అందితే జుట్టు.. లేదంటే కాళ్లు

BJP Leader fires on Chandrababu - Sakshi

     బాబు నైజం ప్రజలందరికీ తెలుసు

     బీజేపీ అధికార ప్రతినిధి సుభాశ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: నాడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీని ఎన్టీఆర్‌ స్థాపిస్తే.. పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు వ్యతిరేకంగా స్వార్థ రాజకీయాల కోసం ఆ పార్టీతో చంద్రబాబు పొత్తుకు సిద్ధపడ్డారని బీజేపీ అధికార ప్రతినిధి సుభాశ్‌ విమర్శించారు. దీన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని.. అందితే జుట్టు లేదంటే కాళ్లు పట్టుకునే బాబు నిజస్వరూపం తెలుగు ప్రజలందరికీ తెలుసన్నారు. బాబు చర్యల వల్ల ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందని.. తీవ్ర అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలనతో దేశాన్ని లూటీ చేసిన కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆనాడు నోట్ల రద్దును సమర్థించిన బాబు ఇవాళ అదే నోట్ల రద్దును తప్పుడు నిర్ణయం అనడం ఆయన నైజాన్ని తెలియజేస్తోందన్నారు. ఎన్నికలొస్తున్నాయి కాబట్టి ఓట్ల కోసం రెండు నాల్కల ధోరణితో మాట్లాడటం హేయనీయమన్నారు. నాలుగున్నరేళ్లు బీజేపీతో కలసి ఉన్న బాబు.. ఎన్నికల సమయంలో ఎన్డీయే నుంచి బయటకొచ్చి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ బీజేపీపై అనవసర విమర్శలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు కేసులో ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తోందనని బీజేపీపై లేనిపోని ఆరోపణలు చేయడం సరి కాదన్నారు. 

ఆపరేషన్‌ గరుడ సృష్టికర్త చంద్రబాబే: కోటేశ్వర్‌రావు
ఆపరేషన్‌ గరుడ సృష్టికర్త, సూత్రధారి ఏపీ సీఎం చంద్రబాబేనని బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు కోటేశ్వర్‌రావు ఆరోపించారు. సినీ నటుడు శివాజీ గరుడ ప్రచారకర్త అని.. అందులో కేంద్రం పాత్ర గానీ, మరొకరి పాత్ర గానీ లేదన్నారు. శివాజీ తెరమీద నాయకుడేనని.. కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకుడు అన్నీ బాబేనని దుయ్యబట్టారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో కోటేశ్వర్‌రావు విలేకరులతో మాట్లాడుతూ గరుడ ఆపరేషన్‌ చేస్తున్నదెవరో శివాజీ ఇప్పటివరకు ఆధారాలు చూపెట్టలేదన్నారు. గరుడకు బదులు మరో ఆపరేషన్‌ను కేంద్రం చేపట్టిందనడం, దానికి బాబు మద్దతుగా మాట్లాడటం చూస్తుంటే అందులో ఎవరి ప్రమేయం ఉందో అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన టీడీపీ.. మళ్లీ కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధపడటంతో వస్తున్న విమర్శలను పక్కదారి పట్టించేందుకు శివాజీని బాబు రంగంలోకి దింపారని విమర్శించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top