మహా ఎదురీత

BJP And Congress Situation in Maharashtra - Sakshi

మహారాష్ట్రలో బీజేపీ, కాంగ్రెస్‌ కూటముల పరిస్థితి.. 

చిన్న పార్టీల పొత్తులు ‘కమలా’నికి ప్రతికూలమే!

మరాఠా దిగ్గజం శరద్‌ పవార్‌ సొంత నియోజకవర్గం బారామతిని కూడా తన ఖాతా లో వేసేసుకున్న షా లక్ష్యం ఉన్నతమైందే కావ చ్చు. గత లోక్‌సభ ఎన్నికల్లో 40 సీట్లు (బీజేపీ– 22, శివసేన– 18) సాధించిన కూటమిపై నమ్మకం ఉండవచ్చు. తప్పులేదు. అయితే దురదృష్టం ఏమిటంటే.. ఈయన వాస్తవ పరిస్థితులను విస్మరించినట్టు కనిపిస్తోంది. అప్పట్లో దేశవ్యాప్తంగా వీచిన మోదీ పవనాలతో మహారాష్ట్రలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న మాట నిజమే అయినప్పటికీ తాజా ఎన్నికల్లో మాత్రం అధికార కూటమికి అంత అనుకూలమైన పరిస్థితులు లేవు. అప్పటిలా ఈసారి ప్రతిపక్షం కూడా చెల్లాచెదురుగా, బలహీనంగా కనిపించడం లేదు. ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రాష్ట్ర ప్రచార బరిలోకి దిగనున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 11, 18, 29 తేదీల్లో జరగనున్న మహారాష్ట్ర ఎన్నికలు ఇకపై మరింత వేడెక్కనున్నాయి.

మూడు–నాలుగు కూటములతో చిక్కులు
ఉత్తరప్రదేశ్‌ తరువాత అత్యధిక స్థానాలు కలిగిన రాష్ట్రంగా మహారాష్ట్ర బీజేపీకి ఎంతో కీలకమైంది. ఈ కారణంగానే పెడముఖంగా ఉన్న.. మాటల తూటాలు పేల్చిన భాగస్వామిని కొంత రాజీపడి మరీ మళ్లీ తన వైపునకు తిప్పుకుంది. భవిష్యత్తులో అన్ని ఎన్నికలనూ ఒంటరిగానే ఎదుర్కొంటామని శివసేన పదేపదే ప్రకటించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. మొత్తమ్మీద ఈసారి మహారాష్ట్ర ఎన్నికల బరిలో బీజేపీ శివసేనల ‘మహా యుతి’ ఒకవైపున నిలిస్తే.. కాంగ్రెస్‌ –ఎన్‌సీపీల మహాఘఠ్‌బంధన్‌ ఇంకోవైపున ఉంది. చిన్న చిన్న పార్టీలతో కూడిన ఒకట్రెండు కూటములు కూడా పోటీలో ఉన్నాయి. ఒప్పందంలో భాగంగా బీజేపీ 25 స్థానాల్లో, శివసేన 23 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మహాఘఠ్‌ బంధన్‌లో కాంగ్రెస్‌ 24, ఎన్‌సీపీ 20 స్థానాల్లో.. మిగిలిన నాలుగు స్థానాల్లో చిన్న పార్టీలు పోటీ చేస్తున్నాయి. వీటికి తోడు ఎస్పీ – బీఎస్పీ కూటమి భరిపా బహుజన్‌ మహాసంఘ్, ఏఐఎంఐఎంతో కూడిన ‘వంచిత్‌ బహుజన్‌ అఘాడి’ కూడా బరిలో ఉండటం పోటీని ఆసక్తికరంగా మార్చింది. రెండు కూటములు మొత్తం 48 స్థానాలకూ పోటీ చేస్తుండటం వల్ల బీజేపీ–శివసేన, కాంగ్రెస్‌ –ఎన్‌సీపీ కూటముల ఫలితాలపై ప్రభావం చూపవచ్చు. దళిత, ముస్లిం జనాభా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న దాదాపు 12 స్థానాల్లో ఫలితాలు తారుమారయ్యే అవకాశమూ లేకపోలేదు. కాకపోతే.. రాజ్‌థాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) ఈసారి పోటీ చేయడం లేదని ప్రకటించడం బీజేపీ – శివసేన కూటమికి కొంత ఊరటనిచ్చే అంశం. 2009 నాటి లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీ 11 స్థానాల్లో పోటీ చేసి తొమ్మిది స్థానాల్లో లక్షకుపైగా ఓట్లు సాధించింది. విజయం మాత్రం దక్కలేదు. కానీ.. బీజేపీ–శివసేన కూటమి ఘోర పరాజయానికి మాత్రం కారణమైంది. 2014లో  ఎంఎన్‌ఎస్‌ పోటీ చేసిన పది స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోడమే కాకుండా ఆ పార్టీ ఓట్ల శాతం 1.5కు పడిపోయింది. ఈసారి ఎన్నికల్లో బరిలో దిగకపోయినప్పటికీ ‘మోదీ ముక్త భారత్‌’ కోసం కృషి చేస్తానని ప్రతినబూనిన ఎంఎన్‌ఎస్‌ అధ్యక్షుడు రాజ్‌థాక్రే పలు ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

ఐదేళ్లలో మారిన పరిస్థితులు
గత ఎన్నికల్లో 47.9 శాతం ఓట్లు సాధించిన అధికార బీజేపీ – శివసేన ఈసారి ఘన విజయం సాధించడం ఖాయమని అనిపించినప్పటికీ... గత ఐదేళ్లలో వాస్తవ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వ్యవసాయ సంక్షోభం.. కొనసాగుతున్న రైతు ఆత్మహత్యలు, రైతు రుణమాఫీ పథకం అమలులో వైఫల్యాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకతకు కారణాలయ్యాయి. అంతేకాదు. బీమా కోరేగావ్‌ సంఘటన దళితుల్లో వీరిపై ఉన్న వ్యతిరేకతకు ఆజ్యం పోసింది. పెద్దనోట్ల రద్దు, కాంగ్రెస్‌–ఎన్‌సీపీలు లేవనెత్తిన పలు అవినీతి అంశాలు కూడా అధికార పక్షానికి చిక్కులు సృష్టించేవే. గత ఎన్నికల స్థాయిలో మోదీ ప్రభావం కూడా లేకపోవడం ఈసారి నిర్ణయాత్మకంగా మారనుంది. ఈ కారణంగానే బీజేపీ నేతలు అభివృద్ధి గురించి కాకుండా.. బాలాకోట్‌పై దాడుల అంశాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తోంది. జాతీయవాద భావనలను రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలన్నది ఆ పార్టీ ఉద్దేశం. మరోవైపు గత ఎన్నికల్లో కొన్ని స్థానాలు మాత్రమే సాధించిన కాంగ్రెస్‌ (2), ఎన్‌సీపీ (4).. మూడు చిన్న పార్టీలను కలుపుకోవడం ద్వారా తన బలాన్ని పెంచుకుంది. అంతేకాకుండా నాలుగు సీట్లు కేటాయించడం ద్వారా సమాజంలోని వేర్వేరు వర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న దాదాపు 50 వరకూ చిన్న చిన్న పార్టీలు సంస్థలను తమ వైపు తిప్పుకోగలిగింది. అధికార పార్టీ కంటే చాలాముందుగా ఎన్నికల నిర్వహణ పనులను మొదలుపెట్టడం కూడా కాంగ్రెస్‌ –ఎన్‌సీపీ కూటమికి కలిసివచ్చే అంశం.

పవార్‌ విరమణ బీజేపీకి మేలు?
మరాఠా దిగ్గజ నేత, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ ఈసారి పోటీ చేయకపోవడం తమ కు అనుకూలిస్తుందని బీజేపీ శివసేన అంచనా వేస్తోంది. పుణే జిల్లాలోని మవాల్‌  స్థానం నుం చి సొదరుడి మనుమడు పార్థ్‌ పవార్‌ బరిలోకి దిగుతున్న కారణంగా శరద్‌ పవార్‌ తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.  పార్థ్‌ పవార్‌ శివసేన సిట్టింగ్‌ ఎంపీ గజానన్‌ బాబర్‌తో పోటీపడుతున్నారు. పవార్‌ విరమణ అంశాన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ విమర్శలకు గురైంది. కొల్హాపూర్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమం లో దేవేంద్ర ఫడ్నవీస్‌ మాట్లాడుతూ ‘‘వాళ్లు రోజు కో అభ్యర్థిని మారుస్తున్నారు. మాధా స్థానం నుం చి కెప్టెన్‌ (శరద్‌పవార్‌) తప్పుకున్నారు. ఇన్నింగ్స్‌ ఓపెన్‌ చేస్తానన్న కెప్టెన్‌ ఇప్పుడు 12వ ఆటగాడిగా మారిపోయాడు. దీనివల్ల బీజేపీ – శివసేన కూట మికి మద్దతివ్వాలని తద్వారా కేంద్రంలో మరోసారి మోదీని అధికారంలోకి తేవాలని ప్రజలు నిర్ణయించుకున్నారని’’ వ్యాఖ్యానించారు.

కీలక స్థానాలు ఇవీ..
కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ పోటీ చేస్తున్న నాగ్‌పూర్‌ స్థానం ఈసారి కీలకంగా మారనుంది. మోదీ బద్ధ వ్యతిరేకి, బీజేపీ మాజీ ఎంపీ నానా పటోలేతో పోటీపడుతున్నారు ఆయన.
నాందేడ్‌లో మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ మరోసారి గెలిచేందుకు శ్రమకోరుస్తుండగా బారామతి నుంచి శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలే బరిలో ఉన్నారు.
రాయ్‌గఢ్‌లో శివసేన నేత, మాజీ కేంద్ర మంత్రి అనంత్‌ గీతే పోటీ చేస్తుండగా స్వాభిమాన్‌షేత్కారీ సంఘటన్‌ అధ్యక్షుడు రాజు షెట్టి మహా ఘఠ్‌ బంధన్‌ తరఫున హట్కనన్‌గల్‌ఎన్నికల బరిలో నిలిచారు. 2014లో రాజు షెట్టి ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందడంవిశేషం.
ఉత్తర ముంబై లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున సినీ నటి ఊర్మిళా మాటోండ్కర్‌ను బరిలోకి దించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలున్నాయి.

డేట్‌లైన్‌ ముంబై టి.ఎన్‌.రఘునాథ
(రచయిత ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సీనియర్‌ జర్నలిస్టు. మహారాష్ట్ర రాజకీయాలను మూడు దశాబ్దాల నుంచి పరిశీలిస్తున్నారు. ‘ద ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’, ‘ద పయనీర్‌’, ‘ద ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌’, ‘ద బ్లిట్జ్‌’, ‘న్యూస్‌ టైమ్‌’ పత్రికల్లో పనిచేశారు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top