ఏడు అదృష్టం తెస్తుందా?

BJP Happy With Uttarpradesh Lok Sabha Elections in Seven steps - Sakshi

అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో పోలింగ్‌ జరగడం బీజేపీ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కారణం ఏమిటో తెలుసా? మొత్తం ఎన్నికలు జరిగే దశలు ఏడు కావడమే. హిందూ మతంలో ఏడు అంకెకు ప్రత్యేకత ఉన్నదనీ, ఏడు అంకెని అదృష్టంగా భావిస్తారనీ బీజేపీ నమ్మకం. అందుకే ఇక్కడ ఈసారి ఎన్నికలు సైతం ఏడు దశల్లో జరగడం తమ పార్టీకి అనుకూలించే విషయంగా ఆ పార్టీ భావిస్తోంది. అలాగే పశ్చిమ యూపీలో ప్రారంభమవుతోన్న ఎన్నికలు వారణాసితో సహా తూర్పు యూపీలో ముగియబోతున్నాయి. బీజేపీ యూపీ మీడియా కోఆర్డినేటర్‌ రాకేష్‌ త్రిపాఠి ఏడు అంకె ప్రాధాన్యతను వివరిస్తూ ‘హిందూ మతంలో ఏడు అంకెకు ఒక ప్రాధాన్యత ఉంది. సూర్యుడి కిరణాల్లో ఏడు రంగులుంటాయి.

సరిగమల్లో ఏడు స్వరాలుంటాయి. జీవితాన్ని పంచుకునే భాగస్వాములు సైతం పెళ్లిలో ఏడడుగులతోనే ఒక్కటవుతారు. కాబట్టి ఏడుకి అంత ప్రాధాన్యత’ అని వ్యాఖ్యానించారు. అలాగే 2014 లోక్‌సభ ఎన్నికలు కానీ, 2017 అసెంబ్లీ ఎన్నికలు కానీ ఈ ఎన్నికల మాదిరిగానే పశ్చిమాన మొదలై తూర్పు యూపీలో ముగుస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లో విజయఢంకా మోగించిన తమ పార్టీ ఈసారీ విజయం ఖాయమని బీజేపీ విశ్వసిస్తోంది.

అయితే, కాంగ్రెస్‌ బీజేపీ వాదాన్ని కొట్టి పారేస్తోంది. ఎన్నికల షెడ్యూలు పశ్చిమం నుంచి తూర్పుకి వెళుతోందా, లేక తూర్పు నుంచి పశ్చిమానికి చేరుతోందా అన్న విషయంతో సంబంధం లేకుండా 2014 ఎన్నికల హామీని నెరవేర్చని ప్రభుత్వం మారిపోవాలని ప్రజలు కోరుకుంటున్నారనీ, ఆ మార్పు కోసం ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారనీ ఆ పార్టీ అధికార ప్రతినిధి అశోక్‌సింగ్‌ కౌంటర్‌ ఇస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 71 సీట్లు గెలుచుకొని 42.63 శాతం ఓట్లను కైవసం చేసుకుంది. అప్నాదళ్‌ రెండు సీట్లు గెలుచుకుంది. సమాజ్‌వాదీ పార్టీ ఐదు సీట్లు గెలుచుకొని 22.35 శాతం ఓట్లను సంపాదించింది. బీఎస్‌పీ ఒక్కసీటు గెలుచుకోలేకపోయినా 19.77 శాతం ఓట్లను కైవసం చేసుకోగలిగింది. కాంగ్రెస్‌ రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్‌కి వచ్చిన ఓట్ల శాతం 7.53.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top