వారికి దక్కని ఓటు హక్కు! 

Andhra Pradesh Elections Waiting For Results - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఓటమి అంచున ఊగిసలాడుతున్న తెలుగుదేశం పార్టీ తమకు రాని ఓట్లను మరెవరికీ దక్కనివ్వకుండా అడ్డుకోవడానికి అన్ని రకాల కుట్రలనూ పన్నుతోంది. కొందరు అధికారులను పావులుగా చేసి ఇష్టానుసారం పౌరుల ప్రాధమిక హక్కను సైతం కాలరాస్తోంది. ఎన్ని కల విధుల్లోకి ఉద్యోగులను తీసుకుంటున్నప్పుడే ఉద్దేశ పూర్వకంగా కొందరికి ఓటు హక్కును దూరం చేసింది. మిగిలిన వారైనా నచ్చినవారికి స్వేచ్ఛగా ఓటేసేందుకు వీలులేకుండా అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతోంది. సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు, ఎక్స్‌ సర్వీస్‌ మన్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశాన్ని కల్పించాలి. జిల్లాలో 30,229 మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. కానీ వీరిలో 15,594 ఉద్యోగులకు మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్లు అందాయి. 5,240 ఎక్స్‌ సర్వీస్‌ మన్లకు పోస్టల్‌ బ్యాలెట్‌లు అందించారు. మొత్తం 20,834 మందికి పోస్టల్‌ బ్యాలెట్లు ఇచ్చినప్పటికీ 11వ తేదీ పోలింగ్‌ తర్వాత విధుల నుంచి బయటకు వచ్చి ఓటు వేసేందుకు ఉద్యోగులకు అవకాశం లేకుండా పోయింది.

రిజిస్ట్రేషన్‌ నుంచే అవస్థలు మొదలు
పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలను ఈ నెల 7వ తేదీన పంపిణీ చేశారు. ఆ రోజే చాలా మందికి అవి లభించలేదు. నియోజకవర్గం మొత్తానికి ఒక్కచోట మాత్రమే కౌంటర్‌ ఏర్పాటు చేయడంతో ఉద్యోగులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేచి ఉన్నా కొందరు పత్రాలు దక్కించుకోలేకపోయారు. మరోవైపు ఎన్నికల విధుల్లో ఎవరిని నియమిస్తారనేదానిపై చివరి నిమిషం వరకూ స్పష్టత ఇవ్వకపోవడంతో చాలా మంది బ్యాలెట్‌ ఓటుకు దరఖాస్తు చేసుకోలేకపోయారు. అలాగే వివిధ డిపార్ట్‌మెంట్లలో ఉద్యోగులకు బ్యాలెట్‌ ఓటు కల్పించలేదు. చివరి రోజు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా చెప్పారు. అయితే వారికి డ్యూటీ సర్టిఫికెట్టు లేవనే కారణం చూపి బ్యాలెట్‌ పత్రాలు ఇవ్వలేదు. అలాగే బ్యాలెట్‌ ఓటును స్వీకరించడానికి ప్రతి నియోజకవర్గంలోనూ ఒక్కొక్కటి చొప్పున డ్రాప్‌ బాక్సులను ఏర్పాటు చేశారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఇప్పటివరకూ కేవలం 7,262 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ను వినియోగించుకున్నారు. ఒక రోజు మాత్రమే డ్రాప్‌ బాక్సు సౌకర్యాన్ని కల్పించి, వెంటనే తీసేయడం వల్ల ఓటును పోస్టల్‌లో పంపించాల్సి వస్తోందని ఉద్యోగులు అంటున్నారు.

ప్రభుత్వ వ్యతిరేకత ఉందన్న కారణంగానే... 
ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఓటేస్తారనే భయంతోనే వారిలో సగం మందిని ఓటేయకుండా చేశారు. మిగతా వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఒక్కో ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ పంచుతున్నారు. సామాజిక వర్గాల వారీగా ఉద్యోగుల్లో చీలికలు తీసుకువచ్చి లబ్ధి పొందాలని భావిస్తున్నారు. ఈ పనుల కోసం జిల్లాలోని కొందరు ఉన్నతాధికారులు అధికారపార్టీకి అనుగుణంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  అయితే ఉద్యోగులు మాత్రం ఏకపక్షంగా ప్రతిపక్ష పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా మార్పునకు శ్రీకారం చుడుతున్నారు.

పోస్టల్‌ బ్యాలెట్లపైనా నాయకుల నిఘా
పోస్టల్‌ ద్వారా కొందరికి బ్యాలెట్లు వస్తున్నాయని తెలుసుకున్న టీడీపీ నాయకులు వాటిని ఉద్యోగులనుంచి బలవంతంగా తీసుకుని తామే పోస్టల్‌ ద్వారా పంపిస్తామని నమ్మించి తీసుకుంటున్నారన్న ఆరోపణలూ లేకపోలేదు. కొత్తవలస మండలంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది కూడా. ఇక అంగన్‌వాడీ కార్యకర్తల ఓట్లు కూడా నాయకులే తీసుకుని తమకు అనుకూలంగా వేయించేసి తామే పోస్టల్‌ ద్వారా పంపించినట్టు కూడా తెలిసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top