తమిళి సైకు పదవీ గండం

BJP Leader Tamilisai Soundararajan May Lose Her Post - Sakshi

సాక్షి, చెన్నై : రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్‌కు ఈ సారి పదవీ గండం తప్పదన్నట్టుగా పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అధ్యక్ష మార్పునకు కమలనాథులు పట్టుదుకు సిద్ధం అవుతుండడం గమనార్హం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టినానంతరం తమిళి సై సౌందరరాజన్‌ పార్టీ బలోపేతానికి తీవ్రంగానే పరుగులు తీశారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు, సమావేశాలు, సభలు అంటూ ముందుకు సాగారు. దీంతో తమిళనాడు మీద బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నికలకు ముందుగానీయండి, ఎన్నికల సమయానికి గానీయండి తమిళనాడు వైపుగా కేంద్ర పథకాలు దరి చేరాయి. కొన్ని లోక్‌సభ నియోజకవర్గాన్ని గురి పెట్టి ఢిల్లీ పెద్దలు వ్యూహాలకు పదును పెట్టారు.

ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే ఆ నియోజకవర్గాల్లోని పార్టీ వర్గాలతో వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశాలు సైతం నిర్వహిస్తూ ఉత్సాహాన్ని నింపారు. అన్నాడీఎంకేతో కలిసి   ఎన్నికల్ని ఎదుర్కొంటున్న దృష్ట్యా, ఆ ఓటు బ్యాంక్‌ కలిసి రావడమే కాదు, కనీస స్థానాల్ని దక్కించుకోవచ్చన్నట్టుగా వ్యూహాలు సాగాయి. అందుకే పార్టీ నేతలు తమిళిసై సౌందరాజన్, సీపీ రాధాకృష్ణన్, హెచ్‌ రాజా, పొన్‌ రాధాకృష్ణన్‌లను పోటీలో పెట్టారు. అయితే, ఈ నలుగురు మట్టి కరవక తప్పలేదు. ఈ నలుగురు ఓటమి పాలు కావడంతో పాటు పార్టీ ఓటు బ్యాంక్‌ పతనం కావడం బీజేపీ వర్గాల్ని విస్మయంలో పడేశాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో చిన్న పార్టీలతో  కలిసి ఎదుర్కొన్న సమయంలో 5.48 శాతం ఓటు బ్యాంక్‌ బీజేపీకి దక్కింది. ప్రస్తుతం అన్నాడీఎంకే , డీఎండీకే, పీఎంకేలతో కలిసి అడుగులు వేస్తే ఓటు బ్యాంక్‌ 3.65 శాతానికి దిగ జారడం బీజేపీ వర్గాలకు మింగుడు పడడం లేదు.

దీంతో తమిళనాడు మీద మరింత దృష్టి పెట్టేందుకు తగ్గట్టుగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే ప్రత్యేక కార్యాచరణకు బీజేపీ పెద్దలు సిద్ధం అవుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో మార్పులు తప్పదన్న సంకేతాలు వెలువడ్డాయి. ప్రధానంగా బీజేపీ అధ్యక్షురాలు తమిళిసైను మార్చాల్సిందేనని కొంత కాలంగా పార్టీలో నినాదం సాగుతూ వస్తున్నది. ఎన్నికల దృష్ట్యా, అధ్యక్ష మార్పును పక్కన పెట్టి, తమిళి సై ద్వారా ముందుకు సాగారు. అయితే, ఈ సారి అధ్యక్ష మార్పు అనివార్యంగా మారినట్టు సమాచారం. దీంతో పార్టీలో మహిళా నేతగా ఉన్న వానతీ శ్రీనివాసన్‌తో పాటు మరి కొందరు నేతలు ఆ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నాల్ని మొదలెట్టారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top