కేసీఆర్‌ ప్రభుత్వాన్ని పొగుడుతారేంటి?

bjp on kcr government - Sakshi

కేంద్ర మంత్రుల తీరుపై తెలంగాణ బీజేపీ నేతల మండిపాటు

మేం తిడుతుంటే వారు కితాబిస్తున్నారంటూ అమిత్‌షా వద్ద నిరసన

కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై పార్టీ వాకబు

చాలా వరకు వక్రీకరణలు, అసంపూర్తి సమాచారమేనని గుర్తింపు

వాస్తవాలు తెలుసుకున్నాకే మాట్లాడాలని సూచనలు

ఫిబ్రవరిలో హైదరాబాద్‌కు అమిత్‌షా..

మూడు రోజులు ఇక్కడే మకాం

రాష్ట్ర ప్రభుత్వంపై పోరు బాటకు ప్రణాళిక

నెలాఖరు నుంచి వరుసగా కార్యక్రమాలు

సాక్షి, హైదరాబాద్‌ :  ‘కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పగా ఉంది.. దాన్ని చూసేందుకు వస్తా’: కేంద్ర మంత్రి గడ్కరీ ‘హరితహారం ఆలోచన అమోఘం.. మిగతా రాష్ట్రాలూ అనుసరించాలి’: కేంద్ర మంత్రి మహేశ్‌శర్మ  .. ఇటీవల తరచూ కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను, సీఎం కేసీఆర్‌ను అభినందిస్తూ ప్రకటనలు చేస్తుండడం తెలంగాణ బీజేపీ నేతలకు తలనొప్పిగా మారింది. కేసీఆర్‌ది ప్రజావ్యతిరేక పాలన అంటూ తాము పోరుబాట చేపట్టిన సమయంలో కేంద్ర మంత్రులు ఇలా చేస్తుండటాన్ని వారు నేరుగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు.

ఏయే కేంద్ర మంత్రులు కేసీఆర్‌ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారనే వివరాలతో సహా ఫిర్యాదు చేశారు. అయితే ఆయా కేంద్ర మంత్రులను వాకబు చేసిన పార్టీ... మూడొంతుల ప్రకటనలు వాస్తవ విరుద్ధంగా వచ్చాయని గుర్తించినట్టు తెలిసింది. మిగతా ప్రకటనలకు కూడా అసంపూర్తి సమాచారమే కారణమని తేల్చినట్లు సమాచారం. కేంద్ర మంత్రులు తెలంగాణలోని ఏదైనా పథకం గురించి మాట్లాడాల్సి వస్తే.. వాటి వాస్తవ పరిస్థితులను తమ నుంచి తెలుసుకున్నాకే మాట్లాడితే బాగుంటుందని రాష్ట్ర నేతలు అమిత్‌షా దృష్టికి తెచ్చినట్లు తెలిసింది.

ఎదురుదాడి చేయాల్సిందే!
ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వ తీరును కేంద్ర మంత్రులు మెచ్చుకున్నట్టు వెలువడిన వార్తలు అబద్ధపు ప్రచారమని... కొందరు రాష్ట్ర మంత్రులే అలాంటివి లీకుల ద్వారా ఇప్పించి మీడియాలో ప్రముఖంగా వచ్చేలా చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలసి బయటికి వచ్చాక.. కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై సానుకూల ప్రకటనలు చేసినట్టుగా చెబుతున్నారని అంటున్నారు.

అలాంటి సమయంలో వెంటనే మీడియా ద్వారా వాస్తవాలు తెలపాలని కేంద్ర నాయకత్వాన్ని కోరినట్టు తెలిసింది. అంతేగాకుండా కేంద్ర మంత్రుల ప్రశంసల వ్యాఖ్యలతో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌తో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని.. అందువల్ల జాగ్రత్తగా ఉండాలనే బీజేపీ కేంద్ర నాయకత్వంతో చర్చల్లో నిర్ణయించారు. దీనికి సంబంధించి త్వరలో కచ్చితమైన విధానాన్ని కూడా అవలంబించాలని నిర్ణయానికి వచ్చారు.

నెలాఖరు నుంచి..
రాష్ట్ర ప్రభుత్వ తీరును బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందనే అంశాన్ని జనంలోకి బలంగా తీసుకెళితేనే పార్టీకి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని రాష్ట్ర నేతలు కేంద్ర నాయకత్వానికి వివరించారు. ఇందుకోసం తాము సిద్ధం చేసుకున్న షెడ్యూల్‌ను కూడా అందజేశారు. జనవరి నెలాఖరు నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు పార్టీ విభాగాల వారీగా నిర్వహించే కార్యక్రమాలను అందులో వివరించారు. దీనికి కేంద్ర నాయకత్వం కూడా ఆమోదం తెలపడంతో.. ఆయా కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

ఫిబ్రవరిలో రాష్ట్రానికి అమిత్‌షా
వచ్చే ఎన్నికల కోసం వ్యూహ రచనకు సిద్ధమయ్యేందుకు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా వచ్చే నెల (ఫిబ్రవరి)లో హైదరాబాద్‌కు వస్తున్నారు. గత పర్యటనలకు భిన్నంగా ఈ సారి కేవలం రాష్ట్ర పార్టీ తీరును సమీక్షించి తగిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకే సమయం వెచ్చించనున్నారు. బహిరంగ సభలు, కార్యకర్తల సమావేశాలు లేకుండా.. అమిత్‌షా కేవలం 19 పార్టీ సంస్థాగత విభాగాలతో సమీక్షలకే పరిమితమవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గతంలో అమిత్‌షా తెలంగాణ పర్యటన సమయంలో చేసిన విమర్శలకు సీఎం కేసీఆర్‌ వెంటనే కౌంటర్లు వేశారు. అమిత్‌షా రాష్ట్రంలో ఉండగానే ఆయన మాటలను తిప్పికొడుతూ విమర్శలు చేశారు. దానిని దృష్టిలో ఉంచుకున్న అమిత్‌షా.. పక్కా వ్యూహంతో జనంలోకి వెళ్లేలా పార్టీని సిద్ధం చేయాలని ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. ఈ క్రమంలోనే పోరు బాట కార్యక్రమానికి రంగం సిద్ధమైంది.

రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వం పొందిన వారి సంఖ్య 20 లక్షలకు చేరుకుంది. వారు ఒక్కొక్కరు కనీసం నాలుగైదు ఓట్లు వేయించేలా చేయాలనేది అమిత్‌షా దిశానిర్దేశం. వెరసి కోటి ఓట్లు పార్టీ గుప్పిట్లో ఉన్నట్టవుందని, అందుకోసం సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరి ఫోన్‌ నంబర్‌ సేకరించాలని ఆయన ఆదేశించారు. ఫిబ్రవరి పర్యటనలో దీనిపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నట్లు సమాచారం.

విస్తృతంగా ప్రజా పోరుబాట..
రాష్ట్ర బీజేపీ సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో ఈ నెల 24న దళిత అదాలత్‌ను నిర్వహించనుంది. అనంతరం రాష్ట్రంలో ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలన్నింటిలో వివిధ తేదీల్లో ఈ సదస్సులు నిర్వహిస్తారు. ఇక ఈ నెల 23న బీసీ ఆత్మగౌరవ సదస్సు, తర్వాత రైతు పోరు సదస్సులు మొదలవుతాయి. మహబూబ్‌నగర్‌లో పెద్ద ఎత్తున సభ నిర్వహించి రైతు పోరును మొదలు పెట్టనున్నారు. తర్వాత గిరిజన గర్జన చేపడతారు. పార్టీలోని అన్ని విభాగాల ఆధ్వర్యంలో ప్రజా పోరుబాట జరపబోతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top