అమిత్‌ ‘షో’ చూపిస్తారా!

Amit Shah  Political Story on Lok Sabha Election - Sakshi

బీజేపీలో బలమైన శక్తిగా అమిత్‌షా  

లోక్‌సభకు పోటీతో  రెండో అంకం మొదలు

బ్యాక్‌ రూమ్‌ ఆపరేటర్‌ నుంచి బీజేపీ అధ్యక్షుడి వరకు.. తెర వెనుక మంత్రాంగం నడిపిన దగ్గరి నుంచి రాజకీయ తెరపై తన పేరే ప్రతిధ్వనించే వరకు.. క్షేత్రస్థాయిలో కార్యకర్తల అండదండల దగ్గర నుంచి అగ్రనేతల ఆశీస్సులు అందుకునే వరకు.. లోహ్‌పురుష్‌ అడ్వాణీ కంచుకోట గాంధీనగర్‌లో తన సొంత ఎజెండాతో జెండా ఎగరవేయాలన్న తపన వరకు.. ఇప్పుడు లోక్‌సభకు పోటీ చేస్తూ తెరముందుకు వస్తున్న అమిత్‌షా పోషించబోయే పాత్ర ఎలా ఉంటుందో గమనించాలి.

బీజేపీలో మోదీ–షా ద్వయానికి ఇప్పటివరకు తిరుగే లేదు. గత అయిదేళ్లలో పార్టీ సాధించిన విజయాల వెనుక వీరిద్దరి ఉమ్మడి కృషి ఉందనడంలో సందేహం లేదు. పట్టణ ఓటర్లు, ఫస్ట్‌ టైమ్‌ ఓటర్లు ‘నమో’ మంత్రాన్ని జపించడం వెనుక అపర చాణక్యుడిలా అమిత్‌ షా రచించిన మంత్రాంగం ఉంది. పకడ్బందీ వ్యూహాలు, సంకీర్ణ కూటములు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాల్లో షాకి తిరుగులేదు. అమిత్‌ షా చుట్టూ ఎన్ని వివాదాలున్నా.. పార్టీలో ఆయన వివాదరహితుడిగా పేరు సంపాదించారు. అసమ్మతివాదుల్ని దారిలో పెట్టడం షాకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన ముందున్న ఏకైక లక్ష్యం తన సాహెబ్‌ (మోదీ)కి ఎలాంటి కష్టం రాకుండా, ఆయనను మించి పార్టీలో ఎవరూ ఎదగకుండా చూడడమే. అందుకోసం ఆయన ఏమైనా చేస్తారు. నరేంద్ర మోదీ వాక్చాతుర్యానికి జనం నుంచి ఏ స్థాయిలో స్పందన ఉంటుందో, షా రచించే రాజకీయ వ్యూహాలకు పార్టీలో అదే స్థాయిలో స్పందన వస్తుంది. ఇన్నాళ్లూ రాజ్యసభ ఎంపీగా ఉన్న అమిత్‌ షా ఇప్పుడు గాంధీనగర్‌ అభ్యర్థిగా లోక్‌సభ బరిలో దిగడంతో పార్టీలో భవిష్యత్‌ అంతా ఆయనదేనన్న భావన వ్యక్తమవుతోంది.

యూపీలో గెలుపుతో దేశవ్యాప్త ఇమేజ్‌
గుజరాత్‌లో హోంమంత్రిగా ఉన్నప్పుడు నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులు, హత్య, కిడ్నాప్‌ వంటి కేసులు షాని వెంటాడాయి. అయినప్పటికీ నరేంద్ర మోదీ ఏరికోరి గత ఎన్నికల్లో కీలకమైన యూపీ ఇన్‌చార్జ్‌గా పంపించారు. ఆ రాష్ట్రంలో షా రచించిన వ్యూహాలే బీజేపీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాయి. యూపీలో 80 లోక్‌సభ స్థానాలకు 71 స్థానాలు గెలుచుకోవడంతో షా  పేరు దేశవ్యాప్తంగా మారు మోగింది. ఆ తర్వాత అధ్యక్ష పగ్గాలు చేపట్టిన షా తన దూకుడు చూపించారు. మోదీ షా ద్వయం చాలా రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరేశారు. గత ఏడాది జరిగిన మూడు హిందీ రాష్ట్రాల్లో ఓటమితో మోదీ, అమిత్‌షా ద్వయంపై వ్యతిరేకత మొదలైంది. అయినా వారి ద్దరూ పార్టీపై పట్టు కోల్పోలేదు. బీజేపీలో లోహ్‌ పురుష్‌గా పేరు సంపాదించి, ఒకప్పుడు రథయాత్రతో పార్టీకి ఒక ఊపు తీసుకువచ్చిన ఎల్‌కే అడ్వాణీ నియోజకవర్గంలోనే అమిత్‌ షా పోటీకి దిగడం వెనుక తాను కూడా ప్రజా నాయకుడినేనని రుజువు చేసుకునే ప్రయత్నమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అమిత్‌లో మరో కోణం
బిహార్, మహారాష్ట్రలో కూటముల ఏర్పాటులో షా చూపించిన చాణక్యం, గాంధీనగర్‌ బీజేపీ అ«భ్యర్థిగా బహిరంగ సభల్లో చేస్తున్న ప్రసంగాలు, మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలు ఆయనలో ఓ కొత్త వ్యక్తిని పరిచయం చేస్తున్నాయి. తాను చెప్పదలచుకున్నది సూటిగా చెప్పే నైపుణ్యం, ఆగ్రహావేశాల్ని రగిలించే మాటల గారడీ అమిత్‌ షాకు దేశవ్యాప్తంగా ఒక కొత్త ఇమేజ్‌ను తెస్తున్నాయి. ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడినన్న భావన ఆయనలో ఏ కోశానా కనిపించదు. కార్యకర్తల్లో కార్యకర్తలా కలిసిపోతారు. వారి భుజం చుట్టూ చెయ్యివేసి పేరు పెట్టి మరీ పలకరిస్తారు. స్టార్‌ హోటల్స్‌ బదులుగా ప్రభుత్వ అతిథి గృహాల్లోనే బసచేస్తారు. తనకంటూ ప్రత్యేకంగా విమానాలు, హెలికాప్టర్లు వాడరు. అమిత్‌ షా నామినేషన్‌ వేసే సమయంలో జనం వెల్లువెత్తారంటే ఆయన సొంత రాష్ట్రం కాబట్టి వచ్చారనుకోవచ్చు. కానీ బీజేపీ అగ్రనేతలైన రాజ్‌నాథ్‌ సింగ్, నితిన్‌ గడ్కరీ, అరుణ్‌ జైట్లీ, పీయూష్‌ గోయెల్‌ మాత్రమే కాదు, భాగస్వామ్య పార్టీలకు చెందిన రామ్‌ విలాస్‌ పాశ్వాన్, ప్రకాశ్‌సింగ్‌ బాదల్, ఇన్నాళ్లూ బీజేపీని తిట్టిపోసిన ఉద్దవ్‌ ఠాక్రే తరలివచ్చారం టేనే అమిత్‌ అందరినీ ఎంతలా కలుపుకుపోతారో అర్థమవుతుంది.

మీడియా మేనేజ్‌మెంట్‌లో..
అమిత్‌ షా మీడియాలో కూడా హై ప్రొఫైల్‌ మెయింటెయిన్‌ చేస్తున్నారు. గత నెలలో ఇండియా టీవీలో ఆప్‌ కీ అదాలత్‌ షోలో గంటసేపు బీజేపీ సాధించిన ప్రగతిపై అనర్గళంగా ప్రసంగించారు. నెట్‌వర్క్‌ 18కి ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో కూడా షా ఇచ్చిన సమాధానాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బీజేపీలో మరే ఇతర నేతకి ఈ స్థాయి ఇమేజ్‌ రాలేదని చెప్పాలి.

హిందూత్వ విధానంతో అభివృద్ధి నినాదం
అమిత్‌ షా రాజకీయ ప్రస్థానం గాంధీనగర్‌ నుంచే మొదలైంది. 30 ఏళ్లుగా బీజేపీ అ«భ్యర్థులే ఇక్కడ విజయం సాధిస్తున్నారు. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి, అడ్వాణీ, శంకర్‌ సింహ్‌ వాఘేలా వంటి వారు ఇక్కడ గెలుపొందారు. అలాంటి నియోజకవర్గాన్ని ఎంచుకున్న షా విజయం నల్లేరు మీద నడకే. ఇక కేంద్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వస్తే అమిత్‌ షాకి ఇక తిరుగుండదు. ‘పాత తరంలో హిందూత్వ విధానాలకు లోహ్‌ పురుష్‌ అడ్వాణీ ప్రతీకగా ఉన్నారు. మోదీ, షా ద్వయం కొత్త తరహా హిందూత్వ విధానాలతో పాటు అభివృద్ధి నినాదాన్ని కలిపి ముందడుగు వేస్తున్నారు. అమిత్‌ షా ఇప్పటికిప్పుడు మోదీని మించకపోవచ్చు. కానీ పార్టీలో భవిష్యత్‌ అంతా ఆయనేదనన్న సంకేతాలైతే బలంగానే ఉన్నాయి’ అని గుజరాత్‌ రాజకీయాలపై పరిశోధనలు చేసే షరీక్‌ లాలీవాలా అభిప్రాయపడ్డారు. బీజేపీ హిందూత్వ భావజాలానికి గుజరాత్‌ ఒక ప్రయోగశాల అనుకుంటే ఆ రాష్ట్రంలో గాంధీనగర్‌ నియోజకవర్గం దానికో ప్రతీక అన్న అభిప్రాయం ఉంది. అలాంటి నియోజకవర్గం బరిలో దిగిన షా గెలుపోటములే కాదు, పార్టీ గెలుపోటములూ ఆయన రాజకీయ భవిష్యత్‌పై ప్రభావం చూపొచ్చు.

మోదీ తర్వాత ఎవరు?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీకి ఒక ఫేస్‌. భవిష్యత్‌లో మోదీ స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తిగా యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ పేరు కొన్నాళ్లు చెప్పుకున్నారు. కరడుకట్టిన హిందూత్వవాదిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, మతం రంగు పూసుకున్న రాజకీయాలు సంఘ్‌ పరివార్‌ను ఆకట్టుకున్నాయే కానీ ఢిల్లీకి ఉత్తరద్వారమైన యూపీ రాష్ట్రంలో ఆయన పరిపాలన, మైనార్టీ వ్యతిరేక విధానాలు జనంలో వ్యతిరేకతను పెంచాయి. ఇలాంటి సమయంలో అమిత్‌ షా పార్టీలో ఎదుగుతున్న తీరు చూస్తే ఆయన రాజకీయ భవిష్యత్‌పై అభిమానుల్లో ఆశలు కలుగుతున్నాయి. ఒకప్పుడు పార్టీలో ఓ వెలుగు వెలిగిన వారంతా రకరకాల కారణాలతో కనుమరుగైపోతున్నారు. ఇన్నాళ్లూ పత్రికల్లో తరచూ కనిపించే అరుణ్‌ జైట్లీని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న సుష్మా స్వరాజ్‌ స్వచ్ఛందంగానే పోటీ నుంచి తప్పుకున్నారు. మూడు హిందీ రాష్ట్రాల ఓటమి తర్వాత మోదీ–షా ద్వయంపై çనితిన్‌ గడ్కరీ పరోక్ష విమర్శలు చేసినా ఇప్పుడు ఆయన కూడా దారికి వచ్చేశారు. ప్రధానిపై స్వామిభక్తినే ప్రదర్శిస్తున్నారు. దీంతో బీజేపీ ఇంటా బయటా షా పేరే మారుమోగిపోతోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top