అస్మదీయుల కోసమే అసత్య కథనం

Anil Kumar Yadav Fires On Ramoji Rao - Sakshi

‘ఈనాడు’ రామోజీరావుపై మంత్రి అనిల్‌యాదవ్‌ మండిపాటు

‘నవయుగ’తో అనుబంధమే ఈ కథనానికి ప్రేరణ 

అందుకే రివర్స్‌ టెండరింగ్‌ను వ్యతిరేకిస్తున్నారు.. చంద్రబాబు కోసం కుంభకోణాలను దాచారు

సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు పనుల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, ప్రభుత్వానికి అస్మదీయులు.. బంధువులు లేరని.. రివర్స్‌ టెండరింగ్‌ తర్వాత ఆ కాంట్రాక్టు ఎవరికి దక్కుతుందో ఎవరికీ తెలియదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. ‘అస్మదీయులకు అప్పగించేందుకేనా..?’ అనే శీర్షికతో ఆదివారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై ఆయన మండిపడ్డారు. ఆ పత్రిక యాజమాన్యం తెరవెనుక ఉద్దేశాలను ఈ కథనం ద్వారా బయట పెట్టుకుందని విమర్శించారు. పోలవరం నిర్మాణం నుంచి వైదొలగిన నవయుగ కంపెనీకి, రామోజీరావు కుటుంబంతో ఉన్న బంధం.. బంధుత్వం ఈ అసత్య కథనం రాయడానికి.. ప్రచురణకు ప్రేరేపించిందని ఆరోపించారు. ఈ విషయం ‘ఈనాడు’ పాఠకులకు తెలియాలన్న ఉద్దేశంతోనే సంబంధిత శాఖ మంత్రిగా వివరణ ఇస్తున్నానని ఆయన ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు పనుల్లో వందల కోట్లు చేతులు మారాయని, ఈ అవినీతి కోసమే చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రం నుంచి దక్కించుకున్నారని ఆ పత్రిక ఏనాడూ ఒక్క కథనం కూడా రాయలేదన్నారు. దీని వెనుక ఏ ప్రజల ప్రయోజనాలు ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా 10 నుంచి 20 శాతం తక్కువ ధరలకే కాంట్రాక్టర్లు టెండర్లు వేస్తే ప్రజలకు, ప్రభుత్వానికి వందల కోట్ల మేలు జరిగే అవకాశం ఉందని తెలిసీ కూడా రామోజీరావు దీనిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో సమాధానం చెప్పాలని మంత్రి నిలదీశారు. 

ఆ నిపుణులెవరో ప్రస్తావించలేదెందుకు?
‘ఈనాడు’ వారి బంధువుల కంపెనీ కాంట్రాక్టు రద్దు అయినందుకు నిపుణులు బాధ పడుతున్నారని ఆ కథనంలో రాశారని, ఆ నిపుణులు ఎవరో ప్రస్తావించలేదని మంత్రి అనిల్‌ విమర్శించారు. దీన్ని బట్టి చూస్తే అసలు నిపుణులు ఈ కథనం రాయించినవారే అని భావించాల్సి వస్తుందని, లేదా నిపుణుల్ని వెతుక్కుని ఇక మీదట మాట్లాడించే కార్యక్రమం చేస్తారన్నది చూడాలని పేర్కొన్నారు. హెడ్‌ వర్క్స్, జల విద్యుత్‌ కేంద్రం పనులను వేర్వేరుగా కాంట్రాక్టర్లకు అప్పగించాలన్నది రూల్‌ అన్నట్లు ఆ కథనంలో రాశారని, ఈ రెండు పనులు ఇంతకు ముందు రామోజీరావు అస్మదీయ కంపెనీయే ఎక్కువ రేటుకు టెండర్‌ దక్కించుకుందన్న నిజం ఆ పత్రిక (ఈనాడు) పాఠకులకు తెలియదన్న ధీమాకు జోహార్లు అర్పిస్తున్నామన్నారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను తనకు ఇవ్వాల్సిందిగా చంద్రబాబు 2016 సెప్టెంబర్‌ 7న అర్ధరాత్రి కేంద్రంతో ఒప్పందం కుదర్చుకుని, ఆ తర్వాత తనకు లంచాలు, కమీషన్‌లు ఇచ్చిన వారికి, అస్మదీయులకు ఈ కాంట్రాక్టు పనులను అప్పగించారని మంత్రి ఎత్తి చూపారు. అప్పటి ఆర్థిక మంత్రి యనమల అస్మదీయులకు కూడా పోలవరం ప్రాజెక్టును పాడి అవుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజా ప్రయోజనం ఎందులో ఉంది?
పోలవరం ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీకి ఏటీఎంగా మారిందని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినప్పటికీ.. అందుకు కారణమైన అదే కాంట్రాక్టర్‌కు అదే కాంట్రాక్టును ఇంకా కొనసాగించాలని ‘ఈనాడు’ పత్రిక వాదిస్తోందంటే ఇది పాఠకులతో బాంధవ్యం కాదని, నవయుగానుబంధం అన్నది స్పష్టమవుతోందని మంత్రి దుయ్యబట్టారు. ప్రాజెక్టు అంచనాలు పెంచి.. డబ్బులు దోచుకునే చంద్రబాబు పద్దతిలో ప్రజా ప్రయోజనం ఉందా? లేక వ్యయం తగ్గించే పద్ధతిని దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టి.. అత్యంత పారదర్శకంగా టెండర్లను పిలిచి రివర్స్‌ టెండరింగ్‌ను అమలు చేయటంలో ప్రజా ప్రయోజనం ఉందా అన్నది ప్రజలకు అర్థమవుతోందన్నారు. ఎక్కువ ధరకు కరెంటు కొనాల్సిందే అని పవర్‌ ప్రాజెక్టులను అంటగట్టింది మొదలు.. రాజధాని వరకు ప్రతిదీ కుంభకోణమేనని మండిపడ్డారు. ఆ కుంభకోణాలను దాచేసి చంద్రబాబు వల్ల.. చంద్రబాబు చేత.. చంద్రబాబు కోసం జర్నలిజాన్ని పణంగా పెడుతున్న వారికి ఏమాత్రం ప్రజా ప్రయోజనాలు ఉన్నాయో ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో టీడీపీతోపాటు ఎల్లో మీడియాను కూడా తిరస్కరించారని మంత్రి అనిల్‌ గుర్తు చేశారు. అయినా జనం పెట్టిన వాతలు వాతలే.. మా రాతలు రాతలే.. అని రామోజీరావు అంటే అది వారి ఇష్టమని స్పష్టం చేశారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top