రైతుల ఆత్మహత్యలు మరచి ఢిల్లీ యాత్రలా ?

Ambati Rambabu Fires On Chandrababu - Sakshi

ఈసీ, రీపోలింగ్, ప్రజలపై చంద్రబాబుకు విశ్వాసం లేదు

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

సాక్షి, హైదరాబాద్‌ : ఆరు వారాల్లో 8 మంది అనంతపురం రైతులు ఆత్మహత్య చేసుకుంటే, ఈ అంశంపై సీఎం చంద్రబాబు దృష్టి సారించకుండా ఢిల్లీ యాత్రలు చేస్తూ కాలం గడుపుతున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఈసీ, రీ పోలింగ్, ఆఖరుకు ప్రజలపై కూడా చంద్రబాబుకు విశ్వాసం లేదని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టిన బాబు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల ఆత్మహత్యల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తోందని నిలదీశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తన హక్కులు, మంత్రి వర్గ సమావేశాల గురించి మాత్రమే బాబు మాట్లాడుతున్నారన్నారు. ప్రజా సమస్యలను పూర్తిగ గాలికి వదిలేసి ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు అంటూ దిగజారిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు.

రీపోలింగ్‌ అప్రజాస్వామికమా బాబూ?
చంద్రగిరి నియోజకవర్గంలో 7 కేంద్రాల్లో అక్రమాలు జరిగాయని, పోలింగ్‌ ఏకపక్షంగా నిర్వహించారని, ఆ ప్రాంతంలో దళితులు ఓటు హక్కు వినియోగించుకోకుండా అగ్రవర్ణాలు అడ్డుపడ్డాయని వైఎస్సార్‌సీపీ చంద్రగిరి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వెబ్‌ క్లిప్పింగులు సహా ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ఏడు కేంద్రాల్లో రీపోలింగ్‌ జరిపించాలని కోరితే ఈసీ కేవలం 5 చోట్ల మాత్రమే నిర్వహిస్తోందన్నారు. అన్ని సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాతనే ఈ నెల 19న రీపోలింగ్‌ జరపాలని నిర్ణయించిందని వివరించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఈ 5 పోలింగ్‌ బూతుల్లో  రిగ్గింగ్, సైక్లింగ్‌ చేసి దళితులను టీడీపీ భయభ్రాంతులకు గురి చేసిన సంగతి గుర్తు చేశారు. దళితులను రానీయకుండా, అగ్రవర్ణాల వారే ఓట్లు  వేసుకున్నారన్నారు. 5 బూత్‌ల్లో రీపోలింగ్‌ జరిగినంత మాత్రాన టీడీపీ సర్వనాశనం అయిపోతుందా అని అంబటి ప్రశ్నించారు. 

రీపోలింగ్‌పై టీడీపీ దుష్ప్రచారం దేనికి..
ప్రజాస్వామ్యం విజయవంతం అవ్వాలంటే ఓటరు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. అలాంటి అవకాశం ఇవ్వాలని ఫిర్యాదు చేస్తే, వైఎస్‌ఆర్‌సీపీ మాట ఈసీ వింటోందని టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని అంబటి మండిపడ్డారు. షెడ్యూల్‌ ప్రకారం రీపోలింగ్‌ నిర్వహించుకొనే హక్కు ఈసీకి ఉంటుందని స్పష్టం చేశారు. చెవిరెడ్డికి వెబ్‌ క్లిప్పింగులు ఎలా వచ్చాయనే దాని కన్నా అవి కరెక్టా, కాదా? అన్నది చెప్పాల్సిన బాధ్యత టీడీపీకి ఉందన్నారు. 

23 తరువాత భవిష్యత్తు కార్యాచరణ
ఏ జాతీయ పార్టీ నుంచి తమ పార్టీకి ఆహ్వానం రాలేదని అంబటి రాంబాబు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. 23 తరువాత భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకుంటామని అన్నారు. ఫలితాల తర్వాత జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు పాత్ర ఏంటో బట్టబయలు అవుతుందన్నారు. ఈవీఎంలు, ఈసీ, పోలింగ్‌ అన్నింటి మీద బాబుకు డౌటేనని అంబటి రాంబాబు అన్నారు. పోలింగ్‌ లేకుండా ఆయన్ని సీఎం చేస్తే సంతోషిస్తాడేమోనని ఆయన ఎద్దేవా చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top