కోస్తా: కమలానికి కోతే!

BJP Party Graph Not Well in South States - Sakshi

తీర రాష్ట్రాల్లో బీజేపీ హవా అంతంతే..

అక్కడంతా ప్రాంతీయ పార్టీలదే పైచేయి

దక్షిణాదిన ప్రభావం చూపని ‘కమలం’

ఉత్తరాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఉత్తర భారతంలో విపక్షాల బలం పెరిగిన నేపథ్యంలో ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరాదిన కోల్పోయే స్థానాలను దక్షిణ భారతంలో గెల్చుకుని మొత్తం మీద లోటు భర్తీ చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ వ్యూహాలు పన్నుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు దక్షిణాదిన తమ బలం పెరిగిందని కమలనాథులు భావిస్తున్నారు. ఆ ధీమాతోనే ఈ ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పదేపదే చెబుతున్నారు. దక్షిణ భారతంలో, తీర రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాలు దక్కించుకోవాలని తద్వారా లోక్‌సభలో మెజారిటీ పెంచుకోవాలని బీజేపీ ఆశిస్తోంది. అయితే, ఆ పార్టీ ఇంత వరకు దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తూర్పు కోస్తా రాష్ట్రాల్లో చెప్పుకోతగ్గ విజయం సాధించలేదని ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి.

ప్రాంతీయ పార్టీలదే పైచేయి
ఇంత వరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే తూర్పు కోస్తా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే పైచేయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు 40 శాతం సీట్లు వచ్చాయి. తీర రాష్ట్రాల్లోని లోక్‌సభ సీట్లలో 63 శాతం సీట్లను ప్రాంతీయ పార్టీలే దక్కించుకున్నాయి. ఇక్కడ జాతీయ పార్టీలకు 37 శాతం సీట్లే వచ్చాయి. తీర రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న 84 లోక్‌సభ సీట్లలో 47 సీట్లు ప్రాంతీయ పార్టీలే గెలుచుకున్నాయి.

కాంగ్రెస్‌ కొంత నయం
2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కోస్తా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ 38 శాతం సీట్లు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో ఒడిశాలో బీజేడీ, తమిళనాడులో డీఎంకే, బెంగాల్‌లో టీఎంసీ మెజారిటీ సీట్లు దక్కించుకున్నా ఆంధ్ర, కేరళ, మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు గణనీయ సంఖ్యలో సీట్లు వచ్చాయి. 2014 వచ్చే సరికి ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది.
ఇంత వరకు జరిగిన ఎన్నికల్లో ఒడిశా, బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ కాని, కాంగ్రెస్‌ కాని ప్రాంతీయ పార్టీలతో ఎలాంటి పొత్తు పెట్టుకోలేకపోయాయి. ప్రాంతీయ పార్టీల సహకారం లేకుండా నెగ్గుకురావడం కష్టమని గ్రహించడంతో 2019 ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ కూడా కొన్ని ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాయి. అయితే, సీట్ల పంపకంలో సింహభాగం ప్రాంతీయ పార్టీలకే దక్కడం విశేషం. తమిళనాడులో పొత్తులో భాగంగా బీజేపీకి కేవలం 5 సీట్లే దక్కాయి.

మోదీ హవా పని చేయలేదు!
2014 ఎన్నికల్లో దేశమంతటా మోదీ హవా పని చేసినా దక్షిణ భారతంలో ప్రత్యేకించి కోస్తా రాష్ట్రాల్లో అది అంతగా ప్రభావం చూపించలేదు. కోస్తా రాష్ట్రాల్లో ఉన్న మొత్తం సీట్లలో బీజేపీ 28 శాతం సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. కాబట్టి ఇక్కడ బలం పుంజుకోవాలంటే బీజేపీ మరింత గట్టి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. తూర్పు కోస్తా రాష్ట్రాల్లో బిజూ జనతాదళ్‌ (ఒడిశా), తృణమూల్‌ కాంగ్రెస్‌ (పశ్చిమ బెంగాల్‌), అన్నాడీఎంకే (తమిళనాడు) వంటి ప్రాంతీయ పార్టీలే ఆధిపత్యంలో ఉన్నాయి. కేరళలో కూడా స్థానిక పార్టీలో కూడిన ఫ్రంట్‌లే బలంగా ఉన్నాయి. ఇవన్నీ బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే సామర్థ్యం కలిగినవే. పశ్చిమ కోస్తాలోని గుజరాత్, గోవాలో బీజేపీ ప్రభుత్వాలున్నాయి. కర్ణాటకలో బీజేపీ కొంత బలంగానే ఉంది. మహారాష్ట్రలో ప్రస్తుతం ఆ పార్టీ ఉండాల్సినంత బలంగా లేదు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 1998, 1999 ఎన్నికల్లో కూడా తూర్పుకోస్తా/దక్షిణ రాష్ట్రాల్లో ఆ పార్టీ విజయం నామమాత్రంగానే ఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top