తలైవా.. రావా!

BJP Door Opens For Rajinikanth : Amit Shah - Sakshi

రజనీకాంత్‌ కోసం కమలనాథుల తహతహ

కొత్తకూటమికి బీజేపీ కసరత్తు

అన్నాడీఎంకేకి కటీఫ్‌ చెప్పినట్లే

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కమలనాథులు కొత్త పల్లవి అందుకున్నారు. అన్నాడీఎంకేకు దూరం జరిగి రజనీకాంత్‌ పెట్టబోయే పార్టీకి చేరువకావాలనితహతహలాడుతున్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని తూర్పారపట్టడం ద్వారాఅమిత్‌షా కొత్త కూటమికి సంకేతాలు ఇచ్చారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో బీజేపీ గణనీయమైన ఫలితాలు సాధించేందుకు ఓ ప్రాంతీయ పార్టీతో చేయి కలపాలని భావిస్తోంది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లోగా రజనీకాంత్‌ను తమవైపునకు తిప్పుకోవాలని అమిత్‌షా ఆశిస్తున్నట్లు బీజేపీ వర్గాలు అంటున్నాయి.

జయలలిత కన్నుమూయక ముందు నుంచే అన్నాడీఎంకే ప్రభుత్వ పగ్గాలు బీజేపీ చేతిలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అమ్మ అంత్యక్రియల్లో సైతం బీజేపీ జోక్యం స్పష్టంగా కనిపించింది. భిన్న ధ్రువాలమైన తాను, ఎడపాడి మోదీ సలహాతోనే ఏకమైనామని డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వమే బహిరంగంగానే ప్రకటించి అనుమానాలను నివృత్తి చేశారు. దక్షిణాదిలో వేళ్లూనుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి తమిళనాడులో అంతగా ఆదరణ లేదు. గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కన్యాకుమారిలో ఒకే ఒక స్థానాన్ని గెలుచుకున్నా, అది అక్కడి అభ్యర్థి పొన్‌ రాధాకృష్ణన్‌ వ్యక్తిగత ప్రాభవమే. అమ్మ మరణం తరువాత అనాథలా మారిన అన్నాడీఎంకేను చేరదీయడం ద్వారా రాష్ట్రంలో వేళ్లూనుకోవాలని బీజేపీ ఆశపడింది. అయితే ఆ పార్టీలో నాయకత్వలేమి, పాలనలోని వైఫల్యాలుతమకు కలిసొచ్చే అంశాలు కావని బీజేపీ తేల్చేసుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చెన్నైలో సోమవారం తన ప్రసంగంలో ఇదే విషయాని నర్మగర్భంగా చెప్పారు. నాలుగేళ్లపాటు కేంద్రంలోనూ, దేశంలోని ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి రహిత పాలనను అందిస్తున్నామని అమిత్‌ చెబుతూనే తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వం అవినీతికి దేశంలోనే పరాకాష్టగా మారిందని దుయ్యబట్టారు.

తమిళనాడులోనూ అవినీతి రహిత పాలనను కోరుకుంటున్నారా అని ప్రజలను, కార్యకర్తలను ప్రశ్నించారు. అంటే అన్నాడీఎంకేతో అనధికారికంగా సాగుతున్న స్నేహానికి చెక్‌ అందరూ భావిస్తున్నారు. తమిళనాడులో బీజేపీ గణనీయమైన ఫలితాలు సాధించాలంటే ఏదో ప్రాంతీయ పార్టీ పంచన చేరకతప్పదు. డీఎంకే, కాంగ్రెస్‌ మధ్య పొత్తు కొనసాగుతోంది. అన్నాడీఎంకేపై అమిత్‌షా అవినీతి మచ్చను వేశారు. గత పార్లమెంటు ఎన్నికల్లో డీఎండీకే, పీఎంకే, ఎండీఎంకేలతో పొత్తుపెట్టుకున్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత అవన్నీ బీజేపీకి దూరమయ్యాయి. ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోకుంటే జాతీయ పార్టీలకు మనుగడలేని పరిస్థితి ఉన్నందునే కాంగ్రెస్‌ పార్టీ డీఎంకేను పట్టుకుని ఊగులాడుతోంది. అందుకే రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకే లేని కొత్త కూటమి ఏర్పాటు చేయాలని ఆశిస్తున్న బీజేపీకి రజనీకాంత్‌ పెట్టబోయే పార్టీనే ఆశాకిరణంగా మారింది. రజనీ, మోదీల మధ్య స్నేహం ప్రజలకు కొత్తకాదు. పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో ఉన్న రజనీకాంత్‌ను రాబోయే పార్లమెంటు ఎన్నికల్లోగా తమవైపునకు తిప్పుకోవాలని అమిత్‌షా ఆశిస్తున్నట్లు బీజేపీ వర్గాలు అంటున్నాయి. పార్టీలోని శక్తి కేంద్రాలు పూర్తిస్థాయిలో బలోపేతమైన తరువాత ఈ ఏడాది అక్టోబరులో ప్రధాని మోదీ తమిళనాడుకు వస్తారు, ఆయన సమక్షంలో సమావేశం అవుదామని సోమవారం నాటి సభలో అమిత్‌షా కార్యకర్తలకు తెలిపారు. మోదీ సమావేశం నాటికి రజనీ నుంచి సానుకూల స్పందనకోసం బీజేపీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి.

అమిత్‌షాపై ప్రశ్నల వర్షం
ఇదిలా ఉండగా, చెన్నైలో అమిత్‌షా చేసిన ప్రసంగంపై ప్రతిపక్షాలు ప్రశ్నల వర్షం కురిపించాయి. అన్నాడీఎంకే అవినీతిమయమని ప్రకటించిన అమిత్‌ షా రాబోయే ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీచేసేందుకు సిద్ధమా అని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌ సోమవారం సవాల్‌ విసిరారు.  అన్నాడీఎంకే ప్రభుత్వం అవినీతిలో దేశంలోనే నంబర్‌ వన్‌ అని నమ్మినపుడు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు చేయలేదని టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌ అమిత్‌షాను నిలదీశారు. అవినీతి ప్రభుత్వం కూలిపోకుండా కాపాడుతున్నది ఎవరని అమిత్‌షాను ఆర్కేనగర్‌ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌ ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top