ఐదింట ఉత్కంఠ.. బిగ్‌ ఫైవ్‌

BJP And Congress Targets Loksabha Elections - Sakshi

అమేథీ,తిరువనంతపురం, ఘాజియాబాద్, ముంబై నార్త్‌ సెంట్రల్,ముజఫర్‌నగర్‌

ప్రముఖుల మధ్య యుద్ధాన్నితలపిస్తోన్న పోటీ

దేశవ్యాప్తంగా అందరి కళ్లూ ఆ నియోజకవర్గాలపైనే..

అసలైన పోరు మొదలైంది. కాంగ్రెస్‌–బీజేపీ, ఇతర ప్రధాన పార్టీలు ఎన్నికల గోదాలో అమీతుమీ తేల్చుకునే పనిలో పడ్డాయి. ప్రముఖుల మధ్య పోటీ యుద్ధాన్ని తలపిస్తోంది. ఎవరికి వారే గెలుపు కోసం వ్యూహాలు, ప్రతివ్యూహాలు పన్నుతోంటే.. వీరిలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అనే దానిపై రాజకీయ విశ్లేషకులు లెక్కలు తేల్చే పనిలో పడ్డారు. మరోపక్క బరిలో నిలిచిన అభ్యర్థుల గెలుపోటములపై దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దేశంలోని ఐదు కీలక నియోజకవర్గాలు.. అక్కడ తలపడుతున్న ప్రముఖులు.. నెలకొన్న రాజకీయ పరిణామాలపై ఫోకస్‌..

అమేథీ
రాహుల్‌ వర్సెస్‌ స్మృతీ ఇరానీ
ఆయన గెలిస్తే ‘రాజు’.. ఆమె గెలిస్తే ఇ‘రాణి’

ఐదేళ్ల క్రితం కాంగ్రెస్‌ ‘యువరాజు’ రాహుల్‌గాంధీపై అమేథీలో పోటీకి స్మృతీ ఇరానీ పేరును బీజేపీ ప్రకటించగానే జనం ఆశ్చర్యపోయారు. నెహ్రూ–గాంధీ కుటుంబానికి చెందిన కంచుకోటలో బీజేపీ తరఫున నిలబడే ధైర్యం స్మృతికి ఉండటానికి అప్పటి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ, యూపీ పార్టీ ఇన్‌చార్జ్‌ అమిత్‌షా అండదండలే కారణం. రాహుల్‌ చిన్నాన్న సంజయ్, తండ్రి రాజీవ్, తల్లి సోనియాతో పాటు రాజీవ్‌ మిత్రుడు సతీశ్‌శర్మ కాంగ్రెస్‌ తరఫున గెలిచిన స్థానమిది. 1977లో సంజయ్, 1998లో సతీశ్‌ ఓడిపోయారు. అమేథీ నుంచి తొలిసారి 2004 ఎన్నికల్లో రాహుల్‌ పోటీ చేశారు. సమీప బీఎస్పీ ప్రత్యర్థి సీపీ మిశ్రాపై 2,90,000పైగా ఓట్లతో గెలిచారు. 2009 ఎన్నికల్లో ఆయన బీఎస్పీ ప్రత్యర్థి ఆశీష్‌ శుక్లాపై 3,70,000పైగా ఓట్లతో విజయం సాధించారు. ఈ రెండు ఎన్నికల్లోనూ రాహుల్‌ గెలుపుపై చర్చే జరగలేదు. ఆయన విజయం ఖాయమనే భావనే సర్వత్రా వ్యాపించింది. ఇలాంటి కాంగ్రెస్‌ ‘సొంత’ సీటులో రాహుల్‌పై పోటీకి దిగాలంటే స్థానికులకే ఛాన్స్‌ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పంజాబీ, మరాఠీ, బెంగాలీ, అస్సామీ కుటుంబ నేపథ్యమున్న స్మృతి ఢిల్లీలో పుట్టి పెరిగారు. ముంబైలో టీవీ సీరియళ్లు, సినిమా తారగా స్థిరపడ్డారు.

2014 నాటికి రాజ్యసభకు ఎన్నికైన స్మృతి బీజేపీ ప్రతినిధిగా టీవీ చానళ్ల చర్చల్లో పాల్గొంటూ వాద్ధాటితో అందరినీ ఆకట్టుకున్నారు. అమేథీలో నరేంద్రమోదీ ఎంపిక చేసిన అభ్యర్థిగా స్మృతి దూకుడుగా ప్రచారం చేశారు. గట్టి పోటీనిచ్చారు. ఓట్ల లెక్కింపు సమయంలో మొదటి కొన్ని రౌండ్లలో రాహుల్‌పై స్మృతి ఆధిక్యం ప్రదర్శించడం విశేషం. చివరికి రాహుల్‌ గెలిచినా ఆయన మెజారిటీని ఆమె బాగా తగ్గించగలిగారు. లక్షా ఏడు వేల ఓట్లతో రాహుల్‌ బయటపడటం.. నిజంగా స్మృతికి విజయంగానే పరిగణించాలి. ఒకసారి పోటీచేసి, ఓడిపోయాక మళ్లీ ఆమె అమేథీ వంక చూడరని భావించారు. అయితే, ఇది నిజం కాదని.. వరుసగా రెండోసారి రాహుల్‌పై అమేథీలో పోటీకి ఈ 43 ఏళ్ల మాజీ నటి సిద్ధమవడం ద్వారా నిరూపించారు. కాగా, రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి కూడా బరిలోకి దిగుతున్నట్టు సమాచారం. వయనాడ్‌ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోట. ఇక్కడ కాంగ్రెస్‌ ఎప్పుడూ ఓడిపోలేదు. సిట్టింగ్‌ ఎంపీ షానవాజ్‌ ఇటీవల మరణించడంతో ఈ స్థానం ఖాళీగా ఉంది. రాహుల్‌ వయనాడ్‌లో పోటీపై స్మృతి స్పందిస్తూ.. అమేథీ ప్రజలు తిరస్కరిస్తున్నందునే ఆయన కేరళ పారిపోయారని వ్యాఖ్యానించారు.

పరిశ్రమల స్థాపనకు చొరవ
ప్రసిద్ధ రాజకీయ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన నియోజకవర్గాన్ని ఎలా నిర్లక్ష్యం చేశారో చెప్పడానికి చక్కటి ఉదాహరణ అమేథీ. అనేక పరిశ్రమలు స్థాపిస్తామని కాంగ్రెస్‌ ఎన్నోసార్లు వాగ్దానాలు చేసింది. శంకుస్థాపనలు జరిగాయి కానీ పరిశ్రమలు మొదలు కాలేదు. అప్పుడప్పుడూ రాహుల్‌ చెల్లెలు ప్రియాంక పర్యటనలు మినహా జరిగింది శూన్యం. ఓడినా కానీ ఈ ప్రాంతం అభివృద్ధికి పాటుపడగలనన్న హామీ ప్రకారం స్మృతి గట్టిగానే పనిచేశారు. అమేథీలో ఏకే–203 కలాష్నికోవ్‌ రైఫిళ్ల తయారీకి భారత–రష్యా జాయింట్‌ వెంచర్‌ ఫ్యాక్టరీని ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ హాజరైన ఈ కార్యక్రమంలో మోదీ పాల్గొనడం అమేథీ పోరుపై ఆయనకున్న పట్టుదలను సూచిస్తోంది. ఎన్నికల షెడ్యూలు ప్రకటించడానికి ముందే స్మృతి అమేథీపై చూపిస్తున్న శ్రద్ధ కాంగ్రెస్‌ను బెంబేలెత్తిస్తోంది. కిందటి ఎన్నికల్లో స్మృతి గెలుస్తారన్న నమ్మకం ఎవరిలోనూ లేదు. కాని, ఆమె రాహుల్‌ను ఓడించి చరిత్ర సృష్టిస్తారని బీజేపీ కార్యకర్తలు, సానుభూతిపరులు ఇప్పుడు నమ్ముతున్నారు.

ముంబై నార్త్‌ సెంట్రల్‌

ప్రియా వర్సెస్‌ పూనమ్‌
ఇద్దరు మహిళల యుద్ధం

ఇద్దరు ప్రముఖ రాజకీయ కుటుంబాల్లో పుట్టిన మహిళలు పోటీచేస్తున్న మహారాష్ట్ర రాజధానిలో భాగమైన నియోజకవర్గం ముంబై నార్త్‌ సెంట్రల్‌. కిందటి ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పూనమ్‌ మహాజన్‌ గెలిచారు. ఆమె దివంగత బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రమోద్‌ మహాజన్‌ కూతురు. 2014లో కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీచేసిన సిట్టింగ్‌ సభ్యురాలు ప్రియాదత్‌ను లక్షా 86 వేల ఓట్లతో ఓడించారు. బాలీవుడ్‌ నటులు, మాజీ ఎంపీలు నర్గీస్, సునీల్‌దత్‌ల రెండో కూతురే ప్రియ. 2005లో తండ్రి మరణించాక జరిగిన ఉప ఎన్నికలో ప్రియ లక్షా 72 వేల ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచారు. 2009లో ఇక్కడ నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీచేసిన ప్రియ తన సమీప బీజేపీ అభ్యర్థి, ప్రసిద్ధ లాయర్‌ రామ్‌ జెఠ్మలానీ కుమారుడు మహేష్‌ జెఠ్మలానీపై లక్షా 74 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కిందటిసారి పోటీచేసిన ప్రధాన అభ్యర్థులే (పూనం, ప్రియ) పోటీ చేస్తుండడంతో ఈ స్థానం ఫలితంపై ఆసక్తి నెలకొంది. పూనమ్‌ తండ్రి ప్రమోద్‌ బీజేపీకి భారీ స్థాయిలో నిధులు సమకూర్చడంతో పాటు ఎన్నికల వ్యూహాల్లో ఆరితేరిన నేతగా పేరు సంపాదించారు. అలాగే పూనమ్‌ మేనత్త కూతురు (దివంగత నేత గోపీనాథ్‌ ముండే కూతురు) పంకజా మహారాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్‌ మంత్రి. పూనమ్‌ భర్త హైదరాబాద్‌కు చెందిన తెలుగు పారిశ్రామికవేత్త వేజెండ్ల ఆనందరావు. ఇంత రాజకీయ నేపథ్యం ఉన్న 38 ఏళ్ల పూనమ్‌ ప్రస్తుతం కాషాయపక్షం యువజన విభాగం బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు. ప్రియకు తల్లిదండ్రులకున్నంత పేరు లేకున్నా కాంగ్రెస్‌–ఎన్సీపీ కూటమి తరఫున ఈసారి పూనమ్‌కు గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్నారు.

ఘాజియాబాద్‌
వీకే సింగ్‌ వర్సెస్‌ డాలీశర్మ
త్రిముఖ పోటీలో సింగే కింగ్‌!

రాజధాని ఢిల్లీ సమీపంలోని యూపీ వీఐపీ స్థానం ఘాజియాబాద్‌. 2014లో బీజేపీలో చేరిన మాజీ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వీకే సింగ్‌ భారీ మెజారిటీతో ఇక్కడి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మళ్లీ సింగ్‌కే బీజేపీ టికెట్‌ లభించింది. 2009లో కొత్తగా ఏర్పాటైన ఈ స్థానం నుంచి బీజేపీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఎన్నికయ్యారు. ఈ ప్రాంతంలో మొదటి నుంచీ కాషాయ పక్షానికి జనాదరణ ఎక్కువ. కిందటి ఎన్నికల్లో రాజ్‌నాథ్‌ లక్నో నుంచి పోటీ చేయడంతో వీకే సింగ్‌కు ఘాజియాబాద్‌లో బీజేపీ టికెట్‌ లభించింది. ఈ ఎన్నికలకు రెండేళ్ల ముందు అన్నా హజారే నేతృత్వంలో మొదలైన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనడం ద్వారా సింగ్‌కు ప్రచారం లభించింది. యూపీఏ హయాంలో పుట్టిన తేదీ మార్పు వివాదం వల్ల ఆయన కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన మాజీ హిందీ నటుడు రాజ్‌బబ్బర్‌ను 5,67,000 ఓట్ల మెజారిటీతో సింగ్‌ ఓడించారు. ప్రత్యర్థులందరికీ డిపాజిట్లు దక్కలేదు. మోదీ కేబినెట్‌లో సహాయ మంత్రిగా చేరి ప్రస్తుతం విదేశాంగశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. గతంలో అనేకసార్లు పార్లమెంటుకు ఎస్పీ, కాంగ్రెస్‌ టికెట్‌పై ఎన్నికైన బబ్బర్‌ను దేశంలోనే రెండో భారీ మెజారిటీతో ఓడించి సింగ్‌ సంచలనం సృష్టించారు. కాంగ్రెస్‌ ఈసారి డాలీ శర్మ అనే కొత్త అభ్యర్థిని రంగంలోకి దించింది. బబ్బర్‌కు కాంగ్రెస్‌ ఈసారి ఫతేపూర్‌ సిక్రీ సీటు కేటాయించింది. కిందటి ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కూడా విడివిడిగా పోటీచేశాయి. ఈసారి ఈ కూటమి తరఫున సురేశ్‌ బన్సల్‌ (ఎస్పీ) పోటీ చేస్తున్నారు. 2012లో అసెంబ్లీకి ఎన్నికైన బన్సల్‌కు నగరంలోని వైశ్య సామాజిక వర్గంలో పట్టుంది. ఎస్పీ, బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థి పోటీలో ఉండడంతో త్రిముఖ పోటీలో వీకే సింగ్‌కు విజయావకాశాలుంటాయని అంచనా. ఈ నియోజకవర్గ అభివృద్ధికి సింగ్‌ కృషి చేశారనే పేరుంది.

తిరువనంతపురం
థరూర్‌ వర్సెస్‌ రాజశేఖరన్‌
‘ఆ ఒక్కటీ’ ఈ సీటేనా?

వరుసగా 2009, 2014 ఎన్నికల్లో లోక్‌సభకు కేరళలోని తిరువనంతపురం నుంచి ఎన్నికైన కేంద్ర మంత్రి శశిథరూర్‌ (కాంగ్రెస్‌) మూడోసారి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. బీజేపీ తరఫున మిజోరం మాజీ గవర్నర్‌ కుమ్మనం రాజశేఖరన్, ఎల్డీఎఫ్‌ టికెట్‌పై సి.దివాకరన్‌ (సీపీఐ) పోటీ చేస్తున్నారు. రాజశేఖరన్‌ గతంలో కేరళ బీజేపీ అధ్యక్షునిగా పనిచేశారు. మార్క్సిస్టులు, ఆరెస్సెస్‌ కార్యకర్తల మధ్య హింసాత్మక ఘర్షణలకు నిలయమైన కన్నూర్‌ జిల్లాలో బీజేపీ ఉనికి కాపాడడంలో ఆయనది కీలకపాత్ర. సీపీఐ అభ్యర్థి దివాకరన్‌ ఎల్డీఎఫ్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఏఐటీయూసీ నాయకుడు. భార్య సునంద అనుమానాస్పద మృతి, తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో థరూర్‌ దేశ ప్రజలకు సుపరిచితుడు. మొదటిసారి ఆయన సీపీఐ నేత పి.రామచంద్రన్‌నాయర్‌ను దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో ఓడించారు. అప్పుడు బీఎస్పీ, బీజేపీ అభ్యర్థులు వరుసగా 86 వేలు, 84 వేలకుపైగా ఓట్లు చీల్చడంతో థరూర్‌ గెలుపు సాధ్యమైంది. కిందటి ఎన్నికల్లో బీజేపీ సీనియర్‌ నేత ఓ రాజగోపాల్‌పై 15 వేలకు పైగా ఓట్లతో థరూర్‌ గెలుపొందారు. ఎల్డీఎఫ్‌కు చెందిన సీపీఐ అభ్యర్థి బెనెట్‌ అబ్రహాం 2 లక్షల 48 వేల ఓట్లు చీల్చడంతో థరూర్‌ స్వల్ప మెజారిటీతో బయటపడ్డారు. ఇటీవల శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశంపై చెలరేగిన వివాదం వల్ల కాషాయ పక్షానికి జనాదరణ పెరిగిందని చెబుతున్నారు. కేరళలోని 20 సీట్లలో కాంగ్రెస్‌ ఫ్రంట్‌కు 16, కమ్యూనిస్టు ఫ్రంట్‌కు 3 సీట్లు రావచ్చని, బీజేపీకి ఒక సీటు దక్కవచ్చని టైమ్స్‌నౌ–వీఎంఆర్‌ తాజా సర్వే సూచింది. ఈ ఒక్క సీటు తిరువనంతపురం కావచ్చని రాజకీయ పండితుల అంచనా.

ముజఫర్‌నగర్‌
అజిత్‌సింగ్‌ వర్సెస్‌ బలియాన్‌
మోదీ కావాలి.. ‘చౌధరీ’ కావాలి

పశ్చిమ యూపీలోని ప్రతిష్టాత్మక నియోజకవర్గం ముజఫర్‌నగర్‌ నుంచి ఆరెల్డీ నేత, కేంద్ర మాజీ మంత్రి అజిత్‌సింగ్‌ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఎస్పీ–బీఎస్పీ కూటమిలో భాగమైన ఆరెల్డీకి మూడు సీట్లు కేటాయించగా ఈసారి ఆయన సొంత స్థానం బాగ్‌పత్‌ను వదిలి పొరుగున ఉన్న ముజఫర్‌ నగర్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తండ్రి, మాజీ ప్రధాని చౌధరీ చరణ్‌సింగ్‌ 1971లో ఇక్కడి నుంచే పోటీచేసి అప్పటి కాంగ్రెస్‌ మిత్రపక్షమైన సీపీఐ నేత విజయ్‌పాల్‌సింగ్‌ చేతిలో ఓడిపోయారు. 2013లో జిల్లాలో జరిగిన మతఘర్షణల్లో కీలక పాత్ర పోషించిన జాట్‌ నేత సంజీవ్‌ బలియాన్‌ బీజేపీ టికెట్‌పై ముజఫర్‌నగర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రిగా ఉన్న బలియాన్‌ జాట్లు, ముస్లింల మధ్య ఉన్న విద్వేషాల నేపథ్యంలో కిందటిసారి తన సమీప ప్రత్యర్థి కదీర్‌ రాణాపై 4 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు ఆరేళ్ల నాటి ఘర్షణల వాతావరణం లేకపోవడంతోపాటు, ప్రధాన అభ్యర్థులిద్దరూ జాట్‌ కులస్తులే కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. 80 ఏళ్ల అజిత్‌సింగ్‌ తన తండ్రి స్థానమైన బాగ్‌పత్‌ నుంచి 1989 మధ్య 2009 వరకూ జరిగిన ఆరు ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1998, 2014 ఎన్నికల్లో అదే స్థానంలో ఓడిపోయారు. అందుకే ఈసారి ముజఫర్‌నగర్‌కు మారారు. మొదట్నించీ చరణ్‌సింగ్‌కు, అజిత్‌కు జాట్లలో పట్టు ఉండడం, బీఎస్పీ, ఎస్పీ మద్దతు కారణంగా జాట్‌లు, బీసీల ఓట్లతో ఆయనకు గెలుపు అవకాశాలు మెరుగయ్యాయని భావిస్తున్నారు. 2013 ఘర్షణల కారణంగా చెడ్డ పేరున్నా హిందువుల ఓట్లు, జాట్ల మద్దతుతో మళ్లీ గెలుస్తాననే నమ్మకంతో సంజీవ్‌ బలియాన్‌ ఉన్నారు. ప్రధాన అభ్యర్థులిద్దరూ తమ వర్గం వారే కావడంతో గణనీయ సంఖ్యలో ఉన్న జాట్‌ ఓటర్లు ఎటు మొగ్గాలో తెలియని గందరగోళ స్థితిలో ఉన్నారు. ‘మాకు మోదీ కావాలి, చౌధరీ (అజిత్‌) అవసరం ఉంది’ అని వారు చెబుతున్నారు. ముస్లింలు ఆరెల్డీ నేతకే మద్దతు పలుకుతారని భావిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top