అభినందించకుండా అసత్య ప్రచారమా?

Alla Nani Comments On TDP - Sakshi

టీడీపీపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ధ్వజం

ప్రజలు సంతోషంగా ఉండకూడదన్నదే విపక్షం ధోరణి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు కట్టుదిట్టంగా అమలవుతుండటాన్ని జీర్ణించుకోలేక విపక్షాలు తప్పుడు ప్రచారాలతో ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని విమర్శించారు. కరోనా కట్టడికి శక్తి వంచన లేకుండా పని చేస్తున్న అధికారులను అభినందించాల్సింది పోయి అత్యంత హేయంగా విమర్శలు చేస్తున్నారని తప్పుబట్టారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.

► మాస్కులు, డాక్టర్ల కొరత ఉందని, టెస్టింగ్‌ కిట్లల్లో కుంభకోణం జరిగిందంటూ విష ప్రచారానికి పాల్పడుతున్నారు. ఒక్కో కిట్‌ రూ.730 చొప్పున దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్‌ కిట్లను కొనుగోలు చేశాం. దీనిపై ఆరోపణలు చేస్తున్న కన్నా లక్ష్మీనారాయణ వాస్తవాలను పరిశీలించాలి. 
► ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌ను ఐసీఎంఆర్‌ రూ.795కి కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించింది. మేం బేరం ఆడి రూ.65 తక్కువగా రూ.730కే కొనుగోలుకు పర్చేజ్‌ ఆర్డర్‌ సిద్ధం చేశాం. ఏ రాష్ట్రం చేయని విధంగా ఓ షరతు కూడా విధించాం. మరే రాష్ట్రానికైనా రూ.730 కంటే తక్కువ ధరకే అమ్మితే అదే ధరనే ఏపీకి కూడా వర్తింపచేయాలని నిబంధన విధించాం. ఆ ప్రకారమే ఒప్పందం చేసుకున్నాం. ఇప్పుడు చత్తీస్‌గఢ్‌కు రూ.337కే ఇచ్చినట్లు చెబుతున్నారు. అంతకంటే తక్కువ ధరకు ఇచ్చినా అదే రేటు మేం విధించిన షరతు కారణంగా రాష్ట్రానికి వర్తింపచేయాల్సి ఉంటుంది. 
​​​​​​​► శ్రీకాకుళం,విజయనగరం జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాకపోవడం, విశాఖలో తక్కువ కేసులు నమోదైతే సంతోషించాల్సింది పోయి దానిపై కూడా విమర్శలు చేయడం దారుణం. 
​​​​​​​► ప్రజలు ఓడించారు కాబట్టి వారు సంతోషంగా ఉండకూడదన్నదే టీడీపీ ధోరణి. సీఎంపై అక్కసుతో ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని విపక్షాలను కోరుతున్నాం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top