రాహుల్‌ గాంధీని పప్పు అన్నది మీరు కాదా..?

Ambati Rambabu Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయవాడ :  రాజకీయ ఎత్తుగడ కోసమే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ రెండుగా చీల్చిందని, విభజనతో రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్‌ అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటలీ దెయ్యం సోనియాను తరిమికొట్టాలని, రాహుల్‌ గాంధీని పప్పు అని చంద్రబాబు అనలేదా అని అంబటి నిలదీశారు. అదే చంద్రబాబు ఇవాళ రాహుల్‌ను కలవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. 

కుట్ర, వెన్నుపోటు రాజకీయాలు చంద్రబాబు నైజం అంటూ ఆయన ధ్వజమెత్తారు. ఎన్టీఆర్‌ను దేవుడని పొగడి.. వెన్నుపోటు పొడిచి మరీ ఆయన కూర్చీని చంద్రబాబు లాక్కున్నారని, గతంలో ఓసారి మోదీని విమర్శించి మళ్లీ ఆయనతోనే చంద్రబాబు జోడి కట్టారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా అవసరం లేదన్న చంద్రబాబు, ఆ తర్వాత యూ టర్న్‌ తీసుకుని మళ్లీ హోదా కావాలన్నారని, చంద్రబాబుది నాలుకా? తాటిమట్టా? అని మండిపడ్డారు. చంద్రబాబును నమ్మి బాగుపడ్డవారెవరూ లేరని అంబటి ఎద్దేవా చేశారు. ఆర్థిక సంబందాలే తప్ప మానవ సంబంధాలు లేని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడైనా ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేశారా? అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్‌ దక్కదని సర్వేలు చెబుతున్నాయని తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top