రిజర్వుడు సీటు.. బీజేపీకే ఓటు

BJP Wins More Than Congress With Dalit Votes - Sakshi

ఎక్కువసార్లు ఆ పార్టీదే గెలుపు

కాంగ్రెస్‌ది తరువాత స్థానమంటోన్న గణాంకాలు

బీజేపీ హిందువుల పార్టీ అని, కాంగ్రెస్‌కు మొదటి నుంచి దళితుల మద్దతు ఉందని జనాభిప్రాయం. దీని ప్రకారం చూస్తే దళితులకు అంటే ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన సీట్లలో గెలిచే అవకాశాలు కాంగ్రెస్‌కే ఎక్కువుండాలి. ఎన్నికల సంఘం లెక్కలు చూస్తే దేశ వ్యాప్తంగా ఇంత వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రిజర్వుడు స్థానాల్లో కాంగ్రెస్‌ కంటే బీజేపీయే ఎక్కువ సీట్లు గెలుచుకుందని తెలుస్తోంది.

1989 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో దేశంలోని రిజర్వుడు నియోజకవర్గాల నుంచి 976 మంది పార్లమెంటుకు ఎన్నికవగా, వారిలో 30 శాతం మంది బీజేపీ అభ్యర్థులే. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన వారు 28 శాతమేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రిజర్వుడు నియోజకవర్గాల్లోని అగ్రవర్ణాల ఓట్లు కాంగ్రెస్‌కు పడకపోవడమే దీనికి కారణమని ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నారు. ‘రిజర్వుడు నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ ఓటర్లు సగటున 40–45 శాతం కంటే ఎక్కువుండరు. మిగతా 55–60 శాతం ఓటర్లే అక్కడి అభ్యర్థి గెలుపును నిర్ణయిస్తారు’ అన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మహదేవ్‌ ప్రకాశ్‌. 1989 నుంచి అంటే దేశంలో బీజేపీ హవా మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్‌కు అగ్రవర్ణాల ఓట్లు తగ్గుతూ వచ్చాయని ఆయన అన్నారు. పొలిటికల్‌ సైకాలజిస్ట్‌ ఆశిష్‌ నందీ రిజర్వుడ్‌ సీట్లలో బీజేపీ విజయానికి మరో కారణం చెప్పారు. అగ్రవర్ణాల ఓటర్లలో ఉన్న ఐకమత్యం దళితుల్లో ఉండదు. కాబట్టి ఏ అభ్యర్థికీ వీరి ఓట్లు గంపగుత్తగా పడే అవకాశం లేదు. అదీకాక రిజర్వుడు నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పలువురు పోటీ చేస్తారు. దాంతో దళితుల ఓట్లు చీలిపోతాయి. ఈ పరిస్థితుల్లో మిగతా వర్ణాల ఓట్లే నిర్ణయాత్మకమవుతాయి. వారి ఓట్లు సంపాదించుకోగలిగే పార్టీ గెలుస్తుంది’ అని ఆయన వివరించారు.

కర్ణాటకలో మాత్రం ‘చేతి’వాటం
ఇంత వరకు జరిగిన 8 సార్వత్రిక ఎన్నికల్లో ఐదు సార్లు (1996, 98, 99, 2004, 2014) బీజేపీయే ఎక్కువ రిజర్వుడు సీట్లను దక్కించుకుంది. 2014 ఎన్నికల్లో ఏకంగా 66 రిజర్వుడు సీట్లలో గెలిచింది. కర్ణాటకలో మాత్రం ఎక్కువ రిజర్వుడు సీట్లు కాంగ్రెస్‌కే వచ్చాయి. రాష్ట్రంలోని 38 రిజర్వుడు స్థానాల్లో కాంగ్రెస్‌ సగానికిపైగా సీట్లు గెలుచుకుంటూ వస్తోంది. కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువ ఉండటం, గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు వారికి ఎన్నో ప్రయోజనాలు కల్పించడంతో వారంతా కాంగ్రెస్‌కే కట్టుబడి ఉన్నారని, కర్ణాటకలో బీజేపీ ఇంకా పూర్తిగా బలం పుంజుకోకపోవడం కూడా ఒక కారణమని పరిశీలకులు అంటున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top