బాబుకు అప్పిస్తే మాల్యా ఖాతానే!

Bhumana Karunakar Reddy comments on CM Chandrababu - Sakshi

వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రజలంతా తనకు అప్పు ఇవ్వాలని అసెంబ్లీ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుతున్నారని, ఆయనకు అప్పు ఇవ్వడమంటే బ్యాంకులు విజయ్‌మాల్యాకు అప్పు ఇచ్చిన చందంగా తిరిగి రాని ఖాతాలో వేసినట్లవుతుందని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌రెడ్డి హెచ్చరించారు. అమరావతి నిర్మాణం కోసమని ఎవరైనా భ్రమపడి అప్పు ఇస్తే  చార్మినార్‌ బ్యాంక్, కేశవరెడ్డి, అగ్రిగోల్డ్‌ సంస్థల్లా చంద్రబాబు కూడా బోర్డు తిప్పేస్తారని, అందువల్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోనే ఉందని, అయితే కేంద్రం పంపిన నిధులను చంద్రబాబు కమీషన్ల రూపంలో దండుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం కేవలం నాలుగేళ్లలో ప్రజలపై రూ.1.20 లక్షల కోట్ల రుణ భారాన్ని మోపిందన్నారు. పోనీ అప్పు చేసి ఏమైనా అభివృద్ధి చేశారా? అంటే అదీ లేదని, అమరావతిలో ఎంత వెతికినా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కనిపించడం లేదన్నారు. 

అమరావతి అనే అవినీతి పీఠానికి చంద్రస్వామి (చంద్రబాబు) పీఠాధిపతిగా ఉంటూ మూడేళ్లలో నాలుగు లక్షల కోట్లు దోచుకున్నారని కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. భూమన గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 

మీ చరిత్ర మాకు పూర్తిగా తెలుసు...
చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం గురించి ఏవేవో లేని గొప్పలు, అసత్యాలు వల్లిస్తున్నారని, ఆ పుస్తకంలో తెరవని (దాచిన) పేజీలను ప్రజల ముందు ఉంచాల్సిన సమయం వచ్చిందని భూమన పేర్కొన్నారు. చంద్రబాబు గురించి ఈ తరానికి తెలియకపోవచ్చేమోగానీ మొదట్నుంచీ ఎరిగిన తనలాంటి వారికెందరికో ఆయన జీవిత చరిత్ర పూర్తిగా తెలుసన్నారు. చంద్రబాబు జీవితంలో అనేక చీకటి కోణాలున్నాయని చెబుతూ ఆయన అవినీతి చరిత్ర రెండు రూపాయల దొంగతనంతో ప్రారంభమైందని వెల్లడించారు. తాను చెప్పిన మాటలన్నింటికీ చంద్రబాబు వద్దే ఆధారాలు ఉన్నాయని, ఆయననే నిజాలు అడగాలని  సూచించారు. ఆయనేమన్నారంటే.. 

సినిమా టిక్కెట్‌ కోసం జేబు దొంగతనం
‘తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రాడికల్స్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఆర్‌ఎస్‌యూ) వ్యవస్థాపక సభ్యుల్లో నేనూ ఒకడిని. 1974లో విద్యార్థి సంఘానికి నిధుల సమీకరణ కోసం ఏఎన్నార్‌ నటించిన ‘చక్రపాణి’ అనే సినిమాకు బెనిఫిట్‌ షో వేశాం. దానికి టిక్కెట్‌ ధర రూ.2గా నిర్ణయించి  ఎస్వీయూ హాస్టల్‌లోని ‘ఏ’ బ్లాకులోకి వెళ్లాం. టిక్కెట్లు అమ్ముతూ చంద్రబాబు ఉన్న గదికి వెళ్లి బెనిఫిట్‌ షో టిక్కెట్టు ఇచ్చి డబ్బు అడిగాం. ఆ సమయంలో చంద్రబాబు జేబులో డబ్బు ఉన్నప్పటికీ ఇవ్వకుండా నిద్రపోతున్న రూమ్మేట్‌ ప్యాంటు జేబు నుంచి డబ్బు దొంగిలించి రూ. 2 స్వయంగా నా చేతికి ఇచ్చారు. చంద్రబాబు జేబు దొంగతనం రూ. 2తో  ప్రారంభమైంది.

వేషం కోసం వేరుశెనగ కాయల మూట లంచం...
చంద్రబాబు చదువుకునే సమయంలో ‘పరువు కోసం’ నాటికలో కథా నాయకుడి పాత్ర పోషించారని ఇటీవల ఓ పత్రిక రాసింది. అందులో హీరో పాత్ర కోసం చంద్రబాబు విద్యార్థి దశలోనే దొంగతనం చేసి టీచరుకు లంచంగా వేరుసెనగ కాయల బస్తా ఇచ్చారు. నిజానికి చంద్రబాబును మొదట కమెడియన్‌ పాత్రకు, నా మిత్రుడైన హాస్య పాత్రధారిని హీరోగానూ టీచరు ఎంపిక చేశారు. చంద్రబాబు వేరుసెనగ కాయల బస్తా టీచరుకు లంచంగా ఇచ్చి హీరో పాత్ర కొట్టేశారు. అవి కూడా చంద్రబాబు పొలంలో పండినవి కావు. పక్క పొలంలో కొట్టేసినవి. టీచరు రిహార్సల్స్‌ సమయంలో నామిత్రుడిని కమెడియన్‌ పాత్రలోకి మార్చి చంద్రబాబుకు కథానాయకుడి వేషం ఇచ్చారు. బాబు లంచం వల్ల కథానాయకుడి  వేషం పోగొట్టుకున్న హాస్య నటుడు నా మిత్రుడే. ఆయనే ఈ విషయం నాకు చెప్పారు.

బలవంతపు ‘చదివింపులు’... 
చంద్రబాబు ఆయన చేతికి వాచీ, ఉంగరం కూడా లేవని చెబుతుంటారు.  ప్రస్తుతం ఓ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉన్న టీడీపీ నాయకుడి వివాహానికి చంద్రబాబు అప్పట్లో ఓ   మిత్రుడితో కలిసి వెళ్లారు. ఆ స్నేహితుడి చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని బలవంతంగా లాక్కుని పెళ్లి కుమారుడికి చదివింపుల కింద చంద్రబాబు ఇచ్చారు. ఇదీ బాబు నైజమని ఉంగరం పోగొట్టుకున్న చంద్రబాబు మిత్రుడు నాకు చెప్పారు. ఇవన్నీ చెప్పినందుకు చంద్రబాబుకు నాపై కోపం వస్తే రావచ్చు. అయితే ఇవి పచ్చి వాస్తవాలని ఆయనకు, ఆయన మిత్రులకూ తెలుసు.

 పెట్రోల్‌ అమ్మేశారు..
1977లో చంద్రబాబు యువ జన కాంగ్రెస్‌ నాయకుడిగా ఉండేవారు. అప్పట్లో చిత్తూరు ఎంపీ సీటు కోసం కాంగ్రెస్‌ అభ్యర్థిగా గల్లా రాజగోపాల్‌ నాయుడు (గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ తాత) బరిలో దిగారు. అప్పుడు వీరరాఘవులు నాయుడు ఈ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నా రు.  వీరరాఘవులు నాయుడు ప్రచారం కోసం బాబుకు ఒక జీపు, 200 లీటర్ల పెట్రోల్‌ బ్యారల్‌ అప్ప గించారు. అయితే బాబు పొద్దున్నే పెట్రోల్‌ అయిపోయిందని వీరరాఘవులు వద్దకు వెళ్లారు. అప్పుడే 200 లీటర్ల పెట్రోలు అయిపోవడం ఏమిటని ఆరా తీస్తే వీరరాఘవులు నాయుడికే చెందిన బంకులోనే చంద్రబాబు 200 లీటర్ల పెట్రోలును అమ్మినట్లు తేలింది. ఈ విషయాన్ని వీరరాఘు వుల నాయుడు 1977లోనే స్వయంగా నాకు చెప్పారు.

తమ్ముడిని తిట్టి క్షణాల్లో ఏడుపు..
2004లో అలిపిరిలో బాంబు దాడి అనంతరం స్వామివారి దర్శనార్థం చంద్రబాబు తిరుమల చేరుకుని పద్మావతి అతిథి గృహంలో ఉన్నారు. ఆ సమయంలో అన్నను పరామర్శించడానికి తమ్ముడు రామ్మూర్తినాయుడు చంద్రబాబు గదిలోకి వెళ్లారు. ఒక తల్లిబిడ్డలమనే కనీస ఇంగితం కూడా మరిచి తమ్ముడిని చంద్రబాబు అనరాని మాటలన్నారు. అనంతరం చంద్ర బాబు గదిలో నుంచి కిందకు వచ్చి క్షణాల్లో ఏడుపు ముఖం పెట్టుకుని తనను తమ్ముడు దుర్భాషలాడారంటూ తల్లి అమ్మణ్ణమ్మకు ఫిర్యాదు చేశారు. దీంతో పెద్దా చిన్నాతేడా లేకుండా అన్నను దుర్భాషలాడతావా? అంటూ అమ్మణ్ణమ్మ కూడా చిన్న కుమారుడు రామ్మూర్తినే మందలించిం దట. తన అన్న ఇలాంటి దుర్మార్గుడని అని స్వయంగా రామ్మూర్తి నాయుడే నాకు ఈ విషయాల్ని బాధపడుతూ చెప్పారు. ఇదీ చంద్రబాబు జీవితం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top