కీలక రాష్ట్రాల్లో పార్టీల బలాబలాలివే!

BJP And Congress Alliance In Different States - Sakshi

సాక్షివెబ్‌ ప్రత్యేకం : కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం నాడు 17వ లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్డ్‌ను ప్రకటించగానే దేశంలో ఒక్కసారిగా ఎన్నికల వేడి పెరిగింది. మొదటి విడత ఎన్నికలు జరగడానికి సరిగ్గా ఈ రోజుకు నెల రోజుల సమయం ఉంది. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలైన పాలకపక్ష బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలు తాము బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో మిత్ర పక్షాలతో కలసి కూటములుగా ఏర్పడుతున్న విషయం తెల్సిందే. వెలుపలి శక్తుల మద్దతు అవసరం లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 272 సీట్లు ఏ పార్టీకి లేదా కూటమికీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదంటూ పలు సర్వేలు వెల్లడిస్తున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు మిత్రపక్షాల సమీకరణ మరింత ఆవశ్యకమైంది. ఇప్పటికే పాలకపక్ష బీజేపీ పలు రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో పొత్తులను ఖరారు చేసుకొని ప్రచారంలోనూ శరవేగంగా దూసుకుపోతుంటే కాంగ్రెస్‌ పార్టీ ఇంకా పొత్తుల చర్చల్లో తలమునకలై ఉంది. ఇప్పటి వరకు ఖరారైన కూటముల పొత్తులను, గతంలో వాటి బలాబలాలను బేరీజువేస్తే.....

ఉత్తరప్రదేశ్‌
పార్లమెంట్‌ ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ, అఖిలేశ్‌ యాదవ్‌ నాయకత్వంలోని ఎస్పీ పార్టీలు కాంగ్రెస్‌ పార్టీని పక్కన పెట్టి పొత్తును ఖరారు చేసుకున్న విషయం తెల్సిందే. ఇక చేసేదేమీలేక రాష్ట్రంలోని 80 సీట్లకు పోటీ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించుకుంది. ఇక్కడ 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కేవలం 7.5 శాతం ఓట్లతో కేవలం రెండు సీట్లను మాత్రమే గెలుచుకుంది. సమాజ్‌వాది పార్టీ 22.2 శాతం ఓట్లతో ఏడు సీట్లను గెలుచుకోగా, బహుజన సమాజ్‌ పార్టీ 19.6 శాతం ఓట్లను సాధించినప్పటికీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేక పోయింది. బీజేపీ 71 సీట్లను, దాని మిత్రపక్షం అప్పాదళ్‌- ఎస్‌ రెండు సీట్లను గెలుచుకుంది. ఎస్పీ, బీఎస్పీ పార్టీలకు వచ్చిన ఓట్లను లెక్కేస్తే 41.8 శాతం ఓట్లు. అందుకే ఈ రెండు పార్టీలు ఈసారి రాష్ట్రీయ లోక్‌దళ్‌తో కలిసి పోటీ చేస్తున్నాయి. మూడో పార్టీకి జాట్లలో మంచి బలం ఉంది. ఈ మూడు పార్టీల మధ్య ఓట్లు సవ్యంగా బదిలీ అయితే రేపటి ఎన్నికల్లో ఈ కూటమిదే ఇక్కడ పైచేయి అవుతుంది.

మహారాష్ట్ర
మహారాష్ట్రలో 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. శివసేనతో కలిసి మళ్లీ పొత్తు పెట్టుకున్నట్లు ఫిబ్రవరి 18వ తేదీన బీజేపీ ప్రకటించింది. ఇక్కడ శివసేనకు 23 సీట్లను బీజేపీ కేటాయించింది. 2014లో ఇచ్చిన వాటికన్నా ఐదు సీట్లు ఎక్కువ. గతేడాది నుంచి శివసేన ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ రావడం ఎక్కువ సీట్లు ఇవ్వడానికి కారణం కావచ్చు. బీజేపీ-శివసేన కూటమికన్నా ముందే ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ తన పొత్తుల గురించి ప్రకటించినప్పటికీ ఇప్పటికీ వాటి మధ్య సీట్ల పంపకాలు ఖరారు కాలేదు. ఇప్పటికే పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్‌ పార్టీ-నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఆల్‌ ఇండియా మజ్లీస్‌ -ఏ ఇత్తెహాద్‌ - ఉల్‌ - ముస్లీమీన్‌తో పొత్తు పెట్టుకున్న ప్రకాష్‌ అంబేడ్కర్‌ నాయకత్వంలోని వాంఛిత్‌ బహుజన్‌ అఘాది కూటమితో ఇప్పటికీ చర్చలు కొనసాగుతున్నాయి. సీట్ల పంపకాల విషయంలోనే విభేదాలు ఉన్నాయి. ఈ కూటములు విడి విడిగా పోటీ చేసినట్లయితే బీజేపీ కూటమి వ్యతిరేక ఓట్లు చీలిపోతాయి. ఇక్కడ గత ఎన్నికల్లో బీజేపీకి 23 సీట్లు, శివసేనకు 18 సీట్లు వచ్చాయి. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీకి నాలుగు, కాంగ్రెస్‌ పార్టీకి రెండు సీట్లు వచ్చాయి. రాజు శెట్టి నాయకత్వంలోని స్వాభిమాని పక్ష పార్టీకి ఒక్క సీటు వచ్చింది.

బీహార్‌
బీహార్‌లో బీజేపీ, జనతాదళ్‌ (యూ), లోక్‌జనశక్తి పార్టీలు ఓ కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్‌ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ, హిందుస్థానీ హవామీ మోర్చా, వికాశీల్‌ ఇన్సాన్‌ పార్టీ, వామపక్షాలు కలిసి ఇక్కడ మహా కూటమిగా పోటీ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి 22 సీట్లు, దాని మిత్ర పక్షాలకు 9 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీకి రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ సారి కాంగ్రెస్‌ నాయకత్వంలోని కూటమికే ఎక్కువ విజయావకాశాలు కనిపిస్తున్నాయి.

జార్ఖండ్‌
ఆల్‌ జార్ఖండ్‌ విద్యార్థి సంఘంతో రెండు రోజుల క్రితమే బీజేపీ ఇక్కడ పొత్తు కుదుర్చుకుంది. బీజేపీ 13 సీట్లకు, మిత్రపక్షం ఒక్క సీటుకు పోటీ చేయాలని నిర్ణయించాయి. జార్ఖండ్‌ ముక్తి మోర్చా, జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా, రాష్ట్రీయ జనతాదళ్‌తో కలిసి కాంగ్రెస్‌ కూటమికి పోటీ చేస్తున్నాయి. అయితే ఇంకా సీట్ల పంపకాలు జరగలేదు. 2014 ఎన్నికల్లో బీజేపీ 12 సీట్లను, జార్ఖండ్‌ ముక్తి మోర్చా రెండు సీట్లను గెలుచుకుంది. సీ ఓటరు సర్వే ప్రకారం ఇక్కడ ఈ సారి కాంగ్రెస్‌ కూటమికి 8 సీట్లు వచ్చే అవకాశం ఉంది.

కర్ణాటక
కాంగ్రెస్, జనాదళ్‌-సెక్యులర్‌ పార్టీలు కలిసి పోటీ చేస్తామని ఎప్పుడో ప్రకటించాయి. అయితే ఇప్పటికీ సీట్ల పంపకాలు జరగలేదు. రాష్ట్రంలోని 28 సీట్లకుగాను ఈ రెండు పార్టీలు 2014 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయగా కాంగ్రెస్‌ పార్టీకి 9, జనతాదళ్‌కు రెండు సీట్లు వచ్చాయి. బీజేపీకి 17 సీట్లు వచ్చాయి.

ఢిల్లీ
ఢిల్లీలోని ఏడు సీట్లకుగాను ఏడు సీట్లను 2014 ఎన్నికల్లో బీజేపీ గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ పొత్తు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. పొత్తు కుదుర్చుకున్నట్లయితే ఇరు పార్టీలు కలిసి ఐదు సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పొత్తు కుదరకపోతే వాటి విజయం మూడు సీట్లకు పరిమితం అవుతుందన్నది అంచనా.

కేరళ
20 సీట్లు గల ఈ రాష్ట్రంలో సీపీఎం నాయకత్వంలోని లెఫ్ట్‌ అండ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్, కాంగ్రెస్‌ నాయకత్వంలోని యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్, బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ మధ్య పోటీ ప్రధానంగా ఉంటుంది. గత ఎన్నికల్లో యుడిఎఫ్‌కు 12 సీట్లు రాగా, ఎల్‌డీఎఫ్‌కు 8 సీట్లు వచ్చాయి. బీజేపీ కూటమికి గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదు. ఈసారి రెండు సీట్లనైనా గెలుచుకోవాలనే ఉద్దేశంతో శబరిమల ఆందోళన చేపట్టింది.

తమిళనాడు
రాష్ట్రంలోని 39 సీట్లకుగాను బీజేపీ-అఖిల భారత అన్నా డీఎంకే, పట్టాలి మక్కల్‌ కాట్చీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ కూటమిలో డీఎండీకే పార్టీ కూడా చేరే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో అఖిల భారత అన్నాడీఎంకే అన్ని సీట్లకు పోటీ చేసి 37 సీట్లను గెలుచుకుంది. బీజేపీ, పీఎంకే పార్టీలు చెరో సీటును గెలుచుకున్నాయి. 2016లో జయలలిత మరణించినప్పటి నుంచి అఖిల భారత అన్నా డీఎంకేలో పలు చీలకలు వచ్చాయి. మళ్లీ సుస్థిరతను సాధించడం కోసం బీజేపీతో చేతులు కలిపింది. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో విడిపోయి పలు పార్టీలతో మహా కూటమిని ఏర్పాటు చేసినా డీఎంకే ఒక్క సీటు కూడా రాలేదు. అందుకనే ఈసారీ డీఎంకే కాంగ్రెస్‌తోపాటు మరో ఏడు పార్టీలను కలుపుకొని పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ 9 సీట్లతోపాటు పుదుచ్ఛేరి సీటుకు పోటీ చేస్తోంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీకి పెద్దగా బలం లేదు. అందుకే ఈ రెండు రాష్ట్రాలు జాతీయ పార్టీల పార్లమెంట్‌ ఫలితాలను ప్రభావితం చేయలేవు. తెలంగాణలో పాలకపక్ష టీఆర్‌ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు అఖండ విజయాన్ని సాధిస్తాయని ఇప్పటికే పలు సర్వేలు తేల్చి చెప్పాయి. పార్లమెంట్‌లో హంగ్‌ ఏర్పడితే ఈ రెండు రాష్ట్రాలు కీలకం అవుతాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top