చేరికలు సరే.. భరోసా ఏదీ?

BJP leaders doubts who will give guarantee about there posts

     హేమాహేమీల చేరికలపై బీజేపీలో అంతర్మథనం

     రాష్ట్ర పార్టీ ముఖ్యుల్లో అనైక్యతతో ఇబ్బందులు

     భరోసా ఇచ్చేవారెవరన్న సందేహాలు

     చేరేందుకు వెనుకాడుతున్న పలువురు నేతలు! 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామంటూ బీజేపీ నేతలు ఇటీవల చాలాసార్లు పేర్కొన్నారు. ఇతర పార్టీల నుంచి హేమాహేమీలైన నాయకులు కమలం గూటికి చేరుతారని చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌లోని మంత్రులు, కాంగ్రెస్‌లోని ముఖ్యనేతలు కూడా బీజేపీ జాతీయనేతలతో, రాష్ట్ర ముఖ్య నేతలతో టచ్‌లో ఉన్నట్టు పేర్కొంటున్నారు. కానీ అలాంటి దాఖలాలేమీ కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల నుంచి ఏయే నేతలు ఎవరితో టచ్‌లో ఉన్నారన్న అంశంపై రాష్ట్రంలోని బీజేపీ కోర్‌ కమిటీ సభ్యులకు కూడా సమాచారం లేదని తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా బీజేపీకి సానుకూల వాతావరణం ఉన్నా, దానిని రాష్ట్రంలో సమర్థవంతంగా వినియోగించుకునేలా రాష్ట్ర నాయకత్వం సరైన పనితీరును చూపించడం లేదని ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాష్ట్ర పార్టీ ముఖ్యనేతల మధ్య సమన్వయం, ఐక్యతా లోపం వంటివాటితో పార్టీ ఎదుగుదలకు, విస్తరణకు ఇబ్బంది కలుగుతోందని బీజేపీకి చెందిన నేతలే ఆరోపిస్తున్నారు. ‘‘నేతలు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా పదవులే వారి లక్ష్యం. అలాంటిదేమీ ఆశించకుండా ఏ నేత అయినా మరో పార్టీలో చేరడు. మా (బీజేపీ) పార్టీలో చేరాలన్నా... ఒక స్పష్టత లేకుండా ఎందుకు వస్తారు? రావాలనే కోరికతో ఉన్న నాయకుడితో మా పార్టీ నుంచి సంప్రదింపులు, చర్చలు జరిపే చొరవ తీసుకుంటున్నవారెవరు? పార్టీ తరఫున భరోసా ఇచ్చే వారేరీ..?’’ అని బీజేపీకి చెందిన ముఖ్య నాయకుడొకరు వ్యాఖ్యానించడం గమనార్హం.

పార్టీలోనే స్పష్టత కరువు!
బీజేపీకి రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించే కోర్‌ కమిటీ సభ్యుల్లో కూడా రానున్న ఎన్నికల్లో నిర్వహించాల్సిన పాత్రపై స్పష్టత లేదని ఆ పార్టీకి చెందిన మరో సీనియర్‌ నాయకుడు వ్యాఖ్యానించారు. పార్టీ కోర్‌ కమిటీ సభ్యుల్లోనే అయోమయం ఉంటే ఇంకా కొత్తగా చేరేవారికి ఏం స్పష్టత ఇస్తారని పేర్కొన్నారు. ‘‘పార్టీకి 10 మంది కోర్‌ కమిటీ సభ్యులు ఉన్నారు. వీరిలో ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది ఇంకా నిర్ణయం కాలేదు. కేంద్రంలో పార్టీ అధికారంలో ఉన్నందున లోక్‌సభకు పోటీచేస్తే బాగుంటుందని కొందరు భావిస్తున్నారు. రాష్ట్రంలో సొంతంగానో, పొత్తులతోనో అధికారంలోకి వస్తే ఎలాగని ఇంకోసారి వారే ఆలోచిస్తున్నారు. బండారు దత్తాత్రేయ వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్‌ ఎంపీగానే పోటీచేస్తారా?, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ (ముషీరాబాద్‌), బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి (అంబర్‌పేట)లు తిరిగి శాసనసభకు పోటీచేస్తారా లేక లోక్‌సభకు పోటీచేస్తారా.. అన్నది తేలలేదు. కరీంనగర్‌ నుంచి మురళీధర్‌రావు పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్నారు.

మల్కాజిగిరి లేదా ఎల్‌బీ నగర్‌ అసెంబ్లీస్థానాల్లో ఎక్కడ అవకాశం దొరుకుతుందా అన్నదానిపై పేరాల చంద్రశేఖర్‌రావుకు స్పష్టత లేదు. మల్కాజిగిరి లోక్‌సభకా, మల్కాజిగిరి అసెంబ్లీకా అని ఎన్‌.రామచందర్‌రావు తర్జనభర్జన పడుతున్నారు. ఇక నాగర్‌ కర్నూల్‌ అసెంబ్లీకా, మహబూబ్‌నగర్‌ లోక్‌సభకా అన్నదానిపై నాగం జనార్దన్‌రెడ్డి తేల్చుకోలేదు. యెండల లక్ష్మీనారాయణది కూడా ఇదే స్థితి. నిజామాబాద్‌ నుంచి లోక్‌సభకు పోటీయా, అసెంబ్లీకా అనే దానిపై స్పష్టత లేదు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరే ఉన్నా.. కోర్‌ కమిటీ సభ్యుల్లోనే ఇంత అయోమయం నెలకొని ఉండడం గమనార్హం. ఇంకా ఇతర పార్టీల నుంచి వచ్చే వారి పరిస్థితి ఏమిటి? చేరాలనుకునే నేతలతో ఎవరైనా, ఏం మాట్లాడతారు? పార్టీ ఎలా ఎదుగుతుంది?’’ బీజేపీ రాష్ట్ర ముఖ్య నేత ఒకరు పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్రస్థాయి ముఖ్యనేతలు ఏకతాటిపైకి రాకుంటే పార్టీకి ఇబ్బందులు తప్పవని మరో నాయకుడు ఆందోళన వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top