తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌

Bandi Sanjay Appointed As Telangana BJP President - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరీంనగర్‌ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కు కీలక పదవి వరించింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సంజయ్‌ నియమితులైయ్యారు. ఈ మేరకు బీజేపీ జాతీయ కేంద్ర నాయకత్వం బుధవారం అధికారిక ప్రకటన చేసింది. సంజయ్‌ నియామకం తక్షణమే అమల్లోకి రానుందని పేర్కొంది. కాగా కేవలం ఒక్కసారి ఎంపీగా గెలుపొందగానే రాష్ట్ర చీఫ్‌గా అవకాశం రావడం విశేషం. గతకొంత కాలంగా తెలంగాణ రాజకీయాల్లో సంజయ్‌ కీలకం పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. గత అసెం‍బ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసిన సంజయ్‌.. ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్‌పై స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.

అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌ స్థానం నుంచి పోటీచేసి టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత వినోద్‌ కుమార్‌పై 87 వేలపైగా ఓట్ల తేడాతో సంచలన విజయం సాధించారు. బీజేపీ మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబీవీపీల్లో క్రియాశీల కార్యకర్తగా వ్యవహరించిన సంజయ్‌.. అంచెలంచెలుగా ఎదిగారు. కరీంనగర్‌ కార్పొరేటర్‌ నుంచి నేరుగా భారత పార్లమెంట్‌కు ఎన్నికై రాష్ట్ర రాజకీయాల్లో కీలక వ్యక్తిగా మారారు. అలాగే ప్రస్తుతమున్న బీజేపీ నేతల్లో కరుడుగట్టిన హిందుత్వ వాదిగా కూడా సంజయ్‌ గుర్తింపుపొందారు.

కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం గత కొంతకాలంగా హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, మాజీ మంత్రి డీకే అరుణ, నిజమాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ వంటి నేతలు తీవ్రంగా పోటీపడ్డారు. అలాగే జాతీయ పార్టీ కనుక హిందుత్వ ఎజెండాను మాత్రమే ప్రధానంగా తీసుకుంటే సంజయ్‌కే పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే స్థానిక నాయకత్వంతో చర్చించిన అనంతరం.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా సంజయ్‌కే ఉందని భావించిన బీజేపీ పెద్దలు కీలక పదవిని అప్పగించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top