపాటు   

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఉద్యమాలు, ఆందోళనలకు తలొగ్గి కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందేమోనని ముఖ్యమంత్రి చంద్రబాబు భయపడుతున్నారని పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం చంద్రబాబుకు ఇష్టం లేదని, అందుకే ఆయన కొత్త ఎత్తుగడలు వేస్తూ, నాటకాలు ఆడుతున్నారని, కుతంత్రాలు పన్నుతున్నారని ఆరోపించారు. బొత్స శనివారం విశాఖపట్నంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పుడు జనంలో హోదాపై సెంటిమెంట్‌ పెరగడంతో చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం అవిశ్వాస తీర్మానానికి తానే ఆద్యుడినంటూ నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రవేశపెట్టే అవిశ్వాసానికి మద్దతిస్తామని తొలుత చెప్పిన చంద్రబాబు తర్వాత ఎందుకు మాట మార్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

మానవహారాన్ని విజయవంతం చేయాలి 
రాష్ట్రాన్ని చంద్రబాబు నాలుగేళ్లుగా భ్రష్టుపట్టించారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన వారిని అణచివేశారని, హింసించారని ధ్వజమెత్తారు. ఈ నెల 19న వైఎస్సార్‌సీపీ నిర్వహించే ప్రజాసంకల్ప మానవహారాన్ని విజయవంతం చేయాలని కోరారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు కోరినప్పుడే రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పులకు లెంపలేసుకుని హోదా కోసం ఉద్యమించే వారితో కలిసి రావాలని సూచించారు. నాలుగేళ్లుగా వైఎస్సార్‌సీపీ ప్రశ్నిస్తున్న, వేలెత్తి చూపుతున్న అంశాలనే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు తైనాల విజయ్‌కుమార్, కరణం ధర్మశ్రీ, కంపా హనోక్, వరుదు కల్యాణి, కోలా గురువులు, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top