టీటీడీ జేఈవో వెనుక ఎవరున్నారు?

BJP MLC Somu Veerraju Slams TTD JEO And TDP Chie Chandrababu Naidu - Sakshi

సీఎం చంద్రబాబు తీరుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఫైర్‌

సాక్షి, రాజమండ్రి: శ్రీవారి నగల మాయం, అర్చకుల మధ్య విబేధాలు, దేవుడి సేవల టికెట్లలో గోల్‌మాల్‌ వ్యవహారాలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై, టీటీడీ జాయింట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(జేఈవో) శ్రీనివాస రాజుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తొమ్మిదేళ్లు అదే ఉద్యోగంలో ఎలా?: ‘‘టీటీడీకి ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాలా లేక శ్రీనివాస రాజా? ఎవరి పరిపాలన నడుస్తున్నది?
(చదవండి: లేని వజ్రాన్ని తెమ్మంటే ఎలా?: పుట్టా)

ఆయనకు ట్రాన్స్‌ఫర్‌ ఉండదా?: ఐఎఎస్ అధికారి అయిన శ్రీనివాసరాజు ఎవరి సహకారంతో తొమ్మిదేళ్లుగా అదే పదవిలో కొనసాగుతున్నారు? ఏం, ఆయన రాజ్యాంగ వ్యవస్థల పరిధిలోకి రారా? తిరుమల-తిరుపతిలో భక్తుల కోసం నిర్దేశించిన సేవలను ఎవరికి అమ్ముకుంటూ ధర్మానికి సంబంధించిన ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఆ సొమ్మంతా ఎవరి చేతుల్లోకి చేరుతోందో ప్రజలకు తెలియాలి. సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఆలయ మర్యాదలు గాడితప్పడాన్ని రమణదీక్షితులు బహిరంగంగా ప్రశ్నించారు. ఆయన(దీక్షితులు) అమిత్ షాను కలవడాన్ని కూడా రాజకీయం చేస్తే ఎలా? వెంకటేశ్వరస్వామిపై చంద్రబాబు చేస్తోన్న కుయుక్తులకు ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదు’’ అని వీర్రాజు అన్నారు.
(చూడండి: సీఎం పదేపదే అదే చెప్పారు: టీటీడీ ఈవో)

రాష్ట్రాన్ని గాలికొదిలేసి కర్ణాటకతో టైమ్‌పాస్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని, పరిపాలనను గాలికొదిలేసి కర్ణాటక రాజకీయాలతో కాలం వెల్లబుచ్చుతున్నాడని సోము ఆక్షేపించారు. చంద్రబాబు ప్రభావం ఉంటే కర్ణాటకలో బీజేపీకి 20శాతం నుంచి 35 శాతం ఓట్లు ఎలా పెరుగుతాయని ప్రశ్నించారు. ‘‘140 సీట్లలో డిపాజిట్‌ కోల్పోయి, కేవలం 36 సీట్లు గెలుచుకున్న జేడీఎస్‌ పార్టీ ప్రమాణస్వీకారానికి వెళ్లేందుకు చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రజలను గాలికొదిలేసి రోజుకో కథ చెబుతున్నారు. 2019లో ఆయనకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదు. పవన్‌, జగన్‌లను బీజేపీ నడిపించాల్సిన అవసరంలేదు. మేం మా పార్టీని మాత్రమే నడిపించుకుంటాం. మరి 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఎవరిని నడిపిస్తున్నారు? తిరుమలలో అమిత్‌షాపై దాడికి పాల్పడినవారిపై కేసులు పెట్టలేదు. భౌతిక దాడులతో బీజేపీ శ్రేణుల్ని భయపెట్టాలనుకోవడం సరికాదు. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు మేం లొంగం’’ అని సోము వీర్రాజు పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top