బాబూ.. నీ బతుకంతా నేర చరిత్రే

Ambati Rambabu fires on Chandrababu - Sakshi

     గొడవలన్నీ నువ్వే చేయించి ప్రతిపక్షంపైకి నెట్టేస్తున్నావ్‌.. 

     రాజధాని, తుని ఘటనల్లో నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదు? 

     అధికారం నీ చేతిలోనే ఉన్నా నేరాన్ని నిరూపించలేదేం.. 

     విలువల గురించి బాబు మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారు

     రాబోయే ఎన్నికల్లో ముస్లింలు బాబును తరిమికొట్టడం ఖాయం

     కుట్రలు, అల్లర్ల గురించి నువ్వు మాట్లాడుతావా?

     ముఖ్యమంత్రిపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి ఆగ్రహం

సాక్షి, అమరావతి: ‘‘చంద్రబాబూ.. కుట్రల గురించి నువ్వు మాట్లాడుతావా? నీ బతుకంతా కుట్రల మయం. నీ రాజకీయమంతా నేర ప్రవృత్తే. తప్పులు నువ్వు చేసి వాటిని ప్రతిపక్షంపైకి నెట్టడం నీకు మాత్రమే తెలిసిన విద్య. నువ్వు చేసిన పాపాలన్నీ మాపై మోపుతావా?’’ అంటూ వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. గుంటూరులో టీడీపీ నిర్వహించిన మైనార్టీ సభలో ముస్లిం యువకులు న్యాయం కావాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శించడాన్ని కుట్రగా ప్రచారం చేస్తూ, అదంతా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేయించారంటూ శనివారం చంద్రబాబు చేసిన ఆరోపణలను అంబటి తిప్పికొట్టారు. గుంటూరులో మైనార్టీల సభలో అల్లర్లు సృష్టించేందుకు తాము ప్రయత్నించామనడం హేయమని, అల్లర్లు సృష్టించేది చంద్రబాబేనని మండిపడ్డారు. కావాలని గొడవలు చేయించడం, వాటిని ప్రతిపక్షంపైకి నెట్టడం మొదటి నుంచీ బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పారు. 

విచారణ వివరాలు బయటపెట్టరేం.. 
తునిలో రైలు దహనం, రాజధానిలో పంటలను తగుల బెట్టించింది చంద్రబాబేనని, కానీ వాటికి వైఎస్సార్‌సీపీ నేతలను బాధ్యులను చేయాలని చూశారని అంబటి రాంబాబు విమర్శించారు. ఆ రెండు ఘటనలను వైఎస్సార్‌సీపీ చేయించిందని, పులివెందుల నుంచి వచ్చిన గూండాలు అవన్నీ చేశారని ఆరోపిస్తున్న చంద్రబాబు వాటిని ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. అధికారం చేతిలో ఉండి, దర్యాప్తు సంస్థలు ఆధీనంలో ఉన్నప్పటికీ ఈ వ్యవహారాలపై జరిపిన విచారణల వివరాలు ఎందుకు బహిర్గతం చేయలేదని నిలదీశారు. తుని ఘటనపై సీబీసీఐబీతో విచారణ జరిపించారని, కానీ ఆ వివరాలు బయటపెట్టలేదని, నిజంగా వైఎస్సార్‌సీపీ వారే అందులో ఉంటే ఎందుకు అరెస్టు చేయలేదని అన్నారు. ఆ వ్యవహారాల్లో తెలుగుదేశం పార్టీ వారే ఉండడంతో విచారణ వివరాలను బయట పెట్టడం లేదని, కానీ నెపం మాత్రం వైఎస్సార్‌సీపీపై వేసి తరచూ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధానిలో పంటలను తగులబెట్టించిన ఘటనల్లోనూ టీడీపీ వారే ఉండడంతో ఆ వివరాలను బయటపెట్టకుండా దాచి తమపై ఆరోపణలు చేస్తున్నారని తప్పుపట్టారు. అల్లర్లు సృష్టించడమే చంద్రబాబు చరిత్ర అని, 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన చేసింది అదేనని పేర్కొన్నారు. 

బాబు మూల్యం చెల్లించక తప్పదు 
గుంటూరు మైనార్టీల సభలో ఇచ్చిన హామీల గురించి యువకులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తే తట్టుకోలేక వారిపై దేశద్రోహం కేసులు పెట్టించడం న్యాయమా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీపై ఉన్న కక్షతో అమాయక ముస్లిం యువకులను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సభలో అల్లర్లు సృష్టించాల్సిన అవసరం చంద్రబాబుకు తప్ప ఎవరికీ లేదన్నారు. విలువలు, సిద్ధాంతాల గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కుట్రలే సిద్ధాంతంగా, మోసాలనే విలువలుగా భావించే చంద్రబాబు తన తప్పులను ఎదుటివారిపై వేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ముస్లింలను అన్ని రకాలుగా మోసం చేసి ఎన్నికల కోసం వారిపై ప్రేమ కురిపిస్తున్న చంద్రబాబును వారు రాబోయే ఎన్నికల్లో తరిమికొడతారని స్పష్టం చేశారు. చేసిన తప్పులు, మోసాలకు చంద్రబాబు త్వరలో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.  

పేదల కోసం తపించిన ఏకైక సీఎం వైఎస్సార్‌
పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం తపించిన, ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఒక్కరేనని అంబటి రాంబాబు కొనియాడారు. వైఎస్సార్‌ మరణించి 9 ఏళ్లయినా ఆయన చేసిన అభివృద్ధి మాత్రం తెలుగు ప్రజల గుండెల్లో ఇప్పటికీ మిగిలే ఉందని తెలిపారు. ఆయన శనివారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సంక్షేమ పథకాలు అంటే వెంటనే గుర్తొచ్చేది మహానేత వైఎస్సారేనని చెప్పారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అమలు చేశారు కాబట్టే ఆయన మరణించి ఇన్నేళ్లయినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని శ్లాఘించారు. తమ నాయకుడు, ఆత్మబంధువు లేడన్న వార్తను జీర్ణించుకోలేక వందల గుండెలు ఆగిపోయాయని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, 108, 104, పక్కా ఇళ్ల నిర్మాణం, ఉచిత విద్యుత్, రైతాంగం విద్యుత్‌ బకాయిల రద్దు... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ ఓ గొప్ప పథకమేని అన్నారు. రాజశేఖరరెడ్డి మరణం తర్వాత వచ్చిన రెండు ప్రభుత్వాలు ఆయన అమలు చేసిన పథకాలను దూరం పెట్టాలంటే భయపడిపోయాయని వెల్లడించారు. వైఎస్సార్‌ వర్థంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఊరూ వాడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి, మహానేతకు ఘనంగా నివాళులర్పించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే అది జగనన్నతోనే సాధ్యమని, కాబట్టి జగనన్నను ఆశీర్వదించాలని కోరారు. సీఎం చంద్రబాబు ముస్లింల వ్యతిరేకి అని అంబటి రాంబాబు మండిపడ్డారు. ముస్లింలంతా వైఎస్సార్‌ హమారా.. అని ఇప్పటికీ, ఎప్పటికీ గుండెల్లో పెట్టుకొనే విధంగా వారి జీవితాలను తీర్చిదిద్దారని పేర్కొన్నారు. చంద్రబాబు మాదిరిగా సభల పేరిట రూ.కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి హమారా అని చాటుకోలేదని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top