హరీశ్‌లాగా దాడి చేశామా?: భట్టి

bhatti vikramarka commented over harish rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి హరీశ్‌రావులాగా తాము గవర్నర్‌పై పుస్తకాలు విసిరేయలేదని, బల్లలెక్కి దాడికి దిగలేదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హరీశ్‌రావు మాదిరి గవర్నర్‌ పట్ల ఏనాడూ అనుచితంగా ప్రవర్తించలేదన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్‌ బాధ్యతలను మాత్రమే గుర్తుచేస్తున్నామన్నారు.

కాళేశ్వరం టెండర్లలో ప్యాకేజీల వారీగా అవకతవకలు జరిగాయని, ప్రాజెక్టుల అంచనాలు భారీగా ఎందుకు పెరిగాయనే ప్రశ్నకు సమాధానం చెప్పలేదన్నారు. కేవలం రూ. 28వేల కోట్లతో పూర్తి కావాల్సిన అంబేడ్కర్‌ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును, కాళేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్చి రూ.80 వేల కోట్ల అంచనా వ్యయానికి పెంచారని భట్టి విమర్శించారు. దీని గురించి గవర్నర్‌ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వాణిజ్య బ్యాంకుల నుంచి అప్పులు తీసుకురావడానికి ప్రభుత్వం ఇచ్చిన డీపీఆర్‌ను ప్రజల ముందు పెట్టాలని భట్టి డిమాండ్‌ చేశారు.

కాళేశ్వరం, సీతారామ, పాలమూరు పనులలో ప్యాకేజీల వారీగా గవర్నర్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ప్రజా«ధనాన్ని దుర్వినియోగం కాకుండా చూడాల్సిన గవర్నర్‌ వీటిపై స్పందించకుంటే కేంద్ర విజిలెన్సు కమిషన్‌కు, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రాజెక్టులను నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారనే విషయం తెలియదా అని ప్రశ్నించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top