మర్యాదగా తప్పుకోకుంటే అవిశ్వాసమే!

BJP mulling no-confidence motion against Speaker - Sakshi

కర్ణాటక స్పీకర్‌ రమేశ్‌కుమార్‌కు తెలిపిన బీజేపీ

బీజేపీకి మద్దతు నో: దేవెగౌడ

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్‌ యడియూరప్ప ప్రమాణస్వీకారం చేసి 24 గంటలు కూడా కాకముందే బీజేపీ జోరుపెంచింది. కాంగ్రెస్‌ నేత,  కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ కె.ఆర్‌.రమేశ్‌ కుమార్‌ వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని సందేశాన్ని పంపింది. స్వచ్ఛందంగా తప్పుకోకుంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బలవంతంగా సాగనంపాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు బీజేపీ తరఫు ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని నేరుగా స్పీకర్‌కు చేరవేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

ఈ విషయమై బీజేపీ సీనియర్‌ నేత ఒకరు మాట్లాడుతూ.. ‘రమేశ్‌ కుమార్‌ స్వచ్ఛందంగా తప్పుకోకుంటే ఆయనపై అవిశ్వాసం పెట్టక తప్పదు. అయితే మా తొలిప్రాధాన్యం సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గడం, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలపడమే. ఇది పూర్తయ్యాక స్పీకర్‌ విషయమై నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమికి లబ్ధి చేకూర్చేలా స్పీకర్‌ వ్యవహరించవచ్చన్న అనుమానంతోనే బీజేపీ దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. మరోవైపు యడియూరప్ప ప్రభుత్వానికి తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని జేడీఎస్‌ చీఫ్‌ దేవెగౌడ చెప్పారు.

అనర్హతపై రెబెల్స్‌ న్యాయపోరాటం..
స్పీకర్‌ అనర్హతవేటు వేసిన నేపథ్యంలో ముగ్గురు కాంగ్రెస్‌ రెబెల్‌ ఎమ్మెల్యేలు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. స్పీకర్‌ నిర్ణయంపై సుప్రీంకోర్టుతో పాటు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాలని ఎమ్మెల్యేలు రమే శ్‌ జార్కిహోళి, మహేశ్‌ కుమటహళ్లి, శంకర్‌లు నిర్ణయించారు. సుప్రీంలో రమేశ్, మహేశ్‌ల పిటిషన్లు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నందున స్పీకర్‌ కనీసం నోటీసు ఇవ్వకుండా, తమ వివరణ తీసుకోకుండా అనర్హులను చేయడంపై వీరిద్దరూ అఫిడవిట్లు దాఖలు చేస్తారని సమాచారం.

స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్‌.శంకర్‌ను కాంగ్రెస్‌ సభ్యుడిగా పరిగణిస్తూ స్పీకర్‌ అనర్హతవేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శంకర్‌ సోమవారం హైకోర్టును ఆశ్రయిస్తారని తెలుస్తోంది. తాను స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందినందున ఫిరాయింపుల చట్టం కింద వేటువేయడం కుదరదని శంకర్‌ చెబుతున్నారు. తమిళనాడులో 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినప్పటికీ, 6 నెలల్లోపు జరిగిన ఉపఎన్నికల్లో పోటీచేసేందుకు సుప్రీంకోర్టు, ఈసీ అనుమతించిన విషయా న్ని గుర్తుచేస్తున్నారు. కాబట్టి అసెంబ్లీ ముగిసేవరకూ (2023) అనర్హత వేటేస్తూ స్పీకర్‌ ఇచ్చిన ఉత్తర్వులు కోర్టులో నిలబడవని స్పష్టం చేస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top