కాంగ్రెస్‌కు, బీజేపీకి మధ్య ‘మిత్ర’ భేదం

BJP Getting Alliances And Congress Is Losing - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో  డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీని ఓడించి కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంతో ఆ పార్టీ విజయపరంపర పార్లమెంట్‌ ఎన్నికల వరకు కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. పాలకపక్షం బీజేపీ పెరిగిన వ్యతిరేకతతోపాటు రైతుల రుణాలను మాఫీ చేస్తామని, వారి పంటలకు సరైన గిట్టుబాటు ధరలను కల్పిస్తామంటూ నాడు కాంగ్రెస్‌ పార్టీ చేసిన వాగ్దానాల వల్ల ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగలిగింది. ఒక్క చత్తీస్‌గఢ్‌ మినహా మిగతా రెండు రాష్ట్రాల్లో ఇతర పార్టీల మద్దతు ద్వారా అత్యల్ప మెజారిటీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. 

లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడం వల్ల మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ తానిచ్చిన హామీలను నెరవేర్చలేక పోయింది. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు కూడా అప్పటంత ఉత్సాహంగా పనిచేయలేకపోతున్నారు. పాకిస్థాన్‌లోని బాలకోట్‌పై భారత వైమానిక దాడులతో బీజేపీ, హిందూత్వ సంఘాల కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికలకు ప్రచారం చేస్తున్నారు. మరో పక్క దేశవ్యాప్తంగా పాత మిత్రులతో పొత్తులను కలుపుకుంటూ బీజేపీ వెళుతుంటే పలు చోట్ల కాంగ్రెస్‌ పార్టీ పాత మిత్రులను వదులుకోవాల్సి వస్తోంది. 

మహారాష్ట్రలో అస్తమానం పార్టీని విమర్శించే శివసేనతోని, అస్సాంలోని అస్సాం గణ పరిషత్‌తో పొత్తులను ఖరారు చేసుకోవడంలో బీజేపీ విజయం సాధించింది. మరో పక్క ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీని వదిలేసి ఎస్సీ, బీఎస్పీలు పొత్తు పెట్టుకోగా, ఢిల్లీలో కాంగ్రెస్‌తోని పొత్తు లేకుండానే ఎన్నికల బరిలోకి దిగుతున్నామని ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రివాల్‌ స్పష్టం చేశారు. ఇక మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీకి భారిప బహుజన్‌ మహాసంఘ్‌ నాయకుడు ప్రకాష్‌ అంబేడ్కర్‌ దూరమయ్యారు. బాలకోట్‌ దాడులను దేశభక్తి కింద ఓట్లుగా మలచుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తుంటే, ఆయన పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా మిత్రులతో చర్చలు జరుపుతూ పొత్తులతో ముందుకు వెళుతున్నారు.
 
గత పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ రాజస్థాన్‌లోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలను, మధ్యప్రదేశ్‌ లో 29లో 27 స్థానాలను గెలుచుకుంది. ఈ సారి అన్ని స్థానాలు రాకపోయినా మెజారిటీ స్థానాలను బీజేపి గెలుచుకునే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకే సంపూర్ణ మెజారిటీ వస్తుందని ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్‌ నిర్వహించిన సర్వే తెలియజేస్తుండగా, మ్యాజిక్‌ ఫిగర్‌ 272 సీట్లను బీజేపీ కైవసం చేసుకోకపోయినా 250 మార్కును దాటుతుందని ఏబీపీ–సీఓటర్‌ నిర్వహించిన సర్వే స్పష్టం చేస్తోంది. ఈ రెండు సర్వేల ప్రకారం కూడా పాలకపక్ష బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీల మధ్య వంద సీట్ల తేడా ఉంటుందని తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top