మా పనితీరుకు ఈ ఎన్నికలే రెఫరెండం

BJP Failed Miserably In Telangana: KTR To Amit Shah - Sakshi

మంత్రి కె.తారకరామారావు

దేవున్ని కూడా మోసం చేసిన పార్టీ బీజేపీ

అమిత్‌షాది సమరభేరి కాదు.. అసమర్థభేరి

ఉన్న ఐదు సీట్లు తెచ్చుకుంటే గొప్ప

కేంద్రం నుంచి ఒక్కపైసా అదనంగా రాలేదు

కాంగ్రెస్‌కు క్యాడర్‌లేదు.. టీడీపీకి లీడర్‌లేడు

సాక్షి, సిరిసిల్ల: ఈ ఎన్నికలను తమ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఇచ్చే రెఫరెండంగా భావిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలను మోసం చేసిన పార్టీ టీఆర్‌ఎస్‌.. అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కరీంనగర్‌లో చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఘాటుగా స్పందించారు. రామమందిరం నిర్మిస్తామని చెప్పి ఏకంగా దేవుడినే మోసం చేసిన పార్టీ బీజేపీ.. అని దుయ్యబట్టారు.

హిందువులకు బీజేపీకంటే తామే ఎక్కువ చేశామని, యాదాద్రి, వేములవాడలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. అందరినీ సమానంగా చూసే సెక్యులర్‌ పార్టీ టీఆర్‌ఎస్‌ అని పేర్కొన్నారు. మీరు హామీ ఇచ్చి అమలుచేయని జాబితా విప్పితే తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇమ్మంటే.. ఇప్పటివరకు స్పందించలేదన్నారు.

రాష్ట్రవిభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయలేదని, కాజీపేట రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ఊసే లేదని, హైదరాబాద్‌లో ఐటీఆర్‌ఆర్‌ ప్రాజెక్టు కోసం రూ.4 వేల కోట్లు అడిగితే ఇంతవరకు ఉలుకుపలుకూ లేదని విమర్శించారు. దేశ సగటు కంటే ఎక్కువగా 17.17 శాతం ప్రగతితో సాగుతున్న తెలంగాణ కడుతున్న పన్నుల మేరకే కేంద్రం నిధులు చెల్లిస్తున్నదని, మోదీ పొలం అమ్మి ఇవ్వటం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రాలు లేనిదే కేంద్రం లేదని, రాష్ట్రం కట్టే పన్నుల ద్వారా రావల్సిన మొత్తాన్నే కేంద్రం ఇచ్చిందని, అదనంగా ఒక్క పైసా కూడా రాలేదని స్పష్టంచేశారు.

మీరేం నెరవేర్చారు?
అమిత్‌షా ప్రసంగం అరిగిపోయిన గ్రామ్‌ఫోన్‌ రికార్డులా ఉందని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. అది సమరభేరీ కాదు అసమర్థ భేరీ అని ఎద్దేవా చేశారు. దేశానికి, పేదలకు మోదీ ఏం చేశారో చెప్పుకోలేని పరిస్థితిలో బీజేపీ నేతలు ఉన్నారన్నారు. ఒకవైపు ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను నంబర్‌వన్‌గా అభివర్ణిస్తుంటే.. చుట్టపుచూపుగా వచ్చినోళ్లంతా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

బీజేపీ నేతలు తమ గురించి తాము ఎక్కువగా ఊహించుకుంటున్నారన్నారు. 119 స్థానాల్లో పోటీ చేస్తామంటున్న బీజేపీ నేతలు.. వాటిల్లో ఎన్నింటికి డిపాజిట్లు వస్తాయో చూసుకోవాలని అన్నారు. ఉన్న ఐదు సీట్లు గెల్చుకుంటే మీరే గొప్ప అని ఎద్దేవా చేశారు. దమ్ముంటే మిగిలిన ఈ 9 నెలల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చండని అన్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని.. మీ రెచ్చగొట్టే మాటలు ఇక్కడ సాగవని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌కు క్యాడర్‌ లేదు.. టీడీపీకి లీడర్‌ లేడు
పనికిమాలిన ప్రతిపక్షాలకు తాము జవాబుదారీ కాదని, ప్రజలకు మాత్రమే జవాబు చెబుతామని కేటీఆర్‌ అన్నారు. మొన్నటిదాకా బద్ధవైరంతో కొట్టుకున్న పార్టీలు.. ఇప్పుడు కేసీఆర్‌ను ఓడించేందుకు జతకడుతున్నాయని అన్నారు. కాంగ్రెస్‌లో హామీలు ఒకరిస్తే.. కుర్చీనెక్కేది మరొకరని ఎద్దేవా చేశారు. ఇకవాటిని నెరవేర్చేది ఎవరని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే సీఎం అభ్యర్థులే ఎక్కువ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు క్యాడర్‌ లేదని, టీడీపీకి లీడర్‌ లేరని విమర్శించారు.రీ కార్యక్రమంలో టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, తాజా మాజీ ఎమ్మెల్యే రమేశ్‌బాబు, కరీంనగర్‌ మేయర్‌ రవీందర్‌సింగ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top