కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే

Asaduddin Owaisi Predicted 2019 Election Results In Central - Sakshi

ఐఎస్‌బీ ‘లీడర్‌షిప్‌ సమ్మిట్‌–2018’లో ఎంపీ అసద్‌

2019 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర

హైదరాబాద్‌ : సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ జోస్యం చెప్పారు. ఈసారి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ లే కీలకపాత్ర పోషిస్తాయని, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీయేతర పార్టీలకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)లో జరుగుతున్న నాయకత్వ సదస్సు–2018 (లీడర్‌షిప్‌ సమ్మిట్‌–2018)లో భాగంగా ఆదివారం రెండో రోజు ‘జర్నీ టు 2019’పేరిట పాలసీ మేకర్స్‌ ప్యానెల్‌ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం సమన్వయకర్తగా వ్యవహరించిన సీనియర్‌ జర్నలిస్ట్‌ టి.ఎస్‌. సుధీర్‌ అడిగిన ప్రశ్నలకు ఒవైసీ బదులిస్తూ సంకీర్ణ ప్రభుత్వాల సమయాల్లోనే ఆర్థిక పురోగతి సాధ్యమైందన్నారు. కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందన్నారు. నోట్ల రద్దు వల్ల ఆర్థిక పురోగతి మందగించిదని, పెట్రోల్‌ ధరలు అనూహ్యంగా పెరిగాయని, రూపాయి విలువ క్షీణించిందన్నారు. ఇవన్నీ ప్రధాని మోదీ వైఫల్యాలకు నిదర్శనమన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో ముఖ్యంగా మైనారిటీలు, బడుగు, బలహీన వర్గాల వారిలో అభద్రతాభావం నెలకొందని, బీజేపీ నేతల్లో అసహనం పెరిగిపోతోందన్నారు. యూపీలో ఒక్క ముస్లింకూ ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వలేదని గుర్తుచేశారు.  

నాయకత్వంపైనే సంకీర్ణ ప్రభుత్వాల మనుగడ
సంకీర్ణ ప్రభుత్వం మనుగడ నాయకత్వంపై ఆధారపడి ఉంటుందని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేర్కొన్నారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు నడిపిన ఘనత వాజ్‌పేయికే దక్కిందన్నారు. మోదీ ప్రభుత్వం ఉపాధి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో యువత బీజేపీవైపు మొగ్గు చూపుతోందన్నారు. రానున్న ఎన్నికల్లో అభ్యర్థులు నచ్చకపోతే ఓటు హక్కున్న ప్రతివారూ నోటాకైనా ఓటేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ పనిచేస్తుందని, అందుకోసం కలిసొచ్చే ప్రాంతీయ, జాతీయ పార్టీలతో పని చేసేందుకు సిద్ధమని మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రంలోని బీజేపీతో స్నేహçపూర్వక సంబంధాలున్నప్పటికీ రాష్ట్రంలో బీజేపీ తమకు ప్రతిపక్ష పార్టీయేనని టీఆర్‌ఎస్‌ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి çస్పష్టం చేయగా కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రా న్ని కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని టీడీపీ ఎంపీ కె. రామ్మోహన్‌ నాయుడు ఆరోపించారు. కార్యక్రమంలో ఐఎస్‌బీ డీన్‌ ప్రొఫెసర్‌ రాజేంద్ర శ్రీవాత్సవ, ఐఎస్‌బీ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top