కారు స్పీడుకు బ్రేకులు!

Appointment of Incharges to Candidates of TRS - Sakshi

వంద సీట్లతో గెలుపు లక్ష్యానికి అడ్డంకులు 

24 సెగ్మెంట్లలో అభ్యర్థులకు ఇబ్బందులు 

ప్రస్తుత ప్రచారం తీరుపై అధిష్టానం అసంతృప్తి 

అభ్యర్థులకు తోడుగా ఇన్‌చార్జిల నియామకం 

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికల్లో వంద సీట్లు గెలిచి అధికారంలోకి రావాలని టీఆర్‌ఎస్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యర్థి పార్టీల కంటే ముందే అన్ని రకాలుగా రంగంలోకి దిగింది. సెప్టెంబర్‌ 6 నుంచే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పరిస్థితిలో మార్పులు వస్తున్నాయని టీఆర్‌ఎస్‌ అధిష్టానం గుర్తించింది. వంద సీట్ల లక్ష్య సాధనకు క్షేత్రస్థాయిలో కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయని నిర్ధారించింది. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థుల ప్రచార తీరుపై అసంతృప్తితో ఉంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినా పరిస్థితిలో మార్పులు రాకపోవడంతో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రత్యర్థి పార్టీలతో పోల్చితే ప్రచారంలో వెనుకబడిన నియోజకవర్గాలకు టీఆర్‌ఎస్‌లోని ముఖ్యనేతలను ఎన్నికల ఇన్‌చార్జిలుగా నియమించింది. కీలక నేతలు కె.తారకరామారావు, తన్నీరు హరీశ్‌రావు తదితరులకు ఈ సెగ్మెంట్ల ప్రచార బాధ్యతలు అప్పగించింది. ఈ ఇద్దరు మంత్రులు తప్ప మిగిలిన ఇన్‌చార్జిలు అందరూ ఎన్నికలు ముగిసే వరకు ఆయా నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి ఎన్నికల బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది.  

అభ్యర్థులతోనే... 
ఎన్నికల వ్యూహంలో తిరుగులేని నేతగా పేరున్న కేసీఆర్‌ ప్రత్యర్థి పార్టీల కంటే అన్ని విషయాల్లోనూ ముందుండేలా వ్యూహరచన చేస్తున్నారు. కచ్చితంగా వంద సీట్లు గెలవాలనే ఉద్దేశంతో అభ్యర్థులను ముందుగానే ప్రకటించారు. 90 శాతం సీట్లలో తాజా మాజీ ఎమ్మెల్యేలకే మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పించారు. ముందుగా అభ్యర్థులను ప్రకటించడంతో ఎన్నికల నోటిఫికేషన్‌ నాటికే పార్టీలోని అసమ్మతి పూర్తి సద్దుమణిగింది. టికెట్‌ రాలేదనే అసంతృప్తితో ఉన్న నేతలు అభ్యర్థులతో కలసి ప్రచారం చేస్తున్నారు. కొందరు మాత్రం ఇతర పార్టీలకు వెళ్లారు. మరోవైపు ప్రత్యర్థి పార్టీలకు అభ్యర్థులు ఇంకా నిర్ణయం కాలేదు. అయినా దాదాపు 25 సెగ్మెంట్లలో ఆశించిన స్థాయిలో ప్రచారం చేయడం లేదని టీఆర్‌ఎస్‌ అధిష్టానం భావిస్తోంది. ఈ పరిస్థితిని వెంటనే మార్చకపోతే వంద సీట్ల లక్ష్యానికి అడ్డంకులు ఉంటాయని నిర్ధారించుకుంది. గెలుపు అవకాశాలను పెంచేందుకు ముఖ్యనేతలను ఇన్‌చార్జిలుగా నియమించింది.  

దక్షిణ తెలంగాణపై గురి... 
టీఆర్‌ఎస్‌ సంస్థాగతంగా మొదటి నుంచి బలహీనంగా ఉన్న దక్షిణ తెలంగాణలోని నియోజకవర్గాలపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఎంఐఎం పోటీ చేసే ఏడు స్థానాలను మినహాయించి గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 15 సీట్లతోపాటు ఇబ్రహీంపట్నం సెగ్మెంట్‌ ఎన్నికల బాధ్యతను మంత్రి కేటీఆర్‌కు అప్పగించింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 10 స్థానాలతోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఐదు స్థానాల బాధ్యతను హరీశ్‌కు అప్పగించింది. సిద్ధిపేట పొరుగున ఉండే జనగామ, హుస్నాబాద్‌ సెగ్మెంట్ల బాధ్యతలు కూడా హరీశే పర్యవేక్షించనున్నారు. జగిత్యాల, కోరుట్ల స్థానాల్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఈ రెండు సెగ్మెంట్ల బాధ్యతలను నిజామాబాద్‌ ఎంపీ కవితకు అప్పగించింది. అభ్యర్థుల ప్రచారం విషయంలో అసంతృప్తి ఉన్న ములుగు, మహబూబాబాద్, నర్సంపేట స్థానాల బాధ్యతను టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఇచ్చారు. గత ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని నాలుగు సీట్లకు కూడా ఈసారి ప్రత్యేక ఇన్‌చార్జిలను నియమించారు. వంద సీట్ల లక్ష్య సాధనలో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దనే ఉద్దేశంతోనే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 24 నియోజకవర్గాలకు ప్రత్యేక ఇన్‌చార్జిలను నియమించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top