‘ఉద్యమ ద్రోహుల వేదిక టీఆర్‌ఎస్‌’

BJP Leader K Laxman Slams TRS And KCR - Sakshi

సాక్షి, భువనగిరి(యాదాద్రి) : ఉద్యమ ద్రోహుల వేదికగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) మారిందని, తెలంగాణలో చీకటి రోజులు నడుస్తున్నాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. గులాబీ పత్రికలో తప్ప ఎక్కడా అభివృద్ధి లేదని, అవినీతిలో కాంగ్రెస్‌ పార్టీ అడుగు జాడల్లో కేసీఆర్‌ కుటుంబం నడుస్తుందన్నారు. ‘మార్పు కోసం బీజేపీ జన చైతన్య యాత్ర’లో భాగంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. భువనగిరి నుంచే మార్పు మొదలు కావాలని, అరాచక పాలనను అంతంచేసి తెలంగాణ పునర్‌నిర్మాణం చేసేందుకు ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు.

‘టీఆరెస్ పాలనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీలు ఏం అయ్యాయి. ఉద్యోగాల భర్తీ అటకెక్కింది. కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలు చేయలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటలు కోటలు దాటితే... అభివృద్ధి మాత్రం ఒక్క అడుగుకూడా కదలడం లేదు. గృహనిర్మాణం కోసం కేంద్రం ఇచ్చే నిధుల లెక్క లేకుండా పోయింది. రాష్ట్రం ల్యాండ్‌, శాండ్‌ మాఫియాలకీ అడ్డాగా మారింది. మద్యం ఆదాయం కోసం ప్రజలను తాగుడుకు బానిసలు చేస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తున్న ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కింది. నిధులు కేంద్రానికి, కానీ ప్రచారం మాత్రం టీఆర్‌ఎస్‌ పార్టీది. తెలంగాణలో మరో జేడీఏస్ పార్టీగా టీఆరెస్ మారింది.  కారు స్టీరింగ్ ఎంఐఎం పార్టీ చేతికి వెళ్లింద’న్నారు లక్ష్మణ్‌.

తెలంగాణ త్రి-సీగా మారింది (కాంట్రాక్టర్లు, కలెక్షన్లు, కమీషన్లు)గా మారింది. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. మొక్కల పేరు మీద టీఆర్‌ఎస్‌ కోట్ల రూపాయలు దోచుకుందని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా టీఆర్‌ఎస్‌ నేతలకు లక్ష్మణ్‌ సవాల్‌ విసిరారు. జమ్మూకాశ్మీర్ రావణ కాష్టంలా మారడానికి కాంగ్రెస్ పార్టీ విధానాలే కారణమన్న ఆయన.. ఎంఐఎం పార్టీని, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనగలిగే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top