టీడీపీ గూడుపుఠాణా

BJP Leaders Fires on TDP Party In Chittoor - Sakshi

కోలా ఆనంద్‌ అరెస్టుపై భగ్గుమన్న బీజేపీ

పోలీసులు టీడీపీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపణ

టీడీపీ నేతలనూ అరెస్టు  చేయాలని డిమాండ్‌

సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో టీడీపీ, బీజేపీల మధ్య యుద్ధం మొదలైంది. రెండు పార్టీలూ పరస్పర ఆరోపణలు, విమర్శలతో కత్తులు దూసుకుంటున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కాన్వాయ్‌పై టీడీపీ దాడికి పాల్పడిన తదనంతరం తిరుపతిలో  చోటుచేసుకున్న పరిణామాలు రెండు పార్టీల మధ్య దూరాన్ని బాగా పెంచాయి. కాన్వాయ్‌పై దాడికి పాల్పడటం, పార్టీ నేత కోలా ఆనంద్‌ కారు అద్దాలు పగులగొట్టడాన్ని బీజేపీ సీరియస్‌గా పరిగణించింది. పార్టీ అధినేత కుటుంబ సమేతంగా దైవ దర్శనానికి వస్తే నిరసన పేరుతో టీడీపీ కాన్వాయ్‌ను అడ్డుకుని అవమానానికి గురి చేసిందనీ, ఒక రకంగా పార్టీ అధిష్టానం దగ్గర తల ఎత్తుకునే పరిస్థితి లేకుండా చేశారని బీజేపీ నాయకులు టీడీపీపై భగ్గుమన్నారు. టీడీపీ కూడా తనదైన వాదన వినిపిస్తోంది. అద్దాలు పగులగొట్టారన్న నెపంతో బీజేపీ నాయకులు తమ పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడటం ఎంత వరకూ సబబని ప్రశ్నిస్తున్నారు.

రెండు పార్టీల వాదోపవాదాలతో రగడ మరింత ఎక్కువైంది. అమిత్‌షా కాన్వాయ్‌పై జరిగిన దాడిని సీరియస్‌గా తీసుకున్న తిరుపతి అర్బన్‌ పోలీసులు అదే రోజున దాడికి  పాల్పడ్డ టీడీపీ కార్యకర్త సుబ్రహ్మణ్యయాదవ్‌ను అరెస్టు చేశారు. ఆపైన దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా టీడీపీ, బీజేపీ నాయకులను స్టేషన్‌కు పిలిపించి విచారణ జరుపుతున్నారు. సోమవారం మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్‌ను పోలీసులు అలిపిరి పోలీస్‌ ష్టేషన్‌కు పిలిచారు. విచారణ ముగిశాక అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. రాత్రి 10 గంటల తరువాత మేజిస్ట్రేట్‌ దగ్గర బెయిల్‌ తీసుకున్న కోలా ఆనంద్‌ పోలీసుల ద్వారా టీడీపీ ఆడిన నాటకాన్ని పార్టీ అధిష్టానానికి వివరించారు. దీంతో బీజేపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అమిత్‌ షా కాన్వాయ్‌పై దాడికి పాల్పడటమే కాకుండా ఆత్మరక్షణ కోసం అడ్డుపడ్డ నేతలపై అక్రమ కేసులు పెట్టిస్తారా అంటూ ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. దీంతో జిల్లా బీజేపీ నేతలూ కదిలారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి ప్రెస్‌క్లబ్‌కు చేరుకుని టీడీపీ దురాగతాలపై దండెత్తారు.

అక్రమ అరెస్టులకు భయపడం..
వంద తప్పులు తర్వాత శ్రీకృష్ణుడు శిశుపాలుడిని సంహరించాడు. నాలుగేళ్లుగా మిత్రపక్షమైన టీడీపీ ప్రవర్తన, అవినీతి, దుష్టపాలనను సరిదిద్దుకోవడానికి అవకాశమిచ్చాం. దీన్ని చేతకానితనంగా భావిస్తే టీడీపీకి కచ్చితంగా తగిన గుణపాఠం చెబుతామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శాంతారెడ్డి హెచ్చరించారు. మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీజేపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టులు చూపడం టీడీపీ అనైతిక చర్యలకు పరాకాష్టగా ఆమె అభివర్ణించారు.

అమిత్‌ షా కాన్వాయ్‌ను అడ్డుకోవాలని టీడీపీ నేతలు ఆ పార్టీ కార్యకర్తలకు రెండు గంటల ముందు నుంచే మెసేజ్‌లు పెట్టారని, ఈ విషయం వాట్సాప్‌లో వైరల్‌ అయ్యిందని, ఈ నేపథ్యంలో పోలీసులు ఎందు కు కార్యకర్తలను ముందుగానే చెదరగొట్టలేదని ప్రశ్నించారు. ఆత్మరక్షణార్థం వాహనం దిగి దాడికి పాల్పడ్డ యువకుడిని పోలీసులకు పట్టిస్తే దాన్ని నేరంగా పరిగణించి కేసులు పెట్టడం దారుణమని మండిపడ్డారు. భవిష్యత్తులో టీడీపీ అవినీతి, ఇసుక దందాలను వదిలే ప్రసక్తి లేదన్నారు. పార్టీ నేత కోలా ఆనంద్‌ మాట్లాడుతూ పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా కేసులు పెడుతున్నారన్నారు. తప్పుడు కేసులకు భయపడేది లేదన్నారు. అమరావతిలో సీఎం డైరెక్షన్‌ చేస్తే ఇక్కడ తెలుగు తమ్ముళ్లు ఓవరాక్షన్‌ చేశారని బీజేపీ నేత సామంచి శ్రీనివాస్‌ ఆరోపించారు. జరిగిన దాడిపై సీబీఐ విచారణ జరిపిం చాలని డిమాండ్‌ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు చంద్రారెడ్డి, పొన్నగంటి భాస్కర్, సుబ్రహ్మణ్యం రెడ్డి, వరప్రసాద్, నాగరాజు రాయల్‌ పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top