కర్నాటకం: నేడే అవిశ్వాసానికి అనుమతించండి

BJP Seeks Permission To NO Confidence Motion - Sakshi

సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్‌-జేడీఎస్‌ రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందా? ఊడుతుందా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో కర్ణాటక అసెంబ్లీ సమావేశం కానుంది. అసెంబ్లీలో బలపరీక్షపై స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది. ఇక, విశ్వాస పరీక్షకు సిద్ధమేనని ముఖ్యమంత్రి కుమారస్వామి చెబుతుండగా.. సోమవారమే  అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. ఈ మేరకు స్పీకర్‌ను కలిసి అవిశ్వాస తీర్మానానికి నేడు అనుమతి ఇవ్వాలని యడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

ఇక, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ ఉద్దేశపూర్వకంగా తమ రాజీనామాలను ఆమోదించకుండా జాప్యం వహిస్తున్నారని మరో ఆరుగురు రెబెల్‌ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కారణంతో పదిమంది కాంగ్రెస్‌-జేడీఎస్‌ రెబెల్‌ ఎమ్మెల్యేలు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం 16మంది రెబెల్‌ ఎమ్మెల్యేలు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసినట్టయింది. గతంలో పదిమంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌లోనే తాజా ఆరుగురు ఎమ్మెల్యేల విజ్ఞప్తినీ కలిపి విచారించాలని వారి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. మొత్తం 16మంది రెబెల్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌పై విచారణ జరిపి.. మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top