అత్త సొమ్ము అల్లుడి దానంలా ఉంది: కిషన్‌ రెడ్డి

BJP Senior Leader Kishan Reddy Slams TRS And MIM In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో ఓవైసీ ఆసుపత్రి కోసం 500 గజాల స్థలం ఇస్తున్నట్లు గతంలో టీఆర్‌ఎస్‌ ప్రకటించింది..కానీ ఈ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది..ఈ తతంగం చూస్తుంటే రూ.40 కోట్ల విలువైన స్థలాన్ని ఓవైసీ సోదరులకు దానం చేయడం అత్త సొమ్ము అల్లుడి దానం చేసినట్లు ఉందని బీజేపీ సీనియర్‌ నేత కిషన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. కిషన్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. మెడికల్‌ సీట్లు అమ్ముకుని కోట్ల రూపాయలు గడించారు..ఒక్క సీటైనా పేద ముస్లిం విద్యార్థులకు ఇచ్చారా అని ప్రశ్నించారు. గతంలో మజ్లిస్‌కు కాంగ్రెస్‌ నాయకులు వంగి వంగి సలాం చేసేవాళ్లు.. కానీ ఇప్పుడు టీఆర్‌ఎస్‌ నాయకులు పడుకుని సలాం కొడుతున్నారని ధ్వజమెత్తారు.

ప్రజల సొమ్ము దానం చేస్తూ తీసుకున్న ఇలాంటి నిర్ణయాన్ని కోర్టు కొట్టివేసిందని, ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ తీరు క్విడ్‌ ప్రొకో మాదిరిగా ఉందని విమర్శించారు. రేవంత్‌ రెడ్డిపై ఈడీ దాడుల గురించి బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఉత్తమ్‌, జానారెడ్డి చేసే ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని చెప్పారు. ఇందులో వాస్తవం లేదన్నారు. రేవంత్‌ రెడ్డి ఇంటిపై దాడులు చేస్తే బీజేపీకి వచ్చే లాభనష్టాలు ఏమీ లేవని స్పష్టం చేశారు. వారిపై దాడి చేయించడానికి కేంద్ర ప్రభుత్వానికి అవసరం లేదన్నారు.

అలాగే అధికార పార్టీకి చెందిన సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిపైనా ఐటీ దాడులు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. అది కూడా బీజేపీయే చేయించిందా కాంగ్రెస్‌ పార్టీ సమాధానం చెప్పాలని అడిగారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓ రోగం ఉంది.. వాళ్లు గతంలో చేసిన విధంగానే ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నవాళ్లు చేస్తున్నట్లు భ్రమపడుతున్నారని విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top