పెట్టుబడులు రావడం కాంగ్రెస్‌కు ఇష్టంలేదు

balka suman on congress - Sakshi

ఎంపీ బాల్కసుమన్‌

సాక్షి, హైదరాబాద్‌: కొత్తగా ఏర్పడిన తెలంగాణ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం, పెట్టుబడులను ఆకర్శించడం ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు ఇష్టమున్నట్లు లేదని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ విమర్శించారు. జీఈఎస్‌–2017 తెలంగాణ, హైదరాబాద్‌ ప్రతిష్టను మరింత పెంచిందని, కాంగ్రెస్‌ నేతలు ఆ ప్రతిష్టాత్మక సదస్సుపై అజ్ఞానంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు.

మంత్రి కేటీఆర్‌ ప్రతిభా పాటవాలకు అంతర్జాతీయంగా పెరిగిన ఆదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్‌ నేతలు ఆయనపై విమర్శలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణకు పెట్టుబడులు తేవడంలో మంత్రి కేటీఆర్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌లా వ్యవహరిస్తున్నారన్నారు. నోబెల్‌ గ్రహీత కైలాస్‌ సత్యార్థి వంటి వారు కేటీఆర్‌కు కితాబునిచ్చిన సంగతి షబ్బీర్‌ అలీ, భట్టి విక్రమార్కకు తెలియదా అని ప్రశ్నించారు.

ప్రతి రాష్ట్రంలో కేటీఆర్‌ వంటి ఒక మంత్రి ఉండాలని కేంద్ర ఉన్నతాధికారులే వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. కేటీఆర్‌ ప్రతిభకు తెలంగాణా పారిశ్రామిక రంగం సాధిస్తున్న ప్రగతి గణాంకాలే నిదర్శనమని, ఐటీ ఎగుమతుల్లో హైదరా బాద్‌ నగరం త్వరలోనే బెంగళూరును దాటిపోవడం ఖాయమని చెప్పారు. నిరుద్యోగుల భుజాల మీద తుపాకులుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాల్చాలని కోదండరామ్‌ కుట్ర పన్నారని ఆరోపించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top