10న కరీంనగర్‌లో బీజేపీ సభ

BJP House in Karimnagar on 10th - Sakshi

     పాల్గొననున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా

     27, 28 తేదీల్లో జాతీయ యువ సమ్మేళనం

     బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రెండో విడత ప్రచారంలో భాగంగా ఈ నెల 10న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 27, 28 తేదీల్లో జాతీయ యువమోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జాతీయ యువ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇది హైదరాబాద్‌లో జరగడం వల్ల యువ ఓటర్లను ప్రభావితం చేస్తుందని, ప్రధాని నరేంద్ర మోదీ విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దోహదం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమ్మేళనంలో మండల, ఆపై స్థాయి కార్యకర్తలు పాల్గొంటారన్నారు. 28న భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. అందులో అమిత్‌షా యువతకు మార్గదర్శనం చేస్తారని చెప్పారు. ఆ తరువాత 10 రోజుల వ్యవధిలో అమిత్‌షా మరో బహిరంగసభలో పాల్గొంటారని తెలిపారు. తెలంగాణలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు, ప్రధాని కూడా పాల్గొంటారని వెల్లడించారు. బీజేపీ పట్ల మొగ్గు చూపే వారిని పార్టీలో చేర్చుకుంటామన్నారు. ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. 

మార్పు కోసం బీజేపీ.. ఈసారి బీజేపీ
ప్రజలు రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారని, అందుకే ‘మార్పు కోసం బీజేపీ.. ఈసారి బీజేపీ’ నినాదంతో తాము ముందుకు సాగుతున్నామని లక్ష్మణ్‌ వెల్లడించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అవలంభించే విధానాలతో పీపుల్స్‌ మేనిఫెస్టో రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 15 నాటికి మేనిఫెస్టో పూర్తి అవుతుందని, వెనువెంటనే దానిని ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top