పచ్చగా ఉంటేనే వరం

All Political parties should pay attention on agriculture - Sakshi

వ్యవసాయంపై అన్ని పార్టీలూ శ్రద్ధ చూపాలి 

రైతులకూ ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వాలి 

సాగు బడ్జెట్‌ పెంచాలి 

రైతుల ఆత్మహత్యల నివారణకు చర్యలు 

బీమా, రుణమాఫీతో భరోసా  

విత్తనాలు, ఎరువులు సులువుగా సరఫరా 

వ్యవసాయం మీద లోతైన ఆలోచనలు లేవు. సమగ్ర ప్రణాళికలు అసలే లేవు. అవసరాలకు తగినట్టుగా స్పందించే అధికార వ్యవస్థా లేదు. రైతులకు విశ్వాసం కల్పించే రాజకీయ నాయకత్వమూ లేదు. ఎన్నికల సమయంలో.. రైతుల కోసం ఏమేమో చేస్తామంటూ ఊదరగొడతారు. అనంతరం అవన్నీ ‘మేనిఫెస్టోల మీద రాతలే’.. ఇప్పుడు రైతులూ చైతన్యవంతంగానే ఉంటున్నారు. ఏ పార్టీ తమకు మేలు చేస్తుందో బాగానే అంచనా వేస్తున్నారు. స్వర్ణాంధ్ర ప్రదేశ్, విజన్‌ 2020 లాంటి కార్యక్రమాలతో గతంలో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో రైతులను నిర్లక్ష్యం చేయగా.. ఆ పార్టీకి ఎన్నికల్లో తగిన బుద్ధే చెప్పారు. అదే సమయంలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్‌ పథకం రాష్ట్ర రైతాంగంలో ఆశలు చిగురింపచేసింది. చెప్పినట్టుగానే ఆయన వ్యవసాయాన్ని పండగ చేశారు. నిజంగా వ్యవసాయానికి ఊతమిచ్చే విధాన నిర్ణయాలు తీసుకుంటే, రైతులకు చేదోడువాదోడుగా ఉండేలా వ్యవహరిస్తే రైతులు పట్టం కడతారనేందుకు వైఎస్‌ జమానా నిదర్శనం. దీన్ని ఉదాహరణగా తీసుకునైనా నేటి పార్టీలు సాగుకు మేలుచేసే పథకాలతో ‘గ్రీన్‌’ మేనిఫెస్టోలను రూపొందించాలి.   

వ్యవసాయంపై పార్టీల విధానాలిలా.. 
- జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ 2014లో వ్యవసాయానికి ప్రాధాన్యమివ్వలేదు. రైతుల ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోలేదు. యూపీఏ, ఎన్డీఏ కూటములేవీ రైతు ప్రాధాన్య మేనిఫెస్టోలను అమలు చేయలేదు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానిస్తామన్న బీజేపీ.. అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదు. 
ప్రాంతీయ పార్టీలైన టీఆర్‌ఎస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీ ఆయా ప్రాంతాల్లో రైతులకు రుణమాఫీ హమీలిచ్చాయి. నాణ్యమైన విద్యుత్‌ అందిస్తామన్నాయి. విత్తన చట్టం చేస్తామన్నాయి. కానీ వీటిల్లో అధికారం చేపట్టిన పార్టీలు అవేవీ నెరవేర్చలేదు. 
మార్కెట్‌ స్థిరీకరణ నిధి ఏర్పాటు గురించి కూడా పలు ప్రాంతీయ పార్టీలు హామీలిచ్చాయి. ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ హామీ కూడా దాదాపు అన్నింట్లో ఉంది. జాతీయ స్థాయిలో మాత్రం ఎవ్వరూ చెప్పలేదు. కౌలు రైతుల ప్రస్తావన ఉన్నా, కొత్త ప్రతిపాదనలు ఏమీ లేవు. 
మొత్తంగా జాతీయ స్థాయిలో పార్టీల మేనిఫెస్టోలు నిరాశ కలిగించాయి. ప్రాంతీయ పార్టీల హామీల్లో కొన్ని ఆహ్వానించదగినవి ఉన్నాయి. తెలుగుదేశం హామీ పత్రం వ్యవసాయంలో కొన్ని వర్గాలకే కొమ్ము కాసేలా ఉంది. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసే దిశగా, చిన్న, సన్నకారు రైతులను వ్యవసాయం నుంచి దాటించే దిశగానే టీడీపీ ఆలోచనలు ఉన్నాయి. 
తెలంగాణలో వ్యవసాయ యంత్రాలు, ఉపకరణాలకు 50 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. ఏపీలో అదే సబ్సిడీ ఇస్తామన్నా ఎంతనేది చెప్పలేదు.  
టీడీపీ విధానాల వల్ల తెలంగాణలో సహకార రంగం నిర్వీర్యమైంది. ఇప్పుడు తెరాస దీనిపై దృష్టిసారిస్తే మంచిది. 

 మేనిఫెస్టోలు ఉండాలిలా.. 
రైతులకు సరైన వేళకు నాణ్యమైన విత్తనాలు అందేలా విత్తన చట్టం తేవాలి. దళారుల ప్రమేయాన్ని నిర్మూలించాలి. గ్రామీణ విత్తన సంప్రదాయాలను పునరుద్ధరించే కార్యక్రమాలు చేపట్టాలి. విత్తన ధరల నియంత్రణ, సత్వర నష్ట పరిహారం చెల్లింపు, విత్తన కంపెనీలు, డీలర్లపై క్రిమినల్‌ చర్యలు, జన్యు మార్పిడి పంటలపై నియంత్రణ ప్రతిపాదనలను చట్టంలో పొందుపరచాలి. 
చెరువులు, కుంటలు, కాలువల పూడికతీత ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెంచడం, చెరువులను, నదీ జలాలతో అనుసంధానించడం ద్వారా నీటి లభ్యత పెంచడం తక్షణ కర్తవ్యం. పంచాయతీరాజ్‌ , ఇరిగేషన్‌ శాఖల పనితీరు వల్ల స్థానికులు తమ నీటి వనరుల మీద ‘తమది’ అనే భావన పోగొట్టుకున్నారు. నీటి వ్యవస్థల నిర్వహణలో  ప్రజలు, పంచాయతీల భాగస్వామ్యం తప్పనిసరి.  
- తెలంగాణలో వ్యవసాయ యోగ్య భూమి తగ్గిపోతోంది. కాలుష్యం, కరువు, నీటి కొరత వంటి కారణాలతో మట్టిపొర సన్నబడి సారాన్ని కోల్పోతోంది. వ్యవసాయ భూములు ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారు. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది.  
తెలంగాణ భూముల వర్గీకరణపై మళ్లీ కసరత్తు చేయాలి. గతంలో చేసిన వర్గీకరణ సరిగా లేదు. కంచె భూములను ‘పడిత్‌’ భూములుగా వర్గీకరించడం ఇందుకు ఉదాహరణ  
ఇసుక తవ్వకాలు, గుట్టలను తొలగించడాన్ని నియంత్రించాలి. లేకుంటే నీటి పరివాహక వ్యవస్థలు దెబ్బతింటాయి. ఇసుక క్వారీలపై ప్రభుత్వ నియంత్రణ కరువై  స్థానిక నీటి వనరులపై దుష్ప్రభావం పడుతోంది.  
సిక్కిం రాష్ట్రం లాగా, తెలంగాణ రాష్ట్రాన్ని సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా ప్రకటించే దిశగా తెలంగాణ ప్రభుత్వం  పనిచేయాలి. 
తెలంగాణలో సమీకృత వ్యవసాయం చాలా అవసరం. దీనిపై అధ్యయనం, పరిశోధనలు జరిగేలా చూడాలి. విశ్వవిద్యాలయాల్లో ప్రాధాన్యతలు పెంచాలి. తెలంగాణ ప్రాంతానికి అనుగుణమైన పాఠ్యాంశాలు బోధించే వసతులు ఉండాలి.  
వ్యవసాయ మార్కెట్లలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కనీస మద్దతు ధరలు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో నిర్ణయించి, ప్రభుత్వమే కొనుగోలు చేస్తే రైతులకు లాభం. 
పంటల బీమా పథకాన్ని మార్చాలి. పంట నష్టపోయిన రైతులకు మండల స్థాయిలోనే పరిహారం అందించాలి.  
బెల్లం, పసుపు, చెరుకు, వేరుశెనగ, పత్తి, వరి రైతుల వికాసానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. పరిశోధన కేంద్రంతో పాటు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలి.  
వ్యవసాయానికి రుణ మాఫీ అవసరమే. కానీ రూ.లక్ష అనే పరిమితి బాగాలేదు. ఇదే హామీని కొంత తిరగ రాస్తే మేలు. వాస్తవంగా, బ్యాంకు రుణాలు చిన్న సన్నకారు రైతులకు ఇచ్చే పరిమాణం చాలా తక్కువ. వీరందరూ ప్రైవేటు రుణాలపై ఆధారపడిన వారే. రుణ మాఫీ పథకం వల్ల వాళ్లకు ఉపయోగం లేదు. బ్యాంకు రుణం అందని చిన్న, సన్నకారు రైతుల అప్పుల బాధలు తీరాలంటే, అర్హుడైన ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం నేరుగా, రూ.30 వేలకు మించకుండా, డబ్బు జమ చేయాలి. బ్యాంకు రుణం తీసుకున్న వారికి, కిస్తీలు కట్టేవారికి రుణమాఫీ ముందుగా వర్తింప చేసి, కట్టనివారికి రుణం రీషెడ్యూల్‌ చేస్తే అందరికీ ఉపయోగం. 
- తెలంగాణలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ‘మోట బాయి’ సేద్యం ప్రోత్సహిస్తే అనువుగా ఉంటుంది. 
తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ దిశగా ఆలోచిస్తే పరిపూర్ణ ప్రణాళికకు అవకాశం ఉంటుంది. వ్యవసాయ బడ్జెట్‌ పెంచాల్సిన అవసరం ఉంది.  
ఎన్నికలలో ప్రజాప్రతినిధులుగా కంపెనీల యజమానులు, కాంట్రాక్టర్లు, మైనింగ్‌ యజమానులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలనే రాజకీయ పార్టీలు ఎంపిక చేస్తున్నాయి. దీని వల్ల, వ్యవసాయాన్ని, రైతులను పట్టించుకుని, వారి అవసరాల కనుగుణంగా విధానాలు మార్చే నాయకత్వం లేదు. అందువల్ల రైతాంగానికీ రాజకీయ, పాలనాపరమైన అవకాశాలు కల్పించాలి.  
కరెంట్‌ షాక్, పాము కాటుతో చనిపోయిన, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సంబంధించి జీవో 421ను సవరించి, నష్ట పరిహారం రూ.5 లక్షలకు పెంచాలి. రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక పద్దు/నిధి ఉండాలి. 
రుణమాఫీని వన్‌ టైం సెటిల్మెంట్‌ చేయాలి. 
ఆహార ధాన్యాల సేకరణ ప్రభుత్వమే చేపట్టాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇటీవలి నిర్ణయాలు ధాన్యం సేకరణను తగ్గించే దిశగా ఉన్నాయి. వాటిని ఉపసంహరించుకోవాలి. 
ప్రత్యేక చట్టం ద్వారా వ్యవసాయ కమిషన్‌ ఏర్పాటు చేయాలి. రైతాంగ సమస్యలను దీని పరిధిలోకి తేవాలి.   
..:: గెస్ట్‌ వాయిస్‌
 డాక్టర్‌ దొంతి నరసింహారెడ్డి
వ్యవసాయ రంగ నిపుణులు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top