కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం 

Anti-farmer government at central - Sakshi

     బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులను అణచి వేస్తున్నారు 

     అమిత్‌ షా విమర్శలపై మంత్రి హరీశ్‌ ధ్వజం  

పటాన్‌చెరు/సంగారెడ్డి జోన్‌: కేంద్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే (బీజేపీ) కె.సత్యనారాయణను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించేందుకు శుక్రవారం ఆయన పటాన్‌చెరుకు వచ్చారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తమ ప్రభుత్వాన్ని చూసి బీజేపీ నేర్చుకోవాలని, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలను అమలు చేయాలని అమిత్‌షాకు సూచించారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల ఉద్యమాలను అక్కడి ప్రభుత్వాలు అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో రైతులు నిర్వహించిన నిరసన ప్రదర్శనలపై రాష్ట్ర ప్రభుత్వాలు అమానుషంగా వ్యవహరించాయని గుర్తు చేశారు. తెలంగాణలో రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా రైతుబంధు, రైతు బీమాతోపాటు ఇతర ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.  

అమిత్‌ షా సమాధానం చెప్పాలి..  
ప్రజలు వేసే ఈ ప్రశ్నలకు అమిత్‌షా సూటిగా సమాధానం చెప్పాలని హరీశ్‌ పేర్కొన్నారు. ‘ఏడు మండలాలను రాత్రికి రాత్రి ఆంధ్రాలో కలుపుకొన్నారు. లోయర్‌ సీలేరు పవర్‌ప్లాంట్‌ను కూడా కలుపుకొన్నారు. టీడీపీకి తలొగ్గి కేంద్రం నోరు మెదపలేదు. తిరిగి తెలంగాణకు వాటిని ఎప్పటిలోగా ఇస్తారు? ఇస్తారా? ఇవ్వరా? చెప్తే ప్రజలు సంతోషిస్తారు. హైకోర్టును ఎప్పుడు విభజిస్తారు? విభజన ప్రక్రియ ఎందుకు ఆలస్యమైంది? ఎప్పటిలోగా విభజిస్తారో చెప్పాలి?’అని ప్రశ్నించారు.
 
అభివృద్ధిపై మాట్లాడరేమి?  
కాంగ్రెస్‌ నేతలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై మాట్లాడకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నల్లగొండ జిల్లాలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ను అడ్డుకుంటామన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమా? కాంగ్రెస్‌ వైఖరా? అన్నది ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌రంగంలో తెలంగాణ స్వయం సమృద్ధి, మిగులు రాష్ట్రంగా అభివృద్ధి చెందుతున్న దశలో ప్లాంట్‌ నిర్మాణాన్ని అడ్డుకుంటామనడం సరికాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారమేనన్న వ్యాఖ్యలను నిజం చేయదలుచుకున్నారా అని హరీశ్‌ ప్రశ్నించారు. స్వరాష్ట్రంలో పరిశ్రమలకు, వ్యవసాయానికి, గృహ అవసరాలకు 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. దీంతో కొత్త పరిశ్రమలు రావడమే కాక ఉపాధి అవకాశాలు సైతం మెరుగుపడుతున్నాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పరాయి పాలనకు, చీకటి తెలంగాణకు ప్రణాళికలు రచిస్తోందని మండిపడ్డారు.  

కేసీఆర్‌ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలి.. 
రైతు సంక్షేమ చర్యలపై కేసీఆర్‌ ప్రభుత్వాన్ని చూసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేర్చుకోవాలని హరీశ్‌ హితవు పలికారు. రుణమాఫీ చేయాలని, పెట్టుబడి సాయం ఇవ్వాలని దేశవ్యాప్తంగా రైతులు ఢిల్లీకి వెళ్తే వారిపై భాష్పవాయుగోళాలు, వాటర్‌ కేనన్లు ప్రయోగించారని అన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లోని రైతులు ఏయే డిమాండ్లతో కేంద్రాన్ని అడిగేందుకు వెళ్లారో అవన్నీ తెలంగాణ రైతులకు ఇస్తున్నామని గుర్తు చేశారు. సాగుకు 24 గంటల విద్యుత్, రైతులకు ఎరువులు, విత్తనాలు ఇవ్వడమే కాకుండా, రూ.1,024 కోట్లతో మండలాల్లో గోడౌన్లు నిర్మించి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని హరీశ్‌ పేర్కొన్నారు. ‘రూ.1,200 కోట్ల కందులు కొన్నాం. పెసలు, శనగలు, మక్కలు, వరి కొనుగోలు చేశాం’ అని హరీశ్‌రావు వివరించారు. కాగా, మంత్రి హరీశ్‌రావు కోరిక మేరకు తాను త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top