తగునా ఇది.. అధ్యక్షా?

Analysts and people in shock about Speaker Kodela - Sakshi

     సీఎం చంద్రబాబు చిత్రపటానికి స్పీకర్‌ క్షీరాభిషేకమా?

     రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ఇదేం తీరు?

     ఏళ్లు గడిచిపోయినా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఏవి?

     కోడెల తీరుపై విస్తుపోతున్నవిశ్లేషకులు, ప్రజలు

సాక్షి, అమరావతి: సత్తెనపల్లి శాసనసభ్యుడు కోడెల శివప్రసాదరావు గౌరవనీయమైన స్పీకర్‌ పదవిలో కొనసాగుతూ శాసనసభలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. స్పీకర్‌ పదవిలో ఉంటూ ఒక ముఖ్యమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన వ్యక్తి బహుశా దేశంలో శివప్రసాద్‌రావు ఒక్కరేనేమో అని విశ్లేషకులు వ్యాఖ్యాని స్తున్నారు. ఆయన వైఖరి టీడీపీ కార్యకర్తలా ఉందనేందుకు ఇంతకంటే మరో నిదర్శనం లేదంటున్నారు. ఓ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ అన్ని పార్టీలకూ సమాన దూరంలో మసలుకుంటూ అధికార, ప్రతిపక్షాల మధ్య సమతౌల్యం పాటించి శాసనసభకు వన్నె తేవాల్సిన వ్యక్తి రాజ్యాంగ విలువలను మంట గలిపే రీతిలో వ్యవహ రిస్తున్నారని పేర్కొంటున్నారు.

కోడెల తీరు తొలినుంచీ వివాదాస్పదమే అయినప్పటికీ సీనియర్‌ రాజకీయవేత్త అనే ఉద్దేశంతో అధికారపక్షం ఆయన పేరును స్పీకర్‌ పదవికి ప్రతిపాదించగానే మరో ఆలోచనకు తావు లేకుండా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ సీపీ పూర్తి మద్దతునిచ్చింది. కోడెల ఏకగ్రీవంగా ఎన్నిక కాగానే ప్రజాస్వామ్య విలువల ఔన్నత్యానికి కట్టుబడిన వ్యక్తిగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌.. సీఎం చంద్రబాబుతో కలిసి వెళ్లి ఆయన్ను స్పీకర్‌ స్థానంలో కూర్చోబెట్టారు. కానీ ఆ మరుసటి రోజు నుంచే కోడెల ఏకపక్షంగా వ్యవహరిం చడం ప్రారంభించారు. అధికారపక్షం అదుపాజ్ఞల్లో మసలుకుంటూ విపక్షం గొంతు నొక్కేయడానికి అడుగడుగునా సహకరించడం విమర్శలకు దారి తీస్తోంది. 

ఫిరాయింపులు పట్టవా?
అధికార పార్టీలోకి ఫిరాయింపులు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కోడెలకే చెల్లిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 23 మంది వైఎస్సార్‌ సీపీ సభ్యులు సాక్షాత్తూ ముఖ్యమంత్రి సమక్షంలోనే కండువాలు కప్పుకుని టీడీపీలోకి ఫిరాయించినందున అనర్హులుగా ప్రకటించాలని ఫిర్యాదు చేసినా స్పీకర్‌ స్పందించకపోవడం ఎంతో ఔన్నత్యం కలిగిన ప్రజాస్వామ్య దేవాలయంలో చీకటి అధ్యాయంలా మిగిలిందని అంటున్నారు. రాజ్యాంగపరంగా ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం స్పీకర్‌కు కీలకమైన అధికారాలున్నాయి. ఒక పార్టీ నుంచి (గుర్తుపై) ఎన్నికైన ఎమ్మెల్యే లేదా ఎంపీ ఏ కారణం చేతనైనా ఆ పార్టీని వీడి మరో పార్టీలో చేరితే సదరు సభ్యుడిని చట్ట సభ నుంచి అనర్హుడిగా చేసే అధికారం పదో షెడ్యూలు ప్రకారం స్పీకర్‌కు ఉంది.

ఫిరాయింపు వ్యవహారం తన దృష్టికి వచ్చినపుడు గానీ ఫిర్యాదు అందినప్పుడుగానీ సత్వరమే పరిష్కరించి పార్టీ మారిన సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు 2016లో అడ్డగోలుగా వైఎస్సార్‌ సీపీ సభ్యులను కొనుగోలు చేసి పచ్చకండువాలు కప్పినపుడు స్పీకర్‌ ప్రేక్షక పాత్ర వహించారు. తొలిదశలో ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ప్రతిపక్షపార్టీ అప్పటికప్పుడు స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నాన్చారు. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ సీపీ పదేపదే కోరినా పట్టించుకోలేదు. 2016 ఫిబ్రవరి నుంచి నవంబర్‌ 2017 వరకూ విడతల వారీగా ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. చివరకు పార్టీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పీకర్‌ చర్యలను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన తరువాత గానీ కోడెల స్పందించలేదు. 

స్పందించకపోవడం ప్రోత్సహించడం కాదా?
వైఎస్సార్‌ సీపీ తొలుత ఇచ్చిన ఫిర్యాదులు సాంకేతికంగా సరిగ్గా లేవని తిరస్కరిస్తున్నట్లు 2016 జూలైలో స్పీకర్‌ ప్రకటించారు. స్పీకర్‌ నిర్ణయానికి అనుగుణంగా మళ్లీ ఫిర్యాదులు సమర్పించినా ఇప్పటి వరకూ అతీగతీ లేదు. 2017లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చివరిసారిగా ఫిర్యాదు చేసినా స్పీకర్‌ నుంచి ఉలుకూ పలుకూ లేని పరిస్థితులను  చూసి ప్రజాస్వామ్యవాదులు నివ్వెరపోయారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి ఈ ఏడాది ఏప్రిల్‌లో స్పీకర్‌ను కలిసి ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని వినతిపత్రం సమర్పించారు. పార్టీ ఫిరాయింపులపై స్పందించకపోవడం అంటే పరోక్షంగా వాటిని పోత్రహించడమేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పార్టీ వేదికలపై స్పీకర్‌ రాజకీయ ప్రసంగాలు
సాధారణంగా అధికార పక్షానికి చెందిన శాసనసభ్యులే స్పీకర్‌గా ఎన్నికైనా మళ్లీ సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేటపుడు మినహా మిగతా సమయాల్లో తాను ఎన్నికైన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా దూరం పాటించేవారు. కానీ కోడెల నేరుగా టీడీపీ వేదికలపైనే కూర్చుని రాజకీయ ప్రసంగాలు చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గం, అమరావతిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా గుంటూరులో చంద్రబాబు చిత్రపటానికి స్పీకర్‌ ఏకంగా పాలాభిషేకం చేయడంపై అంతా విస్తుపోయారు. రాష్ట్రంలో పర్యటనలకు వెళ్లినపుడు సైతం చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడారు. 2014లో నాడు తెలంగాణ టీడీపీలో ఉన్న ఎరబెల్లి దయాకర్‌రావుతో కలిసి న్యూజెర్సీలో ఎన్నారై టీడీపీ నిర్వహించిన విజయోత్సవాల్లో పాల్గొన్న కోడెల ముఖ్యమంత్రి చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు.

అధికార పక్షానికే అండదండలు..
ప్రజా సమస్యల తీవ్రతను సభలో ప్రతిపక్ష నేత జగన్‌ ఏ రోజు ప్రస్తావించినా ఆ విషయాన్ని దారి మళ్లించేందుకు ప్రయత్నించే అధికారపక్షం ఒకరికి నలుగురు మంత్రులతో మాట్లాడిస్తూ వ్యక్తిగత నిందారోపణలతో ఎదురుదాడికి దిగడం ఒక్క కోడెల హయాంలోనే జరిగిందని సర్వత్రా వినిపిస్తోంది. అయ్యదేవర కాళేశ్వరరావు, ఎం.నారాయణరావు, కోన ప్రభాకరరావు లాంటి మహనీయులు సభలో నెలకొల్పిన ఉన్నత సంప్రదాయాలను కొనసాగించేందుకు కృషి చేయకపోగా అధికార పార్టీ తరపున వ్యవహరించడాన్ని ప్రజాస్వామ్యవాదులు తప్పుబడుతున్నారు. ప్రతిపక్షం సభకు హాజరైనంత కాలం అగ్రిగోల్డ్, కాల్‌మనీ సెక్స్‌ రాకెట్, ఇసుక, మట్టి, సాగునీటి ప్రాజెక్టుల్లో దోపిడీ, వడ్డీకే చాలని రైతు రుణాల మాఫీ, డాక్రా మహిళలకు రుణమాఫీ ఎగవేత లాంటి అంశాలను ప్రస్తావించినపుడల్లా కోడెల అధికారపక్షానికి అండగా నిలిచారు.

ప్రజాసమస్యలు ప్రస్తావిస్తే సస్పెన్షనే...
విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ వ్యవహారాన్ని గట్టిగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారనే ఆగ్రహంతో ప్రతిపక్ష సభ్యురాలు ఆర్‌.కె.రోజాను ఏడాదిపాటు అసాధారణమైన రీతిలో ఆర్థిక మంత్రి ఒత్తిడితో ఉన్నఫళంగా సస్పెండ్‌ చేసి సభ నుంచి బయటకు పంపారు. రోజా ఆ తరువాత సుప్రీంకోర్టుకు వెళ్లి శాసనసభా ప్రవేశానికి అనుమతి తెచ్చుకున్నా ప్రాంగణంలోకే ప్రవేశించకుండా ఎన్నడూ లేని విధంగా అసాధారణమైన సన్నివేశాలకు తెరతీశారు.

మంత్రులనూ మందలించిన స్పీకర్లు
స్పీకర్లు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తారనే అపవాదు రాకుండా పలువురు సభాపతులు ప్రతిపక్ష సభ్యులకు అండగా నిలిచి మంత్రులతో సమాధానాలు రాబట్టేందుకు కృషి చేసేవారు. జి.నారాయణరావు, కోన ప్రభాకర్‌రావు లాంటి వారు నిష్పక్షపాతంగా వ్యవహరించడంతో ముఖ్యమంత్రులే ఇరకాటంలో పడిన సందర్భాలు చరిత్రలో ఉన్నాయి. ఎవరైనా మంత్రి తన శాఖకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడితే సరైన హోంవర్క్‌ చేసి రావాలని స్పీకర్లు సున్నితంగా సూచించిన ఘటనలున్నాయి. కానీ ఈ నాలుగున్నరేళ్లలో మచ్చుకైనా అలాంటివి కనిపించలేదు. 

మహనీయుడు మౌలంకర్‌
లోక్‌సభ తొలి స్పీకర్‌ గణేష్‌ వాసుదేవ్‌ మౌలంకర్‌ పార్లమెంటరీ చరిత్రలో ఇప్పటికీ చిరస్మరణీయుడే. భారత పార్లమెంటరీ సంప్రదాయాలను అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసిన స్పీకర్‌ ఎవరనే ప్రశ్న ఎప్పుడు ఉత్పన్నం అయినా సమాధానంగా వినిపించేది మౌలకంర్‌ పేరే అంటే ఆయన పనితీరు ఎంత గొప్పగా ఉండేదో ఊహించుకోవచ్చు. ఆయన స్పీకర్‌ పాత్రలో న్యాయాన్యాయాల విచక్షణతో చక్కగా పని చేశారు. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సైతం మౌలంకర్‌ విశిష్టతను కొనియాడారు. ఆయన 1952–56 మధ్య కాలంలో నాలుగేళ్లే స్పీకర్‌గా ఉన్నా మౌలంకర్‌ నెలకొల్పిన సంప్రదాయాలు ఉన్నతంగా నిలిచాయి. ప్రజా ప్రయోజనాలు ఇమిడి ఉన్న అంశాలు లోక్‌సభలో ప్రస్తావనకు వచ్చినపుడు ఆయన ప్రతిపక్షం వైపు నిలబడి సానుకూలమైన ముగింపునకు ఆస్కారం కలిగించే స్పీకర్‌గా గణతికెక్కారు. 

సోమనాథ్‌ ఆదర్శం...
ఇటీవలే మృతి చెందిన సోమనాథ్‌ చటర్జీ ఉత్తమమైన స్పీకర్లలో ఒకరిగా పేరుపొందారు. యూపీఏ –1 హయాంలో ఆయన లోక్‌సభ స్పీకర్‌గా ఉండగా కాంగ్రెస్‌ సంకీర్ణం నుంచి సీపీఎం వైదొలగింది. అపుడు ఆయన్ను కూడా స్పీకర్‌ పదవిని వదులుకోవాల్సిందిగా సీపీఎం ఆదేశించింది. అయితే సోమనాథ్‌ అందుకు అంగీకరించకుండా స్పీకర్‌ పదవి పార్టీలకు అతీతమని స్పష్టం చేశారు. సీపీఎం ఆ తరువాత ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించినా సోమనాథ్‌ ఖాతరు చేయలేదు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top