నాబార్డు నివేదికపై మాట్లాడరేం బాబూ! 

Bhumana Karunakar Reddy fires on Chandrababu - Sakshi

వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి సూటిప్రశ్న 

రైతు ఆదాయంలో రాష్ట్రానికి 28వ స్థానం, అప్పుల్లో 2వ స్థానం

అభివృద్ధిపై సీఎం చంద్రబాబువన్నీ కాకి లెక్కలే

నాబార్డు నివేదికే అందుకు సాక్ష్యం 

రాష్ట్రంలో వ్యవసాయం దుస్థితిని కళ్లకు కట్టిన నాబార్డు

సాక్షి, హైదరాబాద్‌: తన పాలనలో ఏపీ దేశంలోనే మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకోవడం శుద్ధ అబద్ధమని, ఆయన నాలుగేళ్లుగా ఇవే మాయమాటలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దేశ జీడీపీ కంటే రాష్ట్రం రెట్టింపు స్థాయిలో జీడీపీతో దూసుకుపోతోందని చంద్రబాబు, ఆయన మంత్రులు అసత్యాలు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ‘నాబార్డు’ (జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు) విడుదల చేసిన నివేదికలో రాష్ట్ర వ్యవసాయరంగం ఎంత దుస్థితిలో ఉందో వెల్లడించిందన్నారు.

2014–15లో జాతీయ స్థాయిలో వ్యవసాయరంగం వృద్ధిరేటు 0.2శాతం ఉంటే ఏపీలో 3.55 శాతం, 2015–16లో జాతీయ స్థాయిలో వృద్ధిరేటు 0.6 శాతం ఉంటే ఏపీలో 7.78 శాతం, 2016–17లో జాతీయ స్థాయిలో 6.3 శాతం పెరిగితే ఏపీలో 14.91 శాతం, 2017–18లో జాతీయ స్థాయిలో 6.6 శాతం ఉంటే ఏపీలో 17.76 శాతం పెరిగినట్లుగా ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు చెబుతున్నారని అన్నారు. చంద్రబాబు చెప్పింది నిజమేనని అయితే అది తలసరి ఆదాయంలో కాదు, అప్పుల్లో అన్నది నాబార్డు తన నివేదికలో స్పష్టం చేసిందన్నారు. చంద్రబాబు పాలనలో వ్యవసాయం, పారిశ్రామికీకరణలో ఏ మాత్రం ప్రగతి లేదని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ అసెంబ్లీ సాక్షిగా వివరాలన్నింటినీ బయటపెట్టారని, ఈ మోసాలను గణాంకాలతో సహా ఆయన ప్రజాక్షేత్రంలో కూడా వెల్లడించారని భూమన అన్నారు. రాష్ట్రంలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. నాబార్డు, నీతి ఆయోగ్‌ అధ్యక్షుడు విడుదల చేసిన నివేదిక చూస్తే రాష్ట్రంలో వ్యవసాయం ఎంత దారుణంగా ఉందో తెలుస్తుందన్నారు. నాబార్డ్‌ వెబ్‌సైట్‌లో ఈ నివేదికను ఎవరైనా చూడొచ్చన్నారు. 

అప్పులో ఏపీ నంబర్‌ వన్‌ 
2015 జూలై 1 నుంచి 2016 జూన్‌ 30 వరకూ అప్పుల విషయంలో ఏపీకి దేశంలోనే ప్రథమ స్థానం దక్కిందని భూమన వివరించారు. రైతుల రుణాలన్నీ మాఫీ చేసేశామని, బంగారం విడిపించామని, రైతులంతా సంతోషంగా ఉన్నారని చెబుతున్న చంద్రబాబు నాబార్డు నివేదికను ఒకసారి పరిశీలించాలని సూచించారు. ఏపీలో 60 శాతం పైగా జనాభా అప్పుల్లో కూరుకుపోయారని, దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని నాబార్డ్‌ నివేదిక పేజీ నంబర్‌ 82లో స్పష్టంగా వివరించిందన్నారు. 2014 మార్చి చివరి నాటికి ఉన్న రూ.87,612 కోట్ల అప్పుల్ని మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన బాబు రూ.13 వేల కోట్లకు మించి మాఫీ చేయలేదన్నారు. నాలుగేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు అప్పు చేశారని అన్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై 80 శాతం మందికి అసంతృప్తి ఉందన్నారు. చంద్రబాబు, నారా లోకేశ్‌తోపాటు వారి వల్ల లబ్ధి పొందుతున్న పారిశ్రామికవేత్తలు, తాబేదార్లు, తొత్తులు, మంత్రులు నూటికి నూరు శాతానికిపైగా సంతృప్తికరంగా ఉండొచ్చని భూమన ఎద్దేవా చేశారు. 

అవినీతిలో ఏపీకి ర్యాంకుల పంట
ఎన్సీఏఈఆర్‌ అనే సంస్థ 2016 నివేదికలో చంద్రబాబు పాలనలో అవినీతిలో ఏపీ దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని తెలిపిందని భూమన గుర్తుచేశారు. పాలనా వ్యవస్థ అత్యంత దారుణంగా ఉందని ఏపీకి 11వ ర్యాంకు ఇచ్చిందన్నారు. పెట్టుబడులు సమీకరణలో ఏపీ 7వ స్థానంలో ఉందని కూడా ఈ నివేదిక వెల్లడించిందన్నారు. సీఎంఎస్‌ సంస్థ సర్వేలో అవినీతిలో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో ఉందని తెలిపిందని, రిజర్వ్‌ బ్యాంకు విడుదల చేసిన త్రైమాసిక నివేదిక విదేశీ పెట్టుబడుల సమీకరణలో ఏపీ 6వ స్థానంలో ఉందని చెబుతోందన్నారు. చంద్రబాబు, ఆయన తాబేదార్లు కలిసి రూ.4 లక్షల కోట్లు దోచేశారని, అన్నపూర్ణగా పేరున్న ఏపీ ఇపుడు అన్నీ పూర్ణమై (సున్నా అయి) ప్రజల జీవితాలు దారుణమైన పరిస్థితికి చేరాయన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయని చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఓటుకు రూ.5 వేల చొప్పున ఇచ్చి గెలవాలనుకుంటున్నారని ఆరోపించారు. 

ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి
2016–17లో దేశంలో వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ అట్టడుగున ఉందనే వాస్తవాన్ని నాబార్డు నివేదికలో వెల్లడించారని, దీనిపై చంద్రబాబు తేలుకుట్టిన దొంగలాగా తొక్కిపెట్టే యత్నం చేస్తున్నారని భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు తన అనుకూల ప్రసార మాధ్యమాల్లో ఈ నివేదికకు చిటికెడు కూడా స్థానం ఇవ్వకుండా చేశారని విమర్శించారు. అయినప్పటికీ ప్రజలు వాస్తవాలను గమనించాలని కోరారు. నాబార్డు నివేదిక ప్రకారం... 
- సగటు కమతాల్లో ఆంధ్రప్రదేశ్‌ 14వ స్థానంలో ఉంది. రైతులకు సగటున వస్తున్న ఆదాయంలో దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏపీ 28వ స్థానంలో ఉంది.(29వ పేజీ) 
- రైతు ఆదాయ, వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటే ఏపీ అన్నింటి కన్నా ఆఖరు (29వ) స్థానంలో ఉంది.(88వ పేజీ)
- అప్పుల విషయంలో రాష్ట్ర రైతులు దేశంలోనే రెండో స్థానంలో ఉన్నారు. (63వ పేజీ) 
- దేశం మొత్తం మీద అప్పుల పాలైన జనాభా 47 శాతంగా ఉండగా.. ఏపీలో 75 శాతం, తెలంగాణలో 79 శాతం ఉన్నారు. అంటే ఏపీలో ప్రతి నలుగురిలో ముగ్గురు అప్పుల పాలయ్యారు.(67వ పేజీ)

ఆగస్టు 23 ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన దుర్దినం
ఎన్టీ రామారావును చంద్రబాబు వెన్నుపోటు పొడిచింది ఆగస్టులోనే అని, మరో 2 రోజుల్లో... అంటే ఈ నెల 23 నాటికి 23 ఏళ్ల క్రితం తన మామను చంద్రబాబు కుట్రతో గద్దె దించారని భూమన అన్నారు. 1995 ఆగస్టు 23..∙ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన దుర్దినం అని అన్నారు. వెన్నుపోటు దారుడైన చంద్రబాబు ఇంకా రాజకీయాలను శాసిస్తూ... అధికారంలోకి వచ్చేందుకు నాడు ఎలాంటి అబద్ధాలు ఆడారో.. వాటిని ఇంకా కొనసాగిస్తున్నారని విమర్శించారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఇంకా ప్రజలను వంచిస్తూ, మోసగిస్తూ రాజకీయాలు చేయటం తెలుగు ప్రజల దౌర్భాగ్యమన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top