వ్యూహరచనలో బాద్‌షా

Amit Sha And Narendra Modi Political Plannings Special Story - Sakshi

కొన్ని కాంబినేషన్లకి తిరుగుండదు. ఎదురొడ్డి నిలిచేవారు కనిపించరు. గత లోక్‌సభ ఎన్నికల్లో మోదీ షా ద్వయం తమకు సాటి పోటీ లేదని నిరూపించుకుంది. ప్రధాని పదవిని చేపట్టిన నరేంద్ర మోదీ విజయం వెనుక  షా అమితమైన రాజకీయ చాణక్యం ఉంది. చదరంగం ఆయనకు ఎంతో ఇష్టమైన ఆట. అందులో పావుల్ని కదిపినట్టే రాజకీయ చదరంగంలో కూడా పావులు పక్కాగా కదపగలరు. ప్రత్యర్థులకు చెక్‌ పెట్టగలరు. రాచరికపుటెత్తులతో రణతంత్రపు జిత్తులతో నిరంతరం వ్యూహ రచనలో మునిగితేలుతారు. 2014 లోక్‌సభ ఎన్నికల నాటికి ఉత్తరప్రదేశ్‌లో క్షేత్రస్థాయిలో బీజేపీ అంతంత మాత్రంగానే ఉన్న టైమ్‌లో ఎలక్షన్‌ ఇన్‌చార్జ్‌ బాధ్యతల్ని చేపట్టిన అమిత్‌ షా వ్యూహరచనతో మొత్తం 80 స్థానాలకు గాను 71 స్థానాలను సాధించడంతో మోదీ ప్రధాని పీఠం ఎక్కగలిగారు.

ఆ కృతజ్ఞతతోనే ఆప్తమిత్రుడికి మోదీ  బీజేపీ జాతీయ అధ్యక్షుడి పగ్గాలు అప్పగించారు. క్షేత్రస్థాయిలో పార్టీకి పట్టు సంపాదించి పెట్టడం, దేశం నలుమూలలా ఉన్న పార్టీ కార్యకర్తల్ని పేరు పేరునా పలకరిస్తూ వారి మనసుల్లో చోటు సంపాదించడం  ప్రత్యేకతగా కలిగిన అమిత్‌ షాని వివాదాలు వెక్కిరించాయి. విజయాలు వరించాయి. అన్నింటినీ సమానంగా స్వీకరించే స్థిరచిత్తం షా సొంతం. నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో కటకటాలు లెక్కించాల్సి వచ్చినా ఆయనలో ఆత్మస్థైర్యం సడలలేదు . చిన్న వయసు నుంచే రాజకీయ సిద్ధాంతాలకు సంబంధించిన పుస్తకాల్ని ఆసాంతం చదివేశారు. తొమ్మిదేళ్ల వయసులోనే కౌటిల్యుడి అర్థశాస్త్రాన్ని ఔపోసన పట్టేశారు. అదే ఆయన రాజకీయ ఎదుగుదలకు బాటలు వేసింది. అమిత్‌ షా పూర్తి శాకాహారి. పొగతాగరు. మద్యం ముట్టరు. క్రమశిక్షణ  గల జీవితాన్నే గడుపుతారు. సంపన్న కుటుంబంలో పుట్టినా సామాన్యుడిలా బతకడానికే ఇష్టపడతారు. ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌కి బదులుగా ప్రభుత్వ అతిథి గృహాల్లోనే బస చేస్తారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top