తమిళిసై వారుసులెవరో? | Sakshi
Sakshi News home page

తమిళనాడు బీజేపీ పగ్గాలు ఎవరికో?

Published Mon, Oct 7 2019 4:29 PM

BJP Searching For New Chief For Tamil Nadu - Sakshi

సాక్షి, చెన్నై: రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఎవర్ని వరించనుందో అన్న ఉత్కంఠ తమిళనాడు కమలనాథుల్లో బయలుదేరింది. నలుగురు పేర్లు అధిష్టానం పరిశీలనకు వెళ్లి ఉన్న సమాచారంతో పగ్గాలు చిక్కేది ఎవరికో అన్న చర్చ జోరందుకుంది. ఇక, జాబితాలో పేరు లేనప్పటికీ, మాజీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌కు మళ్లీ చాన్స్‌ ఇచ్చేందుకు తగ్గట్టుగా అధిష్టానం పెద్దలు పరిశీలన జరుపుతున్నట్టు సమాచారం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న తమిళిసై సౌందరరాజన్‌ను తెలంగాణ గవర్నర్‌ పదవి వరించిన విషయం తెలిసిందే. ఆ పదవికి  తొలి తమిళ మహిళగా స్థానాన్ని దక్కించుకున్న తమిళిసై గవర్నర్‌గా పగ్గాలు చేపట్టారు. తెలంగాణ వ్యవహారాలపై ఆమె దృష్టి పెట్టి ఉన్నారు. దీంతో రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నెల రోజులుగా ఖాళీగా ఉంది. ఆ పదవిని దక్కించుకునేందుకు అనేక మంది నేతలు తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. తొలుత పలువురి పేర్లు తెర మీదకు వచ్చినా, అన్ని రకాల పరిశీలన, పార్టీకి అందించిన సేవల మేరకు నలుగురితో కూడిన జాబితాను ఢిల్లీ పెద్దలు సిద్ధం చేశారు. మధ్య వయస్కులను ఈ సారి అధ్యక్ష పదవిని నియమించాలన్న సంకల్పంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఉండడంతో, ఆ వయస్సులో ఉన్న నేతల్లో ఆశలు చిగురించి ఉన్నారు. అధిష్టానం పరిశీలనలో ఉన్న నలుగురి గురించి పార్టీ వర్గాల అభిప్రాయలు సేకరించే దిశగా రెండు రోజుల క్రితం బీజేపీ జాతీయ నిర్వాహక కార్యదర్శి సంతోష్‌ ఇక్కడి వారితో సంప్రదింపులు జరిపి ఉండడం గమనార్హం.

ఆశల పల్లకిలో..
కేంద్రం పరిశీలనలో ఉన్న జాబితాలో కేటీ రాఘవన్, వానతీ శ్రీనివాసన్, ఏపీ మురుగానందం, కరుప్పు మురుగానందం పేర్లు ఉన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో వానతీ శ్రీనివాసన్‌ రాష్ట్ర ప్రజలకు సుపరిచితురాలే. కేటీ రాఘవన్‌కు అధిష్టానం పెద్దల అండదండాలు పుష్కలంగా ఉన్నట్టు చెప్పవచ్చు. ఇద్దరు మురుగానందం పార్టీకి సేవల్ని అందిస్తూ వస్తున్న వాళ్లే. అయితే, ప్రజలకు పెద్దగా తెలిసిన ముఖాలు కాదు. వానతీ శ్రీనివాసన్‌ చక్కటి వాక్‌ చాతుర్యం, సందర్భానుచిత వ్యాఖ్యలు చేయడం, ఆంగ్లం, తమిళంలో సరళంగా మాట్లాడ గలగడం కలిసి వచ్చే అంశం. అయితే, మళ్లీ మహిళకే అధ్యక్ష పగ్గాలు ఇవ్వడాన్ని కమలనాథులు అనేక మంది వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఈదృష్ట్యా, అధ్యక్ష పగ్గాలు వానతికి కట్టబెట్టేనా అన్నది వేచి చూడాల్సిందే. ఇక, కేటీ రాఘవన్‌కు అప్పగించిన పక్షంలో పూర్తి స్థాయిలో పార్టీ రాష్ట్ర పెద్దల సహకారం అందేనా అన్న ప్రశ్న బయలుదేరింది. ఈ గందరగోళం అధిష్టానంలోనూ ఉన్నట్టు సమాచారం. కొత్త వారికి అవకాశం ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ పక్షంలో మళ్లీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ను తెర మీదకు తెచ్చేందుకు తగ్గ పరిశీలన కూడా సాగుతున్నట్టు తెలిసింది. డీఎంకే, అన్నాడీఎంకేలతో పాటు ఇతర పార్టీల నేతలకు సమానంగా పెద్దరికం హోదా కల్గిన నేతగా పొన్‌ రాధాకృష్ణన్‌ ఉన్నారు.  రెండుసార్లు కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఎక్కువే. ఈ దృష్ట్యా, రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఎవర్ని వరించేనో అని వేచి చూడాల్సిందే. దీపావళిలోపు రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఎవరినో ఒకర్ని వరించడం ఖాయం అని, అందుకు తగ్గ కసరత్తులు తుది దశలో ఉన్నట్టుగా కమలనాథులు పేర్కొంటుండడంతో ఆశావహుల్లో టెన్షన్‌ మొదలైంది.  

Advertisement
 
Advertisement